ఫేస్‌బుక్ ద్వారా విడాకుల నోటీస్ : అనుమతించిన కోర్టు
న్యూయార్క్: ఫేస్‌బుక్ చివరికి విడాకులకు కూడా వేదికవుతోంది! కనిపించకుండా పోయిన తన భర్తకు ఫేస్‌బుక్ ద్వారా విడాకుల నోటీస్ పంపేందుకు అమెరికాలోని ఒక కోర్టు ఓ మహిళకు అనుమతి ఇచ్చింది. 26 ఏళ్ల ఎల్లనోరా బైడూ అనే నర్సుకు మాన్‌హట్టన్ సుప్రీంకోర్టు గతవారం ఈ మేరకు వెసులుబాటు కల్పించింది. ఎల్లనోరా, విక్టర్ సేన బ్లడ్‌జ్రాలకు 2009లో వివాహమైంది. పెళ్లయిన తర్వాత ఘనా దేశ సంప్రదాయ పద్ధతిలో కూడా మళ్లీ వివాహమాడతానని విక్టర్ బైడూకు హామీ ఇచ్చాడు.
కానీ ఆ తర్వాత అతను ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇదే వారిద్దరి మధ్య చిచ్చు రేపింది. విక్టర్ ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. అతను ఎక్కడున్నాడన్న ఆచూకీ లేదు. దీంతో అతడికి విడాకులు ఇవ్వాలనుకున్న బైడూకు ఏం చేయాలో తోచలేదు. ఫేస్‌బుక్ ద్వారా విడాకులు పంపుతానని ఆమె కోర్టు అభ్యర్థించారు. అందుకు న్యాయస్థానం అనుమతించింది. తన లాయర్ ద్వారా వారానికి ఒకసారి మూడు వారాలపాటు ఫేస్‌బుక్‌లో విక్టర్‌కు విడాకుల సమన్స్ పంపాలని ఆమెకు కోర్టు సూచించింది.