అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి! | Barack Obama writes to A Promised Land Book | Sakshi
Sakshi News home page

అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!

Published Sat, Nov 14 2020 4:46 AM | Last Updated on Sat, Nov 14 2020 8:58 AM

Barack Obama writes to A Promised Land Book - Sakshi

బరాక్‌ ఒబామా... అమెరికా మాజీ అధ్యక్షుడిగా, మాజీ సైనికుడిగా మనందరికీ చిరపరిచితమైన పేరిది. రచయితగా ఆయన గురించి తెలిసింది కొంతే. కానీ...‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’పేరుతో ఒబామా ఈ కొరతను తీర్చేశారు. 17న విడుదల కానున్న ఈ పుస్తకంలో అగ్రరాజ్యానికి తొలి నల్లజాతి అధ్యక్షుడిగా తన అనుభవాలను దేశాధినేతలు, రాజకీయ పార్టీల నాయకులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. లోతైన అధ్యయనం.. క్లుప్తత... కాసింత హాస్యం కలబోసి ఆయన ఎవరి గురించి ఏమన్నారంటే..?

ధైర్యం లేని, అపరిపక్వమైన నాణ్యత!
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, గాంధీ వంశ వారసుడు రాహుల్‌ గాంధీని బరాక్‌ ఒబామా అధైర్యంతో కూడిన, అపరిపక్వమైన నాణ్యత కలిగిన నాయకుడిగా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’లో వర్ణించారు. ఇదే అంశాన్ని ఇంకాస్త వివరిస్తూ.. ‘‘రాహుల్‌గాంధీ ఓ విద్యార్థి అనుకుంటే... చదవాల్సిందంతా చదివి టీచర్‌ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న వాడిలా కనిపిస్తాడు. కానీ.. చదివిన విషయంపై పట్టు సాధించాలన్న అభిరుచి, మోహం రెండింటిలో ఏదో ఒకటి లోపించినట్లు అనిపిస్తుంది’’అని వ్యాఖ్యానించారు.


అందం ఆమె సొంతం

‘‘చార్లీ క్రైస్ట్, రామ్‌ ఎమ్మాన్యుల్‌ వంటి మగవాళ్ల అందం గురించి అందరూ చెబుతూంటారు. మహిళల సౌందర్యం గురించి మాత్రం వాళ్లూ వీళ్లు చెప్పేది తక్కువే. ఒకట్రెండు సందర్భాలను మినహాయిస్తే సోనియాగాంధీ విషయంలోనూ ఇదే జరిగింది.’’అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా..కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురించి చేసిన వ్యాఖ్య ఇది.

నిష్పాక్షికత..చిత్తశుద్ధి
దేశంలో ఆర్థిక సరళీకరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా.. పదేళ్లపాటు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్‌ సింగ్‌ను బరాక్‌ ఒబామా అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రాబర్ట్‌ గేట్స్‌తో పోల్చారు. ఇద్దరూ దయతో కూడిన నిష్పాక్షికత కలిగిన వారని, వారి చిత్తశుద్ధి, సమగ్రతలూ ఎన్నదగ్గ లక్షణాలని కొనియాడారు.


కండల వీరుడు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తనకు కండల వీరుడిని గుర్తుకు తెస్తాడని ఆయన శరీరాకృతి అద్భుతమని ఒబామా వ్యాఖ్యానించారు. షికాగో రాజకీయాల్లోని తెలివైన రాజకీయ నేతల మాదిరిగా పుతిన్‌ వ్యవహారం ఉంటుందని ఒబామా వర్ణించారు. బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.


కొన్నిసార్లు కష్టమే

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ గురించి మాజీ అధ్యక్షుడు, సహచర డెమోక్రాట్‌ అయిన బరాక్‌ ఒబామా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌ మంచి మనిషి, నిజాయితీ కలవాడు అంటూనే.. కొన్నిసార్లు తనకు కావాల్సింది దక్కలేదు అనుకుంటే ఇబ్బందికరంగా మారగలగడని అన్నారు. తనకంటే తక్కువ వయసున్న బాస్‌తో (ఒబామా) వ్యవహరించేటప్పుడు ఈ నైజం మరింత ఎక్కువవుతుందని అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.


వైట్‌హౌస్‌లో నల్లవాడిని చూసి భయపడ్డారు

అమెరికా అధ్యక్షుడిగా ఓ నల్లజాతీయుడు వైట్‌హౌ స్‌లో అడుగుపెట్టడం లక్షల మంది శ్వేతజాతీయుల కు భీతి కలిగించిందని, వీళ్లంతా రిపబ్లికన్‌ పార్టీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న దుష్టశక్తులని ఒబామా తన పుస్తకంలో తెలిపారు. నల్లజాతీయుడి గా తనను వ్యతిరేకించిన వారు జినోఫోబియా (ఇతర జాతీయులపై తీవ్రమైన భయం)తో బాధపడే వారేనని, మేధావితనం అన్నా వీరికి అంతగా నచ్చదని, నిత్యం కుట్ర సిద్ధాంతాలను పట్టుకు వేళ్లాడేవారు, నల్లజాతి వారు ఇతరులపై ద్వేషం ఉన్న వారు తనను వైట్‌హౌస్‌లో ఓర్వలేక పోయారని ఒబామా వివరించారు.

ఇలాంటి వారందరికీ డొనాల్డ్‌ ట్రంప్‌ అమృతాన్ని అందిస్తాన ని హామీ ఇచ్చి గద్దెనెక్కారని విమర్శించా రు. డొనాల్డ్‌ ట్రంప్‌ పదవి నుంచి వైదొలగినా అమెరికా రాజకీయాల్లోని విభేదాల అగాధాన్ని పూడ్చలేవని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికా అంటే ఏమిటి? అది ఎలా ఉండాలన్న భావనల విషయం లో మౌలికంగా ఉన్న అభిప్రాయ భేదాలు ఈ సంక్లిష్టపరిస్థితికి కారణమని.. దీనివల్ల ప్రజాస్వా మ్య వ్యవస్థ కూడా సంక్షోభంలో పడినట్లు కనిపిస్తోందని ఒబామా ప్రస్తుత రాజకీయ పరిస్థితి ని విశ్లేషించారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇద్దరూ ఒకప్పుడు నమ్మకముంచిన వ్యవస్థలు, విలువలు, ప్రక్రియలపై నమ్మకం కోల్పోయేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమిలీ ముఖంలో ఏమీ కనిపించేది కాదు
ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోవాలోని తన సిబ్బందిలో ఒకరైన ఎమిలీ గురించి ఒబామా వ్యాఖ్యానిస్తూ... ‘‘ఎమిలీ ముందు నా వాక్చాతుర్యం, విమర్శలు మొత్తం కుప్పకూలిపోయేవి. కనురెప్ప వేయకుండా.. ఏ రకమైన భావం కనిపించకుండా ఎమిలీ చూపులు ఉండేవి. ఇక లాభం లేదనుకుని ఆమె ఏం చెబితే అది చేసేందుకు ప్రయత్నించేవాడిని’’అన్నారు. అంతేకాదు.. అలాస్కా గవర్నర్, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన సారా పాలిన్‌ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏం మాట్లాడేదో తనకు అస్సలు అర్థమయ్యేది కాదని ఒబామా వ్యాఖ్యానించారు.   

వైవాహిక జీవితంపై..
అధ్యక్షుడిగా తనపై అందరి దృష్టి ఉండటం..పదవి తాలూకూ ఒత్తిడి, విపరీతమైన భద్రత భార్య మిషెల్‌ ఒబామాకు నిస్పృహ కలిగించేదని బరాక్‌ ఒబామా తన పుస్తకంలో రాసుకున్నారు. తాము వైట్‌హౌస్‌ నాలుగు గోడల మధ్య బందీ అయిపోయామన్న భావన మిషెల్‌లో కనిపించేదని తెలిపారు.

‘‘జీవితంలో మిషెల్‌ ఎన్ని విజయాలు సాధించినా, ప్రాచుర్యం పొందినప్పటికీ ఆమెలో ఏదో తెలియని ఒక టెన్షన్‌ కనిపించేది. కంటికి కనిపించని యంత్రపు రొదలా ఉండేది ఆ టెన్షన్‌. రోజంతా పనిలో నిమగ్నమైన నా గురించో... కుటుంబం మొత్తమ్మీద వస్తున్న రాజకీయ విమర్శలో, కుటుంబ సభ్యులు కూడా తనకు రెండో ప్రాధాన్యత ఇస్తున్నారన్న భావనో ఉండేది’’ అని వివరించారు.

ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ నవంబర్‌ 17న విడుదల కానుంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఒబామా, ఆయన భార్య మిషెల్‌ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్‌హౌస్‌లో తన అనుభవాలన్నింటినీ మిషెల్‌ ఇప్పటికే ‘బికమింగ్‌’పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు.

మైక్రోఫోన్, జాక్స్‌ లేని ఫోన్‌ ఇచ్చారు
అమెరికా అధ్యక్షుడిగా తనకు ఒకసారి బ్లాక్‌బెర్రీ ఫోన్‌ ఇచ్చారని, కానీ అందులో మైక్రోఫోన్, హెడ్‌ఫోన్‌ జాక్స్‌ రెండింటిని తొలగించిన తరువాతే తనకు ఇచ్చారని ఒబామా ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’లో తెలిపారు. ఆ ఫోన్‌ ద్వారా తాను భద్రతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించిన 20 మందితో మాట్లాడే సౌకర్యం ఉండేదని వివరించారు. మైక్రోఫోన్, హెడ్‌ఫోన్‌ జాక్స్‌ రెండూ లేకపోవడంతో పసిపిల్లలకు ఇచ్చే డమ్మీఫోన్‌ మాదిరిగా ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు. 
 
– సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement