అసిఫ్ అలీ జర్దారీ
ఇస్లామాబాద్: నకిలీ ఖాతాల ద్వారా సుమారు రూ.22 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడిన కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆస్తులను జప్తు చేయాల్సిందిగా జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జేఐటీ) సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. ఈమేరకు జేఐటీ.. కరాచీ, లాహోర్‌లలోని ప్రఖ్యాత బిలావల్ హౌజ్, ఇస్లామాబాద్‌లోని జర్దారీ ఇంటిని జప్తుచేయాలని కోరుతూ శనివారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. కరాచీలోని 5 ప్లాట్లతో పాటు న్యూయార్క్, దుబాయిల్లో ఉన్న జర్దారీ ఆస్తులను కూడా జప్తు చేయాలంది. దర్యాప్తు బృందం జర్దారీ పట్టణ, వ్యవసాయ భూములు, జర్దారీ గ్రూప్, అతని సోదరి ఫరీల్ తాల్పూర్ ఆస్తులపై విచారణ జరపాల్సిందిగా నివేదికలో కోరింది.
జర్దారీ, ఓమ్ని గ్రూప్స్ ప్రభుత్వ నిధుల్లో అక్రమాలకు పాల్పడినట్లు, నగదును ‘హుండి’, ‘హవాలా’ ద్వారా దేశం నుంచి బదిలీ చేసినట్లు ఆరోపించింది. ఆయన ఆస్తులను దేశం నుంచి బదిలీ చేసే అవకాశం ఉన్నందున ఈ కేసులో తీర్పు వెలువడే వరకు ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోరింది. కాగా, జర్దారీ, తాల్పూర్‌లు ఈ నివేదికను ఊహాగానాలుగా, రాజకీయ వేధింపులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారని ఆరోపించారు. జర్దారీ, ఇక్బాల్ మెమాన్ పేరుతో ఓ బినామీ కంపెనీని స్థాపించగా, దాన్ని 1998లో జప్తు చేశారు. ఈ కేసులో జర్దారీ అత్యంత సన్నిహితుడైన హుస్సేన్ లవాయి గతేడాది జూలైలో అరెస్టు కాగా, మరో సన్నిహితుడు ఓమ్ని గ్రూప్ చైర్మన్ అన్వర్ మజీద్, అతని కుమారుడు అబ్దుల్ ఘనీ మజీద్‌ను గతేడాది ఆగస్టులో అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment