కోర్టులో విచారణకు హాజరైన ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో తనపై నమోదైన క్రిమినల్ నేరాభియోగాలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) అంగీకరించలేదు. తాను ఏ నేరమూ చేయలేదంటూ కోర్టు ముందు వాంగ్మూలమిచ్చారు. ప్రపంచమంతటి దృష్టినీ ఆకర్షించిన ఈ సంచలనాత్మక కేసులో మంగళవారం ఆయన మన్‌హాటన్ క్రిమినల్ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30కు కోర్టు వద్దకు చేరుకున్నారు. తన లాయర్లతో కలిసి కోర్టు ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. ఆ క్షణమే ఆయన సాంకేతికంగా అరెస్టయినట్టు అధికారులు ప్రకటించారు. ‘మిస్టర్ ట్రంప్! యూ ఆర్ అండర్ అరెస్ట్’ అని చెప్పి పోలీసులు ఆయన్ను లోనికి తీసుకెళ్లినట్టు సమాచారం. అనంతరం విచారణకు ముందు రికార్డుల నిమిత్తం ట్రంప్ వేలిముద్రలు, ఫొటో తీసుకున్నట్టు చెబుతున్నారు. మధ్యాహ్నం 2.30కు 15వ అంతస్తులో ఉన్న కోర్టు గదిలోకి ట్రంప్ ప్రవేశించారు. మామూలుగా నిందితుల మాదిరిగా బేడీలు వేయకుండానే ఆయన్ను జడ్జి ముందు హాజరు పరిచారు.
ఈ సందర్భంగా సీక్రెట్ సర్విస్ బాడీగార్డులు ట్రంప్ వెన్నంటే ఉన్నారు. అనంతరం ట్రంప్‌పై దాఖలైన 34 అభియోగాలను జడ్జి జువాన్ మాన్యుయల్ మర్చన్ చదివి విన్పించారు. వాటిలో దేనితోనూ తనకు సంబంధం లేదని ట్రంప్ వాంగ్మూలమిచ్చారు. ప్రతి అభియోగాన్నీ చట్టపరంగా ఎదుర్కొంటారని ఆయన లాయర్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3.30 సమయంలో కోర్టు నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత ఫ్లోరిడా పయనమయ్యారు.
శృంగార చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్ (44)తో అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు ఆమెకు డబ్బుల చెల్లింపు వ్యవహారం ట్రంప్ మెడకు చుట్టుకోవడం, క్రిమినల్ నేరాభియోగాలకు దారితీయడం తెలిసిందే. అమెరికా చరిత్రలో అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు. ఆయన విచారణ సందర్భంగా న్యూయార్క్‌లో మన్‌హాటన్ జ్యూరీ లేన్ మొత్తం మీడియాతో కిక్కిరిసిపోయింది.
ఈ నేపథ్యంలో మీడియా కంటపడకుండా ఉండేందుకు ట్రంప్ తన కాన్వాయ్‌తో కోర్టు భవనంలోకి వెనకవైపుగా ప్రవేశించారు. ట్రంప్ విజ్ఞప్తి మేరకు విచారణకు మీడియాను కోర్టు గదిలోకి జడ్జి అనుమతించలేదు. అంతేగాక విచారణ ప్రక్రియను ప్రసారం చేయరాదని సోమవారమే ఆదేశాలు జారీ చేశారు. విచారణ మొదలయ్యే ముందు ఫొటోలు తీసుకునేందుకు ఐదుగురు ఫొటోగ్రాఫర్లను మాత్రం అనుమతించారు.
భారీ భద్రత
అంతకుముందు విచారణ నిమిత్తం సోమవారం రాత్రే ట్రంప్ ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి సొంత బోయింగ్ 757 విమానంలో న్యూయార్క్ చేరుకున్నారు. తన అభిమానులకు అభివాదం చేస్తూ హడావుడి చేసిన అనంతరం ట్రంప్ టవర్‌లో బస చేశారు. విచారణ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్ అధ్యక్షునిగా ఉండగానే హష్ మనీ కేసులో మన్‌హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయం ఆయనపై విచారణ మొదలు పెట్టింది.
నేను అరెస్ట్ కాబోతున్నా..అభిమానులకు ట్రంప్ మెయిల్
తనపై కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపేనని ట్రంప్ ఆరోపించారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీపడకుండా అడ్డుకునేందుకు దేశ చరిత్రలోనే అత్యంత దారుణ రీతిలో తననిలా కేసుల పేరిట ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. విచారణకు బయల్దేరే ముందు తన సోషల్ మీడియా సైట్ ట్రూత్‌లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘అగ్ర రాజ్యం అమెరికా నానాటికీ దిగజారుతోంది. థర్డ్ వరల్డ్ మార్క్సిస్టు దేశంగా మారుతోంది’’ అంటూ అభిమానులకు పంపిన ఈ మెయిల్‌లోనూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘అరెస్టుకు ముందు ఇది నా చివరి మెయిల్’ అని అందులో పేర్కొనడం విశేషం! ‘‘ఏ తప్పూ చేయనందుకు విపక్ష నేతను అధికార పార్టీ అరెస్టు చేస్తోంది. ఈ రోజుతో అమెరికాలో న్యాయం అడుగంటింది’’ అంటూ దుయ్యబట్టారు. విచారణ సజావుగా సాగుతుందని నమ్మకం లేదని ట్రంప్‌తో పాటు ఆయన న్యాయవాది అలీనా హబ్బా కూడా అన్నారు. ట్రంప్ విచారణపై స్పందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ నిరాకరించారు. న్యూయార్క్ పోలీసు శాఖ పనితీరుపై తనకు నమ్మకముందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment