సోషల్ నెట్‌వర్కా? విడాకుల నెట్‌వర్కా?
స్టడీ
‘‘మీరు ఫేస్‌బుక్‌లో లేరా?! అయ్యబాబోయ్!’’ ఇలాంటి ఆశ్చర్యాలు మనకు తరచు వినిపిస్తుంటాయి. ‘సామాజిక మాధ్యమం’ అనేది ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారింది. వాటి వినియోగం ‘సోషల్ స్టేటస్’గా కూడా మారింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్, వాట్సప్‌లాంటి సామాజిక మాధ్యమాలను వినియోగించని వారిని వింతగా చూసే పరిస్థితి కూడా ఏర్పడింది.
సామాజిక మాధ్యమాల వినియోగానికి సంబంధించి అనుకూల విషయాల మాట ఎలా ఉన్నా... సంసారం విషయానికి వస్తే మాత్రం...అది ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. భాగస్వామికి ఇబ్బంది కలిగించే పోస్ట్‌లు, ఎక్కువ సమయాన్ని సామాజిక మాధ్యమాల వినియోగంలోనే గడపడం... తదితర కారణాలు భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణమై... విడాకుల వరకు దారి తీస్తున్నాయని ‘స్లటర్ అండ్ గోర్డన్’ సంస్థ చెబుతుంది.
‘‘అయిదు సంవత్సరాల క్రితం సామాజిక మాధ్యమాల వినియోగం చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. సోషల్ నెట్‌వర్క్‌లో యాక్టివ్ కావడం నిత్యజీవిత వ్యవహారంలో ఒక తప్పనిసరి అంశంగా మారింది. సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు, చిత్రాలు భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణం అవుతున్నాయి’’ అంటున్నారు ఇంగ్లండ్‌కు చెందిన ‘స్లటర్ అండ్ గోర్డన్’ అనే లీగల్ సర్వీస్‌కు చెందిన ఆండ్య్రూ న్యూబరీ. తమ దగ్గరకు వచ్చే విడాకుల కేసుల్లో అధికశాతం సోషల్ నెట్‌వర్క్ సంబంధిత కేసులే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ఆండ్రూ.
రెండు వేల మందికి పైగా దంపతులపై ‘స్లటర్ అండ్ గోర్డన్’ అధ్యయనం నిర్వహించింది. తన జీవితభాగస్వామి సోషల్ మీడియా ఎకౌంట్‌ను చెక్ చేయడం, ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఎవరితో తరచుగా సమావేశం అవుతున్నారు? మాజీ భాగస్వామి లేదా ప్రియురాలికి పంపే రహస్య సందేశాలు...మొదలైనవి భార్యభర్తల మధ్య విభేదాలకు కారణం అవుతున్నాయని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.