వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చొబోతున్న డొనాల్డ్ ట్రంప్‌నకు గడ్డు పరిస్థితులు తప్పడం లేదు. గతంలోని తన రాసలీలల బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆయన ఓ మాజీ శృంగార తారకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వ్యవహారంతో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా మోసానికి పాల్పడ్డారంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదిస్తోంది.
2016 ఎన్నికల ప్రచారం సమయంలో.. స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం(నాన్‌డిజ్‌క్లోజర్ అగ్రిమెంట్) చేసుకున్నాడనే ఆరోపణలు ట్రంప్‌పై ఉన్నాయి. ఈ తరుణంలో.. సదరు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత ఆ పో*స్టార్ కోర్టును ఆశ్రయించింది. అటుపై ఆయన అధ్యక్ష పదవిలో ఉండడంతో హైప్రొఫైల్ కేసుగా దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి. చివరికి.. న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్ పై నేరారోపణలు చేసింది. తద్వారా అమెరికాలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు చరిత్రకెక్కింది.
అయితే తొలిరోజు విచారణ సందర్భంగా.. న్యూయార్క్ కోర్టులో వాడీవేడి వాదనలే జరిగాయి. ప్రాసిక్యూటర్ మాథ్యూ కోలాంగెలో వాదనలు వినిపిస్తూ.. 2016 ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మోసానికి పాల్పడ్డారు. తన పరువు పోకుండా ఉండేందుకు శతవిధాల యత్నించారు. ఇందుకోసం సె* స్కాండల్‌ను కప్పి పుచ్చేలా వ్యవహరించారు. ట్రంప్ టవర్ ఇందుకు వేదిక అయ్యింది. ఇది దీర్ఘకాలికంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర. తన గురించి చెడుగా మాట్లాడకుండా కొందరి నోళ్లు మూయించడానికి ఆయన డబ్బు ఖర్చు చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఆ ఖర్చు ఎన్నికలను ప్రభావితం చేసే అంశమే. కచ్చితంగా ఇది ఎన్నికల మోసం కిందకే వస్తుంది’’
అయితే ట్రంప్ తరఫు న్యాయవాది టాడ్ బ్లాంచె మాత్రం ఆ అభియోగాలను ఖండించారు. ట్రంప్ అమాయకుడని, ఎలాంటి నేరం చేయలేదని, అసలు మాన్‌హట్టన్ అటార్నీ ఆఫీస్ ఈ కేసును ఏనాడూ ప్రస్తావించలేదని వాదించారు. ఇక ఈ కేసులో ఇంకా వాదనలు కొనసాగాల్సి ఉంది.
ట్రంప్ గతంలో అధ్యక్ష పదవిలో రెండుసార్లు అభిశంసన తీర్మానం ఎదుర్కొని నెగ్గారు. యూఎస్ కాపిటల్ మీద దాడి ఘటన, అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో ఉన్నప్పుడు కీలకమైన పత్రాల మిస్సింగ్(వాటిని నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి).. తదితర అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సె* స్కాండల్ కుంభకోణంలో గనుక ట్రంప్ కోర్టు విచారణ ద్వారా ఆయన జీవిత పుస్తకంలో మాయని మచ్చ ఏర్పడినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment