అధికారంలోకొచ్చింది మొదలు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నేరస్తుడిగా నిరూపించాలని తపిస్తున్న డెమాక్రాటిక్ పార్టీ వాంఛ చివరి అంకంలో నెరవేరింది. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ నోరు మూయించడానికి భారీగా సొమ్ము ముట్టజెప్పి, ఆ మొత్తాన్ని ట్రంప్ తన కంపెనీ ఖాతాల్లో వేరేగా చూపారన్న ఆరోపణ రుజువు కావటంతో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయన్ను మహాపరాధిగా తేల్చింది. భిన్న రంగాలకు చెందిన అయిదుగురు మహిళలతో సహా 12 మందితో కూడిన జ్యూరీ... ఈ వ్యవహారంలో ట్రంప్‌కు విధించబోయే శిక్ష ఏమిటన్నది ఇంకా ప్రకటించలేదు.
వచ్చే నెల 11న వెల్లడించే ఆ శిక్ష తప్పనిసరిగా కారాగారవాసమే కానవసరం లేదని, అది జరిమానా మొదలుకొని ప్రొబేషన్‌లో ఉంచటం వరకూ ఏదైనా కావొచ్చన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇది క్రిమినల్ కేసే అయినా వ్యక్తిని హతమార్చటం వంటిది కాదు గనుక జైలు శిక్ష ఉండకపోవచ్చంటున్నారు. జైలుకు పోయినా పోకపోయినా దేశాధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడటానికి అదేమీ అవరోధం కాదు.
తీర్పు వెలువరించే ముందు జ్యూరీకి నాయకత్వం వహించిన న్యాయమూర్తి జువాన్ మెర్కన్ తన సహచరులను లాంఛనంగా ‘తీర్పుతో మీరు ఏకభవిస్తున్నట్టేనా...’ అని అడగటం, వారు అంగీకారాన్ని తెలపటం పూర్తయ్యాక ట్రంప్ అక్కడినుంచి నిష్క్రమించారు. వెళ్లేముందు ‘ఇది మోసపూరితమైన, సిగ్గుమాలిన తీర్పు. అసలు తీర్పును నవంబర్ 5న అమెరికా ప్రజలివ్వబోతున్నారు’ అని ఆయన చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. వచ్చే అయిదారు నెలల్లో ఆ దేశ రాజకీయ పోకడలెలా ఉండబోతున్నాయో ట్రంప్ వ్యాఖ్య చెబుతోంది. ట్రంప్ నేరం రుజువై అపరాధిగా తేలిన తొలి కేసు ఇదే.
దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్‌ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఏకరువు పెట్టగా, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది.
బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్‌కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. 2006 నాటి తన రాసలీలల సంగతి బయటపెట్టొద్దని అభ్యర్థిస్తూ న్యాయవాది ద్వారా స్టార్మీకి పంపిన 1,30,000 డాలర్ల డబ్బే ఇప్పుడు ట్రంప్‌ను నిండా ముంచింది.
ఈ కేసులో వచ్చిన మొత్తం 34 అభియోగాలూ రుజువయ్యాయని న్యాయస్థానం తేల్చింది. ట్రంప్ గద్దెనెక్కకుండా నిరోధించేది ప్రజా తీర్పేనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా ఆ విషయంలో డెమాక్రాటిక్ పార్టీకి పెద్దగా ఆశలున్నట్టు కనబడదు. తటస్థులైన ఓటర్లలో ఒకటి రెండు శాతంమంది తాజా తీర్పు వెలువడ్డాక ట్రంప్‌కు వోటేయాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పినా అదేమంత ఉపయోగపడేలా కనబడటం లేదు. తొక్కేయాలని చూస్తున్నకొద్దీ ఆయన మరింత బలశాలిగా మారుతున్నాడంటూ రిపబ్లికన్ వ్యూహకర్త స్కాట్ రీడ్ చేసిన వ్యాఖ్య అవాస్తవం కాదు.
గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరగటం, ఆయనకొచ్చే విరాళాల వెల్లువ ఇందుకు తార్కాణం. అయిదారేళ్లుగా రిపబ్లికన్ పార్టీ తన సామాజిక మాధ్యమాల ద్వారా, ఫాక్స్ న్యూస్ వంటి పార్టీ అనుకూల మీడియా ద్వారా సాగిస్తున్న ప్రచారం దీనికి కారణం. పార్టీ మొత్తం ట్రంప్ వెనక దృఢంగా నిలబడి ఆయన మాటలనూ, చేష్టలనూ సమర్థిస్తూ వచ్చింది. తమ నాయకుడిది తప్పంటున్న డెమాక్రాటిక్ నేతలే నేరగాళ్లంటూ ఊదరగొట్టింది.
వీటి మాటెలావున్నా న్యాయస్థానం మహాపరాధిగా తేల్చిన వ్యక్తి దేశాధ్యక్షుడిగా వ్యవహరించటం సరైందేనా అన్న మీమాంస నడుస్తోంది. నాలుగు వందల ఏళ్లనాటి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సందేహాలు ఎప్పుడూ రాలేదు. నేర నిరూపణ అయిన వ్యక్తి వందేళ్ల క్రితం జైలునుంచి పోటీచేసిన చరిత్రవున్నా మాజీ అధ్యక్షుడు మహాపరాధిగా తేలటం, ఆయనే మరోసారి బరిలో దిగటం కనీవినీ ఎరుగనిది. ఈ విషయంలో రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనేదీ లేదు.
ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థికి రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని బదలాయించటానికి బదులు అనుచరులను రెచ్చగొట్టి అవరోధాలు సృష్టించాలని చూసిన ట్రంప్‌కు ఇప్పటికీ వ్యవస్థలంటే గౌరవం లేదు. తిరిగి నెగ్గితే ఆయన చేయబోయే పనుల్లో వలసలను కట్టడి చేయటం మొదలుకొని అంతర్జాతీయ సాయానికి కత్తెరేయటం వరకూ చాలావున్నాయి. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రతను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. గెలిచి అందలమెక్కితే ట్రంప్‌పై కేసులు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే కాదు... అమెరికాకు సైతం సమస్యగా మారడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment