
జిల్లా కీర్తిని చాటిన మేరునగ ధీరుడు
పిల్లలూ.. శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, లోక్‌సభ స్పీకర్‌గా అన్నిటికీ మించి దేశ ప్రథమ పౌరునిగా రాజకీయ పయనం సాగించిన మహోన్నత వ్యక్తి గురించి మీకు తెలుసా?
పిల్లలూ.. శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, లోక్‌సభ స్పీకర్‌గా అన్నిటికీ మించి దేశ ప్రథమ పౌరునిగా రాజకీయ పయనం సాగించిన మహోన్నత వ్యక్తి గురించి మీకు తెలుసా? రాజకీయాలలో మేరునగ ధీరుడిగా పేరొందిన నీలం సంజీవరెడ్డి జీవితం ‘అనంత’ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. నిశితంగా పరిశీలిస్తే ఆయన వల్లే ‘అనంత’ కీర్తి విశ్వవ్యాప్తమైంది. ఆ తరానికి చెందిన రాజకీయ నాయకులు కావడం వలన విలువలకు ప్రాధాన్యతనిస్తూ పదవులను తృణప్రాయంగా వదిలేసి, ఆదర్శప్రాయుడయ్యారు. స్వాతంత్రోద్యమం నుంచి తనువు చాలించేదాకా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలచిన నీలం సంజీవరెడ్డి... జిల్లాలోని మారుమూల గ్రామమైన ఇల్లూరులో 1913 మే 18న జన్మించారు. 1931లో జాతీయోధ్యమంలో ప్రవేశించారు. 1946లో మద్రాసు అసెంబ్లీ సభ్యుడయ్యారు.
1947లోభారత రాజ్యాంగ సభ్యులుగా ఎన్నికయ్యారు. రాజ్యాంగ నిర్మాణంలో నీలం సంజీవరెడ్డి కూడా కీలక పాత్ర వహించిన విషయం కొందరికే తెలుసు. మద్రాసురాష్ట్ర ప్రభుత్వంలో 1949 నుంచి 1952 వరకూ మధ్యపాన నిషేదశాఖా మంత్రిగా పనిచేశారు. 1952లో రాజ్యసభ సభ్యులయ్యారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశం మంత్రి వర్గంలో 1955లో బెజవాడ గోపాలరెడ్డి మంత్రి వర్గంలోనూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1959లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులయ్యారు. 1962లో తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. బస్సుల జాతీయికరణ అంశం న్యాయస్థానం పరిశీలనకు తలొగ్గి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
లాల్‌బహుదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఉక్కుగనుల శాఖమంత్రిగా, ఇందిరాగాంధి మంత్రి వర్గంలో రవాణా, విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. హిందూపురం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1967–69 మధ్య స్పీకర్‌గా ఉన్నారు. 1977లో నంద్యాల నుంచి లోకసభకు ఎన్నికై 1977 మార్చి నుంచి జూలై వరకూ మరోసారి లోకసభ స్పీకర్‌గా ఉన్నారు. అదే ఏడాది జూలై 25 నుంచి 1982 జూన్ 24 వరకూ భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. పదవీవిరమణ అనంతరం చాలా కాలం జిల్లా కేంద్రంలోని నాగవిహార్‌లో ఉన్నారు. కొంతకాలం బెంగళూరులోనూ నివశించారు. ఎటువంటి వివాదాంశాలకు తావివ్వని విధానాలతో జీవితాన్ని సాకారం చేసుకున్న ఆయన 1996 జూన్ 1న పరమపదించారు. ఆయన బతికి ఉన్న రోజుల్లోనే అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్‌లో ఆయనకు శిలావిగ్రహం ఏర్పాటు చేశారు.
- అనంతపురం కల్చరల్