కోల్‌కతా : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఎంతో నొప్పిని సైతం ఓర్చుకొని ప్రశాంతంగా ప్రణబ్ కనిపించేవారని 13 ఏళ్ల క్రితం ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ బసుదేవ్ మొండాల్ అన్నారు. '' 2007లో ముర్షిదాబాద్ నుంచి కోల్‌కతా వెళ్తుండగా నాడియా జిల్లాలో ప్రణబ్ ముఖర్జీ కారు ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో కారు ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో అప్పటి విదేశాంగ మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ సిటీ స్కాన్, ఎక్స్ రే వంటి సౌకర్యాలు లేనందున ఆయన్ని మా నర్సింగ్ హోంకు తీసుకువచ్చారు. (మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం)
అంతకుముందే నాకు పరిస్థితిని వివరించి అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాల్సిందిగా ఫోన్ రావడంతో చాలా అలర్ట్ అయ్యాను. అన్నీ సిద్ధం చేశాను. ఆ సమయంలో ముఖర్జీ తలకు బలమైన గాయం కావడంతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా, వినయంగా కనిపించారు. ఇక పరీక్షలు అదృష్టవశాత్తూ ఆయనకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం. ఆ తర్వాత అయన్ని అక్కడినుంచి కోల్‌కతా లోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత 2016లో ఓ కార్యక్రమం సందర్భంగా ప్రణబ్ ముఖర్జీని ఆహ్వనించడానికి వెళ్లాను. అప్పటికీ ఆయన రాష్ర్టపతిగా ఉన్నారు. నన్ను చూడగానే గుర్తుపట్టి, చాలా ఆప్యాయంగా పలకరించారు. నా సేవలను గుర్తిచేస్తూ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమానికి హాజరవుతానన్న వాగ్ధానాన్ని కూడా నిలబెట్టుకున్నారు'' అంటూ డాక్టర్ మొండల్ ప్రణబ్ ముఖర్జీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఇక బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ )
Comments
Please login to add a commentAdd a comment