Manhattan court
-
మహాపరాధి ట్రంప్!
అధికారంలోకొచ్చింది మొదలు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నేరస్తుడిగా నిరూపించాలని తపిస్తున్న డెమాక్రాటిక్ పార్టీ వాంఛ చివరి అంకంలో నెరవేరింది. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ నోరు మూయించడానికి భారీగా సొమ్ము ముట్టజెప్పి, ఆ మొత్తాన్ని ట్రంప్ తన కంపెనీ ఖాతాల్లో వేరేగా చూపారన్న ఆరోపణ రుజువు కావటంతో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయన్ను మహాపరాధిగా తేల్చింది. భిన్న రంగాలకు చెందిన అయిదుగురు మహిళలతో సహా 12 మందితో కూడిన జ్యూరీ... ఈ వ్యవహారంలో ట్రంప్‌కు విధించబోయే శిక్ష ఏమిటన్నది ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెల 11న వెల్లడించే ఆ శిక్ష తప్పనిసరిగా కారాగారవాసమే కానవసరం లేదని, అది జరిమానా మొదలుకొని ప్రొబేషన్‌లో ఉంచటం వరకూ ఏదైనా కావొచ్చన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇది క్రిమినల్ కేసే అయినా వ్యక్తిని హతమార్చటం వంటిది కాదు గనుక జైలు శిక్ష ఉండకపోవచ్చంటున్నారు. జైలుకు పోయినా పోకపోయినా దేశాధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడటానికి అదేమీ అవరోధం కాదు. తీర్పు వెలువరించే ముందు జ్యూరీకి నాయకత్వం వహించిన న్యాయమూర్తి జువాన్ మెర్కన్ తన సహచరులను లాంఛనంగా ‘తీర్పుతో మీరు ఏకభవిస్తున్నట్టేనా...’ అని అడగటం, వారు అంగీకారాన్ని తెలపటం పూర్తయ్యాక ట్రంప్ అక్కడినుంచి నిష్క్రమించారు. వెళ్లేముందు ‘ఇది మోసపూరితమైన, సిగ్గుమాలిన తీర్పు. అసలు తీర్పును నవంబర్ 5న అమెరికా ప్రజలివ్వబోతున్నారు’ అని ఆయన చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. వచ్చే అయిదారు నెలల్లో ఆ దేశ రాజకీయ పోకడలెలా ఉండబోతున్నాయో ట్రంప్ వ్యాఖ్య చెబుతోంది. ట్రంప్ నేరం రుజువై అపరాధిగా తేలిన తొలి కేసు ఇదే.దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్‌ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఏకరువు పెట్టగా, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్‌కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. 2006 నాటి తన రాసలీలల సంగతి బయటపెట్టొద్దని అభ్యర్థిస్తూ న్యాయవాది ద్వారా స్టార్మీకి పంపిన 1,30,000 డాలర్ల డబ్బే ఇప్పుడు ట్రంప్‌ను నిండా ముంచింది. ఈ కేసులో వచ్చిన మొత్తం 34 అభియోగాలూ రుజువయ్యాయని న్యాయస్థానం తేల్చింది. ట్రంప్ గద్దెనెక్కకుండా నిరోధించేది ప్రజా తీర్పేనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా ఆ విషయంలో డెమాక్రాటిక్ పార్టీకి పెద్దగా ఆశలున్నట్టు కనబడదు. తటస్థులైన ఓటర్లలో ఒకటి రెండు శాతంమంది తాజా తీర్పు వెలువడ్డాక ట్రంప్‌కు వోటేయాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పినా అదేమంత ఉపయోగపడేలా కనబడటం లేదు. తొక్కేయాలని చూస్తున్నకొద్దీ ఆయన మరింత బలశాలిగా మారుతున్నాడంటూ రిపబ్లికన్ వ్యూహకర్త స్కాట్ రీడ్ చేసిన వ్యాఖ్య అవాస్తవం కాదు. గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరగటం, ఆయనకొచ్చే విరాళాల వెల్లువ ఇందుకు తార్కాణం. అయిదారేళ్లుగా రిపబ్లికన్ పార్టీ తన సామాజిక మాధ్యమాల ద్వారా, ఫాక్స్ న్యూస్ వంటి పార్టీ అనుకూల మీడియా ద్వారా సాగిస్తున్న ప్రచారం దీనికి కారణం. పార్టీ మొత్తం ట్రంప్ వెనక దృఢంగా నిలబడి ఆయన మాటలనూ, చేష్టలనూ సమర్థిస్తూ వచ్చింది. తమ నాయకుడిది తప్పంటున్న డెమాక్రాటిక్ నేతలే నేరగాళ్లంటూ ఊదరగొట్టింది. వీటి మాటెలావున్నా న్యాయస్థానం మహాపరాధిగా తేల్చిన వ్యక్తి దేశాధ్యక్షుడిగా వ్యవహరించటం సరైందేనా అన్న మీమాంస నడుస్తోంది. నాలుగు వందల ఏళ్లనాటి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సందేహాలు ఎప్పుడూ రాలేదు. నేర నిరూపణ అయిన వ్యక్తి వందేళ్ల క్రితం జైలునుంచి పోటీచేసిన చరిత్రవున్నా మాజీ అధ్యక్షుడు మహాపరాధిగా తేలటం, ఆయనే మరోసారి బరిలో దిగటం కనీవినీ ఎరుగనిది. ఈ విషయంలో రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనేదీ లేదు. ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థికి రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని బదలాయించటానికి బదులు అనుచరులను రెచ్చగొట్టి అవరోధాలు సృష్టించాలని చూసిన ట్రంప్‌కు ఇప్పటికీ వ్యవస్థలంటే గౌరవం లేదు. తిరిగి నెగ్గితే ఆయన చేయబోయే పనుల్లో వలసలను కట్టడి చేయటం మొదలుకొని అంతర్జాతీయ సాయానికి కత్తెరేయటం వరకూ చాలావున్నాయి. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రతను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. గెలిచి అందలమెక్కితే ట్రంప్‌పై కేసులు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే కాదు... అమెరికాకు సైతం సమస్యగా మారడం ఖాయం. -
Trump: ఇది కుట్రే.. ఎన్నికల మోసానికి పాల్పడ్డారు!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చొబోతున్న డొనాల్డ్ ట్రంప్‌నకు గడ్డు పరిస్థితులు తప్పడం లేదు. గతంలోని తన రాసలీలల బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆయన ఓ మాజీ శృంగార తారకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వ్యవహారంతో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా మోసానికి పాల్పడ్డారంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదిస్తోంది. 2016 ఎన్నికల ప్రచారం సమయంలో.. స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం(నాన్‌డిజ్‌క్లోజర్ అగ్రిమెంట్) చేసుకున్నాడనే ఆరోపణలు ట్రంప్‌పై ఉన్నాయి. ఈ తరుణంలో.. సదరు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత ఆ పో*స్టార్ కోర్టును ఆశ్రయించింది. అటుపై ఆయన అధ్యక్ష పదవిలో ఉండడంతో హైప్రొఫైల్ కేసుగా దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి. చివరికి.. న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్ పై నేరారోపణలు చేసింది. తద్వారా అమెరికాలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు చరిత్రకెక్కింది. అయితే తొలిరోజు విచారణ సందర్భంగా.. న్యూయార్క్ కోర్టులో వాడీవేడి వాదనలే జరిగాయి. ప్రాసిక్యూటర్ మాథ్యూ కోలాంగెలో వాదనలు వినిపిస్తూ.. 2016 ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మోసానికి పాల్పడ్డారు. తన పరువు పోకుండా ఉండేందుకు శతవిధాల యత్నించారు. ఇందుకోసం సె* స్కాండల్‌ను కప్పి పుచ్చేలా వ్యవహరించారు. ట్రంప్ టవర్ ఇందుకు వేదిక అయ్యింది. ఇది దీర్ఘకాలికంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర. తన గురించి చెడుగా మాట్లాడకుండా కొందరి నోళ్లు మూయించడానికి ఆయన డబ్బు ఖర్చు చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఆ ఖర్చు ఎన్నికలను ప్రభావితం చేసే అంశమే. కచ్చితంగా ఇది ఎన్నికల మోసం కిందకే వస్తుంది’’ అయితే ట్రంప్ తరఫు న్యాయవాది టాడ్ బ్లాంచె మాత్రం ఆ అభియోగాలను ఖండించారు. ట్రంప్ అమాయకుడని, ఎలాంటి నేరం చేయలేదని, అసలు మాన్‌హట్టన్ అటార్నీ ఆఫీస్ ఈ కేసును ఏనాడూ ప్రస్తావించలేదని వాదించారు. ఇక ఈ కేసులో ఇంకా వాదనలు కొనసాగాల్సి ఉంది. ట్రంప్ గతంలో అధ్యక్ష పదవిలో రెండుసార్లు అభిశంసన తీర్మానం ఎదుర్కొని నెగ్గారు. యూఎస్ కాపిటల్ మీద దాడి ఘటన, అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో ఉన్నప్పుడు కీలకమైన పత్రాల మిస్సింగ్(వాటిని నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి).. తదితర అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సె* స్కాండల్ కుంభకోణంలో గనుక ట్రంప్ కోర్టు విచారణ ద్వారా ఆయన జీవిత పుస్తకంలో మాయని మచ్చ ఏర్పడినట్లయ్యింది. -
ఇంతకీ ట్రంప్ చేసిన నేరం ఏమిటి?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trumpపై క్రిమినల్ అభియోగాలు నమోదు కావడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన మోసాలకు పాల్పడిన ట్రంప్‌పై ఏకంగా 34 నిందారోపణలు అయ్యాయి. ఓ శృంగార తారతో పాటు ఓ ప్లేబాయ్ మాజీ మోడల్‌తో సంబంధంతో బయట పడకుండా ఉండేందుకు ఆయన చేసుకున్న అనైతిక ఒప్పందాలే ఆయన్ని ఇలా ఇరకాటంలో పడేశాయి. అనైతిక ఒప్పందాలతో వ్యాపార ఒప్పందాల్లో మోసాలకు పాల్పడడం, తద్వారా తన కంపెనీలలో పన్నుల ఎగవేత కుంభకోణం.. ఇది సంక్లిప్తంగా ట్రంప్‌పై మోపబడ్డ అభియోగాల సారాంశం. ఇంతకీ ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగింది?.. ట్రంప్ దోషిగా తేలినా ఆయన రాజకీయ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడదా? ఆ అంశాల్లోకి వెళ్తే.. ► స్టార్మీ డేనియల్స్ ఓ శృంగార తార(మాజీ). 2006లో నెవడాలోని సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భంగా తొలిసారి ఆమె ట్రంప్‌ను కలుసుకుంది. ఆ సమయానికి ఆమె వయసు 27 ఏళ్లు. ట్రంప్ వయసు 60. ఆ తర్వాత టీవీ షోలో పాత్ర కోసం లాస్ ఏంజెల్స్‌లోని తన బేవర్లీహిల్స్ ఇంట్లో కలవాలని ట్రంప్, డేనియల్స్‌కు తన బాడీ గార్డు ద్వారా కబురు పంపారు. అక్కడే డిన్నర్ చేశాక.. ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. ► వాస్తవానికి 2011లోనే ఆమె ట్రంప్‌తో సంబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టినా.. అప్పుడు ఆ అంశానికి పెద్దగా ఫోకస్ దక్కలేదు. ► 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో.. తనకు ఇచ్చిన మాట తప్పడంతో ఈ శృంగార తార సంబంధం బయటపెట్టేందుకు సిద్ధమైంది. అయితే తన లాయర్ ద్వారా ఆమెతో ఒప్పందం చేసుకుని.. డబ్బు ద్వారా ఆమె నోరు మూయించే యత్నం చేశాడు ట్రంప్. ► ఆ సమయంలో ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న మైకేల్ కోహెన్.. డేనియల్స్‌కు లక్షా 30 వేల డాలర్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఆమె గప్‌చుప్‌గా ఉండిపోగా.. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందారు. ► 2018 జనవరిలో ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారామె. అప్పటికి ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉండేసరికి.. ఇదొక హైప్రొఫైల్ కేసు అయ్యింది. ఆమె ఆరోపణలపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ► అయితే విచారణలో కోహెన్ మాత్రం అది తన సొంత డబ్బు అని, ట్రంప్ చెల్లించలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఏడాది.. ఫుల్ డిస్క్లోజర్ అనే పుస్తకం ద్వారా ట్రంప్‌తో తనకు జరిగిన పరిచయం, ఆపై విషయాలను ప్రచురించింది స్టార్మీ డేనియల్స్. ఈలోపు ట్రంప్ తన ప్రచార నిధి నుంచి కాకుండా.. సొంత డబ్బును ఈ అనైతిక ఒప్పందం కోసం చెల్లించాడనే వాదన తెర మీదకు వచ్చింది. ► 2018 ఫిబ్రవరిలో కోహెన్ తన సొంత డబ్బును డేనియల్స్‌కు చెల్లించినట్లు బుకాయించాడు. అయితే.. చివరకు 2018 ఆగస్టులో కోహెన్ నేరం అంగీకరించాడు. ట్రంప్ ప్రచార నిధి నుంచే ఆ డబ్బు చెల్లించినట్లు చెప్పాడు. దీంతో అదే ఏడాది డిసెంబర్లో కోర్టు కోహెన్‌కు మూడేళ్ల శిక్ష ఖరారు చేసింది. ► 2019 ఆగష్టులో.. ఆ అనైతిక ఒప్పందం చెల్లింపులకు సంబంధించిన రికార్డులను సమర్పించాలంటూ మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ ఆదేశించడంతో.. ట్రంప్ ఇరకాటంలో పడినట్లయ్యింది. పన్నుల కుంభకోణంలో.. ట్రంప్ సంస్థ తప్పిదం చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ► అనైతిక ఒప్పందం.. తద్వారా పన్నుల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ట్రంప్ కంపెనీపై అభియోగం నమోదు అయ్యింది. 2023, జనవరిలో.. గ్రాండ్ జ్యూరీ ఎదుట ట్రంప్ అనైతిక ఒప్పందానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. మార్చిలో.. గ్రాండ్ జ్యూరీ ఎదుట హాజరు కావాలంటూ ట్రంప్‌కు ఆదేశాలు జారీ కాగా, వాటిని ట్రంప్ తిరస్కరించాడు. ► చివరకు.. 2023 మార్చి చివరి వారంలో మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ ఆయనపై అభియోగాల నమోదు దిశగా సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆయన లొంగిపోతారంటూ ట్రంప్ తరపు న్యాయవాది ముందుగానే సంకేతాలు ఇచ్చారు. ► కోర్టు ఆయనపై నేరాభియోగాలు మోపడానికి, అరెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వడానికంటే ముందే మాన్‌హట్టన్ కోర్టులో లొంగిపోవడానికి వెళ్లారు డొనాల్డ్ ట్రంప్‌ను. కానీ, సినీ ఫక్కీలో పోలీసులు అరెస్ట్ చేశారు. అటుపై లీగల్ టీంతో కలిసి కోర్టు విచారణలో పాల్గొన్నారు ట్రంప్. గంట పాటు వాదనలు జరగ్గా.. చివరకు బయటకు వచ్చి ఫ్లోరిడాలోని ఇంటికి వెళ్లిపోవడంతో ప్రస్తుతానికి ఎపిసోడ్‌కు కామా పడినట్లయ్యింది. ► డిసెంబర్లో(4వతేదీన) ఈ కేసుకు సంబంధించి మరోసారి ట్రంప్ విచారణకు కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ► ఇండియానాకు చెందిన మోడల్, నటి మెక్‌డగల్(52).. 90వ దశకంలో ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం పని చేసింది. 2006-07 సమయంలో ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని, అది బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ ద్వారా తనకు కొంత డబ్బు ముట్టజెప్పాడని అంటోంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ వ్యవహారాన్ని బయట పెట్టేందుకు ఓ మీడియా సంస్థ ద్వారా లక్షా యాభై వేల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సదరు మీడియా ఏజెన్సీ.. మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ ముందు అంగీకరించింది కూడా. ► ఏది ఏమైనా అమెరికా చరిత్రలోనే తొలిసారి క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ట్రంప్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయన అధ్యక్ష ఎన్నిక అభ్యర్థితత్వంపై ఎలాంటి ప్రభావం పడకపోవచ్చని న్యాయనిపుణులు చెప్తున్నారు. అలాగే.. న్యూయార్క్ చట్టాల దృష్టిలో తక్కువ తీవ్రమైనవి. ఒక్కో లెక్కన వాటన్నింటికి పడేది నాలుగేళ్ల శిక్ష మాత్రమే. ఒకవేళ దోషిగా తేలి శిక్షపడినా కూడా.. ట్రంప్ ప్రొబేషన్ శిక్షనే ఎదుర్కొంటారు తప్ప ఆయనకు పెద్దగా ఇబ్బంది ఉండదనేది అక్కడి న్యాయనిపుణుల మాట. కానీ, తొలి నుంచి ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్న ట్రంప్.. పరిస్థితి అంతదాకా రాదని, పోరాటం ద్వారా రాజకీయ కుట్రను తిప్పి కొడతానని అంటున్నారు. -
నేనే నేరమూ చేయలేదు
న్యూయార్క్/వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో తనపై నమోదైన క్రిమినల్ నేరాభియోగాలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) అంగీకరించలేదు. తాను ఏ నేరమూ చేయలేదంటూ కోర్టు ముందు వాంగ్మూలమిచ్చారు. ప్రపంచమంతటి దృష్టినీ ఆకర్షించిన ఈ సంచలనాత్మక కేసులో మంగళవారం ఆయన మన్హాటన్ క్రిమినల్ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30కు కోర్టు వద్దకు చేరుకున్నారు. తన లాయర్లతో కలిసి కోర్టు ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. ఆ క్షణమే ఆయన సాంకేతికంగా అరెస్టయినట్టు అధికారులు ప్రకటించారు. ‘మిస్టర్ ట్రంప్! యూ ఆర్ అండర్ అరెస్ట్’ అని చెప్పి పోలీసులు ఆయన్ను లోనికి తీసుకెళ్లినట్టు సమాచారం. అనంతరం విచారణకు ముందు రికార్డుల నిమిత్తం ట్రంప్ వేలిముద్రలు, ఫొటో తీసుకున్నట్టు చెబుతున్నారు. మధ్యాహ్నం 2.30కు 15వ అంతస్తులో ఉన్న కోర్టు గదిలోకి ట్రంప్ ప్రవేశించారు. మామూలుగా నిందితుల మాదిరిగా బేడీలు వేయకుండానే ఆయన్ను జడ్జి ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీక్రెట్ సర్విస్ బాడీగార్డులు ట్రంప్ వెన్నంటే ఉన్నారు. అనంతరం ట్రంప్‌పై దాఖలైన 34 అభియోగాలను జడ్జి జువాన్ మాన్యుయల్ మర్చన్ చదివి విన్పించారు. వాటిలో దేనితోనూ తనకు సంబంధం లేదని ట్రంప్ వాంగ్మూలమిచ్చారు. ప్రతి అభియోగాన్నీ చట్టపరంగా ఎదుర్కొంటారని ఆయన లాయర్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3.30 సమయంలో కోర్టు నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత ఫ్లోరిడా పయనమయ్యారు. శృంగార చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్ (44)తో అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు ఆమెకు డబ్బుల చెల్లింపు వ్యవహారం ట్రంప్ మెడకు చుట్టుకోవడం, క్రిమినల్ నేరాభియోగాలకు దారితీయడం తెలిసిందే. అమెరికా చరిత్రలో అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు. ఆయన విచారణ సందర్భంగా న్యూయార్క్‌లో మన్హాటన్ జ్యూరీ లేన్ మొత్తం మీడియాతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో మీడియా కంటపడకుండా ఉండేందుకు ట్రంప్ తన కాన్వాయ్‌తో కోర్టు భవనంలోకి వెనకవైపుగా ప్రవేశించారు. ట్రంప్ విజ్ఞప్తి మేరకు విచారణకు మీడియాను కోర్టు గదిలోకి జడ్జి అనుమతించలేదు. అంతేగాక విచారణ ప్రక్రియను ప్రసారం చేయరాదని సోమవారమే ఆదేశాలు జారీ చేశారు. విచారణ మొదలయ్యే ముందు ఫొటోలు తీసుకునేందుకు ఐదుగురు ఫొటోగ్రాఫర్లను మాత్రం అనుమతించారు. భారీ భద్రత అంతకుముందు విచారణ నిమిత్తం సోమవారం రాత్రే ట్రంప్ ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి సొంత బోయింగ్ 757 విమానంలో న్యూయార్క్ చేరుకున్నారు. తన అభిమానులకు అభివాదం చేస్తూ హడావుడి చేసిన అనంతరం ట్రంప్ టవర్‌లో బస చేశారు. విచారణ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్ అధ్యక్షునిగా ఉండగానే హష్ మనీ కేసులో మన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయం ఆయనపై విచారణ మొదలు పెట్టింది. నేను అరెస్ట్ కాబోతున్నా..అభిమానులకు ట్రంప్ మెయిల్ తనపై కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపేనని ట్రంప్ ఆరోపించారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీపడకుండా అడ్డుకునేందుకు దేశ చరిత్రలోనే అత్యంత దారుణ రీతిలో తననిలా కేసుల పేరిట ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. విచారణకు బయల్దేరే ముందు తన సోషల్ మీడియా సైట్ ట్రూత్‌లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘అగ్ర రాజ్యం అమెరికా నానాటికీ దిగజారుతోంది. థర్డ్ వరల్డ్ మార్క్సిస్టు దేశంగా మారుతోంది’’ అంటూ అభిమానులకు పంపిన ఈ మెయిల్‌లోనూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అరెస్టుకు ముందు ఇది నా చివరి మెయిల్’ అని అందులో పేర్కొనడం విశేషం! ‘‘ఏ తప్పూ చేయనందుకు విపక్ష నేతను అధికార పార్టీ అరెస్టు చేస్తోంది. ఈ రోజుతో అమెరికాలో న్యాయం అడుగంటింది’’ అంటూ దుయ్యబట్టారు. విచారణ సజావుగా సాగుతుందని నమ్మకం లేదని ట్రంప్‌తో పాటు ఆయన న్యాయవాది అలీనా హబ్బా కూడా అన్నారు. ట్రంప్ విచారణపై స్పందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ నిరాకరించారు. న్యూయార్క్ పోలీసు శాఖ పనితీరుపై తనకు నమ్మకముందన్నారు. -
నేడు కోర్టుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) మంగళవారం మన్హటన్ గ్రాండ్ జ్యూరీ ముందు హాజరు కానున్నారు. పోర్న్ చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌తో తన అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు చేసిన చెల్లింపుల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు మోపుతూ జ్యూరీ గత గురువారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఒక క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు. మంగళవారం విచారణ తంతు 10 నుంచి 15 నిమిషాల్లో ముగుస్తుందని చెబుతున్నారు. ట్రంప్‌పై ఏయే అభియోగాలు మోపిందీ ఆయనకు చదివి వినిపిస్తారు. అనంతరం ట్రంప్ ఫ్లోరిడా వెళ్లి మంగళవారం రాత్రి మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ఈ కేసును విచారిస్తున్న ప్రాసిక్యూటర్‌తో పాటు జడ్జిపైనా ట్రంప్ ఆరోపణలతో విరుచుకుపడ్డారు! ‘‘ఈ కేసు కేవలం నాపై కక్షపూరిత చర్యే. దీన్ని విచారిస్తున్న జడ్జికి నేనంటే అమిత ద్వేషం. కేసును దర్యాప్తు చేస్తున్న జిల్లా అటార్నీ ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీకి చెందినవాడు. ఏరికోరి నన్ను ద్వేషించే జడ్జినే విచారణకు ఎంచుకున్నారు’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. క్రిమినల్ విచారణకు దారితీయగల పలు ఇతర అభియోగాలను కూడా ట్రంప్ ఇప్పటికే ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
ముద్దాయి ట్రంప్!...రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత?
న్యూయార్క్: అమెరికా చరిత్రలో రాజకీయంగా మరో పెను సంచలనానికి తెరలేచింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందే చెప్పినట్టుగా ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయి. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (స్టెఫానీ గ్రెగరీ క్లిఫర్డ్)తో లైంగిక సంబంధాలు బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బులు చెల్లించి అనైతిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్న ఆరోపణల కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ నేరాభియోగాలు నమోదు చేసినట్టుగా ధ్రువీకరించింది. ట్రంప్ లాయర్లతో కేసు విచారణను పర్యవేక్షిస్తున్న మన్‌హట్టన్ అటార్నీ జనరల్ అల్విన్ బ్రాగ్ మాట్లాడారు. ట్రంప్ లొంగిపోవడానికి సహకరించాలని కూడా బ్రాగ్ సూచించారు. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసు విచారణను ఎదుర్కోవడంతో పాటు ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొన్న మొట్టమొదటి మాజీ అధ్యక్షుడిగా అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టాలని కలలు కంటున్న వేళ నేరాభియోగాలు నమోదు కావడం నైతికంగా ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. తనను అరెస్ట్ చేస్తారని, అదే జరిగితే రిపబ్లికన్ శ్రేణు లు, తన అభిమానులు దేశవ్యాప్తంగా ఘర్షణలకు దిగాలని కూడా గత వారం ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వేలి ముద్రలు, ఫొటో తీసుకొని... ట్రంప్ కోర్టులో లొంగిపోతే ఆయన అరెస్ట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ న్యూయార్క్ అధికారులకి సహకరిస్తారని ఆయన తరఫు లాయర్ స్పష్టం చేయడంతో ఆయనపై ఎలాంటి అరెస్ట్ వారెంట్లు జారీ చేయలేదు. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్‌కి సొంతంగా విమా నం ఉంది. న్యూయార్క్‌లో ఏదైనా విమానాశ్రయానికి తన విమానంలో వెళ్లి అక్కడ్నుంచి మన్‌హట్టన్ కోర్టు హాలుకి కారులో వెళతారు. మంగళవారం నాడు ట్రంప్ కోర్టు ఎదుట లొంగిపోయే అవకాశాలున్నాయి. సర్వసాధారణంగా సామాన్య నిందితుల్ని కోర్టులో హాజరు పరచాలంటే వారికి సంకెళ్లు వేసి నడిపించుకుంటూ తీసుకువెళతారు. కానీ ట్రంప్ దేశానికి మాజీ అధ్య క్షుడు కావడంతో అలా జరిగే అవకాశాల్లేవు. మీడి యా కవరేజీకి అవకాశం లేకుండా ట్రంప్‌ని ప్రత్యేక ద్వారం నుంచి లోపలికి అనుమతించే అవకాశాలున్నా యి. క్రిమినల్ కేసులో అభియోగాలు నమోదు కావడంతో ట్రంప్ వేలిముద్రలు, పోలీసు రికా ర్డుల కోసం ఆయన ఫొటో తీసుకుంటారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడానికి ముందు ట్రంప్‌ని ప్రత్యేక సెల్లో ఉంచే బదులుగా వేరే ఒక గదిలో ఉంచుతారు. ఒక్కసారి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన తర్వాత ఈ కేసు పురోగతి ఎలా ఉండబోతుందన్నది తెలుస్తుంది. బెయిల్ లభిస్తుందా? ట్రంప్‌పై నేరాభియోగాలు మోపిన న్యూయార్క్ జ్యూరీ ఆ అభియోగాల పత్రాన్ని సీల్ వేసి ఉంచింది. ట్రంప్‌ను అరెస్ట్ చేసిన తర్వాతే సీల్ విప్పుతారు. ఈ కేసుని విచారించే న్యాయమూర్తి స్వయంగా కోర్టు హాలులో నేరాభియోగాలను చదివి వినిపిస్తారు. ఆయనపై ఏయే సెక్షన్ల కింద ఎలాంటి అభియోగాలు నమోదయ్యాయో అప్పుడే అందరికీ తెలుస్తుంది. ఆ అభియోగాలను బట్టి ఆయనకు బెయిల్ లభిస్తుందా, లేదా అన్నది స్పష్టమవుతుంది. ట్రంప్‌పై ప్రయాణపరమైన ఆంక్షలుంటాయా, లేదా వంటివన్నీ కూడా ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరైన తర్వాతే తేలుతాయి. ఈ కేసులో దోషిగా తేలితే ట్రంప్‌కు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. భారీగా జరిమానా కూడా విధిస్తారని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత? రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తనపై మోపిన అభియోగాలను రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే వ్యూహాల్లో ఉన్నారు. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ పరిణామాన్ని రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ప్రచారం చేయడానికి ట్రంప్ మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చెయ్యలేకపోతే ట్రంప్ తన ఇమేజ్ మరింత పెరుగుతుందన్న భావనలో ఉన్నారు. అయితే రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మద్దతుదారులు ఈ కేసు వల్ల అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీకి జరిగే లాభంపై ఇప్పట్నుంచే లెక్కలు వేస్తున్నారు. ‘‘ఇది చాలా చిన్న కేసు. ట్రంప్‌ను వేధించడానికే ఈ కేసుని బయటకు తెచ్చారు’’అని న్యూహ్యాంప్‌షైర్‌లో రిపబ్లికన్ పార్టీ చీఫ్ గ్రెగ్ హగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి కావాలంటే పార్టీలో 25 నుంచి 30 శాతం కంటే ఎక్కువ మంది ఆయనకు మద్దతు పలకాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అది కష్టమని ప్రత్యర్థి శిబిరం భావిస్తోంది. నేరాభియోగాలు ఎదుర్కొన్నా, శిక్షపడి జైలుకి వెళ్లినా ఎన్నికల్లో పోటీ చేయకూడదని అమెరికన్ రాజ్యాంగంలో నిబంధనలు లేవు. కానీ అలాంటి వ్యక్తిని అధ్యక్ష అభ్యర్థిని చేస్తే అనవసరంగా పార్టీ పరువు పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేరాభియోగాలతో ట్రంప్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయి మరో అభ్యర్థి, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్‌కు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. రాజకీయ అణచివేత: ట్రంప్ రాజకీయంగా తనను అణచివేయడానికి డెమొక్రాట్లు ఈ కుట్రకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. తనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిన వెంటనే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇదంతా రాజకీయ అణచివేత. దేశ చరిత్రలో ఎన్నికల పరంగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న జోక్యం ఇది. రాజకీయ ప్రత్యర్థుల్ని శిక్షించడానికి న్యాయవ్యవస్థని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. నన్ను లొంగదీసుకోవడానికి డెమొక్రాట్లు అబద్ధాలు చెప్పారు. మోసాలు చేశారు. దొంగతనాలకు పాల్పడ్డారు. చివరికి ఇలాంటి అనూహ్యమైన చర్యకి దిగారు. ఒక అమాయకుడిపై అభియోగాలు నమోదు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఏం చెబితే మన్‌హట్టన్ జ్యూరీ అదే చేస్తోంది’’అని ట్రంప్ ఆ ప్రకటనలో విరుచుకుపడ్డారు. మరోవైపు ట్రంప్ తరఫు లాయర్లు ఆయన ఏ తప్పు చేయలేదని దీనిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేసు నేపథ్యం ఇదీ.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తనతో ఉన్న లైంగిక సంబంధాలను బయటపెట్టకుండా ఉండేందుకు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌ను డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారన్న ఆరోపణలున్నాయి. అధ్యక్షుడిగా తన పరువు తీయకుండా ఉండడానికి ట్రంప్ లక్షా 30 వేల డాలర్లను అప్పట్లో తన లాయర్ మైఖేల్ కొహెన్ ద్వారా ముట్టజెప్పినట్టు డేనియల్స్ ఆరోపించారు. ఆ ఒప్పందం చెల్లదంటూ 2018లో ఆమె కోర్టుకెక్కారు. 2006 సంవత్సరంలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గోల్ఫ్‌కోర్టులో ట్రంప్ పరిచయమయ్యారని, తనతో గడిపితే ఆయన నిర్వహించే రియాల్టీ షో ’ది అప్రెంటీస్’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించారని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు. ఆ తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడేవారని 2007లో కలిసినప్పుడు ట్రంప్‌తో సన్నిహితంగా గడపడానికి నిరాకరించానని, అందుకే తనకు ఆ షో లో అవకాశం ఇవ్వకుండా ముఖం చాటేశారని తెలిపారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్ ఆరోపించారు. అయితే ట్రంప్ ఆమె ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇప్పుడు జ్యూరీ అభియోగాలు నమోదు చేయడంతో డేనియెల్స్ తన మద్దతుదారులందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనకు ఎన్నో సందేశాలు వస్తున్నా స్పందించలేకపోతున్నానని, సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నానని ట్వీట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫేస్బుక్ ద్వారా విడాకుల నోటీస్ : అనుమతించిన కోర్టు
న్యూయార్క్: ఫేస్బుక్ చివరికి విడాకులకు కూడా వేదికవుతోంది! కనిపించకుండా పోయిన తన భర్తకు ఫేస్బుక్ ద్వారా విడాకుల నోటీస్ పంపేందుకు అమెరికాలోని ఒక కోర్టు ఓ మహిళకు అనుమతి ఇచ్చింది. 26 ఏళ్ల ఎల్లనోరా బైడూ అనే నర్సుకు మాన్‌హట్టన్ సుప్రీంకోర్టు గతవారం ఈ మేరకు వెసులుబాటు కల్పించింది. ఎల్లనోరా, విక్టర్ సేన బ్లడ్జ్రాలకు 2009లో వివాహమైంది. పెళ్లయిన తర్వాత ఘనా దేశ సంప్రదాయ పద్ధతిలో కూడా మళ్లీ వివాహమాడతానని విక్టర్ బైడూకు హామీ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత అతను ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇదే వారిద్దరి మధ్య చిచ్చు రేపింది. విక్టర్ ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. అతను ఎక్కడున్నాడన్న ఆచూకీ లేదు. దీంతో అతడికి విడాకులు ఇవ్వాలనుకున్న బైడూకు ఏం చేయాలో తోచలేదు. ఫేస్బుక్ ద్వారా విడాకులు పంపుతానని ఆమె కోర్టు అభ్యర్థించారు. అందుకు న్యాయస్థానం అనుమతించింది. తన లాయర్ ద్వారా వారానికి ఒకసారి మూడు వారాలపాటు ఫేస్బుక్లో విక్టర్‌కు విడాకుల సమన్స్ పంపాలని ఆమెకు కోర్టు సూచించింది.