
ఎందరో మహానుభావులు
వందేళ్ల చరిత్ర కలిగిన అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కళాశాలతో సామాన్యుల నుంచి రాష్ట్రపతుల దాకా అనుబంధముంది.
అనంతపురం కల్చరల్ : వందేళ్ల చరిత్ర కలిగిన అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కళాశాలతో సామాన్యుల నుంచి రాష్ట్రపతుల దాకా అనుబంధముంది. 1914లో గవర్నర్ పెంట్లాండ్ చేతుల మీదుగా ఆరంభమైన ఈ భవనంలో మొదటి రెండేళ్లు మునిసిపల్ హై స్కూలు నడించింది. మరో రెండేళ్లకే కళాశాలగా రూపుదిద్దుకుంది. ఇందులో ఎందరో దేశవిదేశాలలో ఖ్యాతి గడించిన వారు చదువుకోవడం విశేషం. స్వతంత్ర భారతావని తొలి ఉపరాష్ట్రపతిగా..రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వాడైనా 1916లో అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసి అనంత వాసులతో బంధం ఏర్పరచుకున్నారు.
మరో రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి ఇదే కళాశాలలో 1931–34లో విద్యార్థిగా ఉన్నారు. అంతేనా.. ఇస్రోను సమర్థవంతంగా నడిపిన పద్మభూషణ్ యూఆర్ రావు, మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య, హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులు మోతీలాల్ నాయక్, ఓబుళరెడ్డి, మాజీ డీజీపీ రాముడు, ఎస్వీయూ మాజీ వీసీ ఆచార్య శాంతప్ప, ప్రస్తుత ఎస్కేయూ వీసీ రాజ్‌గోపాల్ తదితరులందరూ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్న వారే. ఇక ఇక్కడే చదువుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీల సంఖ్య కూడా ఎక్కువే. అంతటి ఘనత వహించిన కళాశాల శతవసంతోత్సవం జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో చాలా మంది ఇక్కడ చదువుకున్న వారు అనంతపురం వచ్చి నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటుండడం విశేషం.