‘ఓటుకు నోటు’పై కేంద్రానికి నివేదిక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇటీవల శాసన సభ నుంచి శాసన మండలికి జరగాల్సిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన నాయకునికి ఎమ్మెల్యేలు రూ.కోటి చొప్పున అడుగుతున్నారని జేడీఎస్ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి చెప్పినట్లు విడుదలైన సీడీపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. దీనిపై నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపా రు.
మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఒకటి, రెండు రోజుల్లో నివేదికను పంపుతామని చెప్పారు. బీజాపుర జిల్లాకు చెందిన జేడీఎస్ నాయకుడు విజు గౌడ పాటిల్ పార్టీ అభ్యర్థిత్వాన్ని కోరినప్పుడు ‘పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు రూ.40 కోట్లు అడుగుతున్నారు’ అని కుమార స్వామి చెప్పడం వివాదాస్పదంగా మారింది.
మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే దీనిపై రాజకీయ పార్టీలన్నిటినీ తూర్పారబట్టారు. తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని అన్ని పార్టీల వారు ఈ అంశాన్ని శాసన సభలో లేవనెత్తడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా కుమార తీరుపై ధ్వజమెత్తాయి.