సౌత్ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్ హై (పైల్ ఫోటో)
సియోల్: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్ హై(66)కు 24 ఏళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో భారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ఈ శిక్షను ఖరారు చేశారు. దేశ ప్రథమ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగిన ఆమె అనూహ్య రీతిలో పతనమయ్యారు. లంచం, అధికార దుర్వినియోగం, క్రిమినల్ ఆరోపణలపై సుమారు 10 నెలల పాటు పార్క్ గెన్‌ను విచారించారు. మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్ సుమారు 2.2 కోట్ల డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్లు ధృవీకరించినకోర్టు తీర్పును వెలువరించింది. అధ్యక్ష అధికారాలను ఆమె దుర్వినియోగం చేశారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడంతోపాటు దేశ వ్యవహారాల్లో భారీ గందరగోళం తీసుకొచ్చారని న్యాయమూర్తి కిమ్ సే-యున్ వ్యాఖ్యానించారు. ఆమెకు విధించిన కఠిన శిక్ష భవిష్యత్ నాయకులకు ఒక గుణపాఠం కావాలన్నారు. ప్రాసిక్యూషన్ 30 సంవత్సరాలు శిక్షను కోరగా ..సాక్ష్యాధారాలను పరిశీలించిన ముగ్గురు జడ్జీల బెంచ్ ఆమెకి 24 ఏళ్ల జైలుశిక్షతో పాటు, 17 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు.
మరోవైపు న్యాయస్థానం తీర్పును ప్రసారం చేయాలని నిర్ణయించిన తరువాత తీర్పును వినడానికి ఆమె సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరు కాలేదు. అంతేకాదు పార్క్ మరియు ఆమె న్యాయవాదులు కూడా పాల్గొనడానికి నిరాకరించారు. దక్షిణ కొరియాలో ఇలా జరగడం మొదటిసారి. దీనికి సంబంధించిన చట్టాన్ని గత సంవత్సరం ఆమోదించిన తర్వాత తీర్పును లైవ్ టెలికాస్ట్ చేశారు. అటు కోర్టు వెలుపల వందల కొద్దీ మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమి గూడారు. బిగ్ స్క్రీన్‌పై కోర్టు తీర్పును పరికించారు. అనంతరం కొరియా, అమెరికా జెండాలతో పార్క్ విడుదలను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
2012లో పార్క్ దేశ మొదటి మహిళా అధక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్లకే ఆమెపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెను అభిశంసించాలని ఆ దేశ పార్లమెంటు కూడా నిర్ణయించింది. అంతేకాదు ఈ భారీ కుంభకోణంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అధ్యక్షురాలు పార్క్ , ఆమె స్నేహితురాలు చోయ్ సూన్ సిల్ ద్వారా శాంసంగ్‌కు భారీ ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment