
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. అయితే, పరిస్థితి దిగజారలేదనీ, ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే పనిచేస్తున్నాయని కుమార్తె శర్మిష్ఠ శుక్రవారం చెప్పారు.
‘వైద్యపరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. రెండు రోజులుగా మా నాన్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే, నిలకడగా మాత్రం ఉంది. ఆయన నేత్రాలు వెలుతురుకు కాస్తంత స్పందించడం కనిపిస్తోంది’అని ట్విట్టర్‌లో శర్మిష్ఠ ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రణబ్ ముఖర్జీ బాహ్య స్పర్శకు, చికిత్సకు స్పందిస్తున్నారు. 96 గంటల అబ్జర్వేషన్ సమయం నేటితో పూర్తవుతోంది’అని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్‌లో తెలిపారు. ‘దేశ ప్రజల నుంచి నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగానే పొందాను..అని మా నాన్న ప్రణబ్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దయచేసి ఆయన కోసం ప్రార్థించండి’అని అభిజిత్ కోరారు.