ముద్దాయి ట్రంప్‌!...రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత? | Donald Trump to become first ex-US president to face criminal case | Sakshi
Sakshi News home page

ముద్దాయి ట్రంప్‌!...రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత?

Published Sat, Apr 1 2023 3:58 AM | Last Updated on Sat, Apr 1 2023 8:17 AM

Donald Trump to become first ex-US president to face criminal case - Sakshi

న్యూయార్క్‌: అమెరికా చరిత్రలో రాజకీయంగా మరో పెను సంచలనానికి తెరలేచింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముందే చెప్పినట్టుగా ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయి. పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ (స్టెఫానీ గ్రెగరీ క్లిఫర్డ్‌)తో లైంగిక సంబంధాలు బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బులు చెల్లించి అనైతిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్న ఆరోపణల కేసులో డొనాల్డ్‌ ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ గ్రాండ్‌ జ్యూరీ నేరాభియోగాలు నమోదు చేసినట్టుగా ధ్రువీకరించింది.

ట్రంప్‌ లాయర్లతో కేసు విచారణను పర్యవేక్షిస్తున్న మన్‌హట్టన్‌ అటార్నీ జనరల్‌ అల్విన్‌ బ్రాగ్‌ మాట్లాడారు. ట్రంప్‌ లొంగిపోవడానికి సహకరించాలని కూడా బ్రాగ్‌ సూచించారు. దీంతో ట్రంప్‌ క్రిమినల్‌ కేసు విచారణను ఎదుర్కోవడంతో పాటు ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొన్న మొట్టమొదటి మాజీ అధ్యక్షుడిగా అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టాలని కలలు కంటున్న వేళ నేరాభియోగాలు నమోదు కావడం నైతికంగా ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. తనను అరెస్ట్‌ చేస్తారని, అదే జరిగితే రిపబ్లికన్‌ శ్రేణు లు, తన అభిమానులు దేశవ్యాప్తంగా ఘర్షణలకు దిగాలని కూడా గత వారం ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

వేలి ముద్రలు, ఫొటో తీసుకొని...
ట్రంప్‌ కోర్టులో లొంగిపోతే ఆయన అరెస్ట్‌ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ట్రంప్‌ న్యూయార్క్‌ అధికారులకి సహకరిస్తారని ఆయన తరఫు లాయర్‌ స్పష్టం చేయడంతో ఆయనపై ఎలాంటి అరెస్ట్‌ వారెంట్లు జారీ చేయలేదు. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్‌కి సొంతంగా విమా నం ఉంది. న్యూయార్క్‌లో ఏదైనా విమానాశ్రయానికి తన విమానంలో వెళ్లి అక్కడ్నుంచి మన్‌హట్టన్‌ కోర్టు హాలుకి కారులో వెళతారు. మంగళవారం నాడు ట్రంప్‌ కోర్టు ఎదుట లొంగిపోయే అవకాశాలున్నాయి.

సర్వసాధారణంగా సామాన్య నిందితుల్ని కోర్టులో హాజరు పరచాలంటే వారికి సంకెళ్లు వేసి నడిపించుకుంటూ తీసుకువెళతారు. కానీ ట్రంప్‌ దేశానికి మాజీ అధ్య క్షుడు కావడంతో అలా జరిగే అవకాశాల్లేవు. మీడి యా కవరేజీకి అవకాశం లేకుండా ట్రంప్‌ని ప్రత్యేక ద్వారం నుంచి లోపలికి అనుమతించే అవకాశాలున్నా యి. క్రిమినల్‌ కేసులో అభియోగాలు నమోదు కావడంతో ట్రంప్‌ వేలిముద్రలు, పోలీసు రికా ర్డుల కోసం ఆయన ఫొటో తీసుకుంటారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడానికి ముందు ట్రంప్‌ని ప్రత్యేక సెల్‌లో ఉంచే బదులుగా వేరే ఒక గదిలో ఉంచుతారు. ఒక్కసారి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన తర్వాత ఈ కేసు పురోగతి ఎలా ఉండబోతుందన్నది తెలుస్తుంది.

బెయిల్‌ లభిస్తుందా?
ట్రంప్‌పై నేరాభియోగాలు మోపిన న్యూయార్క్‌ జ్యూరీ ఆ అభియోగాల పత్రాన్ని సీల్‌ వేసి ఉంచింది. ట్రంప్‌ను అరెస్ట్‌ చేసిన తర్వాతే సీల్‌ విప్పుతారు. ఈ కేసుని విచారించే న్యాయమూర్తి స్వయంగా కోర్టు హాలులో నేరాభియోగాలను చదివి వినిపిస్తారు. ఆయనపై ఏయే సెక్షన్ల కింద ఎలాంటి అభియోగాలు నమోదయ్యాయో అప్పుడే అందరికీ తెలుస్తుంది. ఆ అభియోగాలను బట్టి ఆయనకు బెయిల్‌ లభిస్తుందా, లేదా అన్నది స్పష్టమవుతుంది. ట్రంప్‌పై ప్రయాణపరమైన ఆంక్షలుంటాయా, లేదా వంటివన్నీ కూడా ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరైన తర్వాతే తేలుతాయి. ఈ కేసులో దోషిగా తేలితే ట్రంప్‌కు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. భారీగా జరిమానా కూడా విధిస్తారని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు.

రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత?
రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ తనపై మోపిన అభియోగాలను రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే వ్యూహాల్లో ఉన్నారు. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ పరిణామాన్ని రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ప్రచారం చేయడానికి ట్రంప్‌ మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై అభియోగాలను ప్రాసిక్యూషన్‌ రుజువు చెయ్యలేకపోతే ట్రంప్‌ తన ఇమేజ్‌ మరింత పెరుగుతుందన్న భావనలో ఉన్నారు. అయితే రిపబ్లికన్‌ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ మద్దతుదారులు ఈ కేసు వల్ల అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీకి జరిగే లాభంపై ఇప్పట్నుంచే లెక్కలు వేస్తున్నారు.

‘‘ఇది చాలా చిన్న కేసు. ట్రంప్‌ను వేధించడానికే ఈ కేసుని బయటకు తెచ్చారు’’అని న్యూహ్యాంప్‌షైర్‌లో రిపబ్లికన్‌ పార్టీ చీఫ్‌ గ్రెగ్‌ హగ్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి కావాలంటే పార్టీలో 25 నుంచి 30 శాతం కంటే ఎక్కువ మంది ఆయనకు మద్దతు పలకాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అది కష్టమని ప్రత్యర్థి శిబిరం భావిస్తోంది. నేరాభియోగాలు ఎదుర్కొన్నా, శిక్షపడి జైలుకి వెళ్లినా ఎన్నికల్లో పోటీ చేయకూడదని అమెరికన్‌ రాజ్యాంగంలో నిబంధనలు లేవు. కానీ అలాంటి వ్యక్తిని అధ్యక్ష అభ్యర్థిని చేస్తే అనవసరంగా పార్టీ పరువు పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేరాభియోగాలతో ట్రంప్‌ ఇమేజ్‌ మరింత డ్యామేజ్‌ అయి మరో అభ్యర్థి, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెసాంటిస్‌కు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది.   


రాజకీయ అణచివేత: ట్రంప్‌
రాజకీయంగా తనను అణచివేయడానికి డెమొక్రాట్లు ఈ కుట్రకు పాల్పడ్డారని ట్రంప్‌ ఆరోపించారు. తనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిన వెంటనే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇదంతా రాజకీయ అణచివేత. దేశ చరిత్రలో ఎన్నికల పరంగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న జోక్యం ఇది. రాజకీయ ప్రత్యర్థుల్ని శిక్షించడానికి న్యాయవ్యవస్థని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. నన్ను లొంగదీసుకోవడానికి డెమొక్రాట్లు అబద్ధాలు చెప్పారు. మోసాలు చేశారు. దొంగతనాలకు పాల్పడ్డారు. చివరికి ఇలాంటి అనూహ్యమైన చర్యకి దిగారు. ఒక అమాయకుడిపై అభియోగాలు నమోదు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌ ఏం చెబితే మన్‌హట్టన్‌ జ్యూరీ అదే చేస్తోంది’’అని ట్రంప్‌ ఆ ప్రకటనలో విరుచుకుపడ్డారు. మరోవైపు ట్రంప్‌ తరఫు లాయర్లు ఆయన ఏ తప్పు చేయలేదని దీనిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

కేసు నేపథ్యం ఇదీ..
2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ తనతో ఉన్న లైంగిక సంబంధాలను బయటపెట్టకుండా ఉండేందుకు పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ను డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారన్న ఆరోపణలున్నాయి. అధ్యక్షుడిగా తన పరువు తీయకుండా ఉండడానికి ట్రంప్‌ లక్షా 30 వేల డాలర్లను అప్పట్లో తన లాయర్‌ మైఖేల్‌ కొహెన్‌ ద్వారా ముట్టజెప్పినట్టు డేనియల్స్‌ ఆరోపించారు. ఆ ఒప్పందం చెల్లదంటూ 2018లో ఆమె కోర్టుకెక్కారు. 2006 సంవత్సరంలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గోల్ఫ్‌కోర్టులో ట్రంప్‌ పరిచయమయ్యారని, తనతో గడిపితే ఆయన నిర్వహించే రియాల్టీ షో ’ది అప్రెంటీస్‌’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించారని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు.

ఆ తర్వాత తరచూ ఫోన్‌లో మాట్లాడేవారని 2007లో కలిసినప్పుడు ట్రంప్‌తో సన్నిహితంగా గడపడానికి నిరాకరించానని, అందుకే తనకు ఆ షో లో అవకాశం ఇవ్వకుండా ముఖం చాటేశారని తెలిపారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్‌ ఆరోపించారు. అయితే ట్రంప్‌ ఆమె ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇప్పుడు జ్యూరీ అభియోగాలు నమోదు చేయడంతో డేనియెల్స్‌ తన మద్దతుదారులందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనకు ఎన్నో సందేశాలు వస్తున్నా స్పందించలేకపోతున్నానని, సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నానని ట్వీట్‌ చేశారు.

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement