USA Presidential Elections 2024: ట్రంప్‌పై హత్యాయత్నం | USA Presidential Elections 2024: Donald Trump survived an assassination attempt at his rally | Sakshi
Sakshi News home page

USA Presidential Elections 2024: ట్రంప్‌పై హత్యాయత్నం

Published Mon, Jul 15 2024 4:49 AM | Last Updated on Mon, Jul 15 2024 4:49 AM

USA Presidential Elections 2024: Donald Trump survived an assassination attempt at his rally

ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా కాల్పులు

పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడటంతో ట్రంప్‌ తల వెనుకగా దూసుకెళ్తున్న తూటా. ఆయనపై మొత్తం నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి.

షికాగో/వాషింగ్టన్‌: అమెరికా చరిత్రపై మరో రక్తపు మరక. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (78)పై హత్యా యత్నం జరిగింది. నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో గెలిచి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు రిపబ్లికన్ల అభ్యరి్థగా సర్వశక్తులూ ఒడ్డుతున్న ఆయన ఈ ప్రాణాంతక దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్‌ టౌన్‌లో ఔట్‌డోర్‌ ఎన్నికల ర్యాలీలో ఉండగా ఈ ఘోరం జరిగింది. 

భారీగా హాజరైన మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి సాయంత్రం ఆరు గంటలకు ట్రంప్‌ ప్రసంగం మొదలు పెట్టారు. అప్పటికే సమీప గోడౌన్‌పై నక్కిన ఓ దుండగుడు ఏఆర్‌ శ్రేణి ఆటోమేటిక్‌ అసాల్ట్‌ రైఫిల్‌తో ట్రంప్‌పైకి కనీసం ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. దాంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అరుపులు, కేకలు, ఆక్రందనలు, పారిపోతున్న జనాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. 

ఒక తూటా ట్రంప్‌ కుడి చెవి పై భాగాన్ని గాయపరిచింది. మరిన్ని తూటాలు ఆయన తలకు అతి సమీపం నుంచి దూసుకెళ్లాయి. ట్రంప్‌ బాధతో తన చెవిని చేత్తో పట్టుకుంటూనే తూటాల నుంచి తప్పించుకునేందుకు వెంటనే డయాస్‌ కిందకు వంగారు. ఆలోపే సీక్రెట్‌ సరీ్వస్‌ సిబ్బంది టంప్ర్‌ను చుట్టుముట్టి రక్షణ కవచంలా నిలిచారు. చెవి నుంచి కుడి చెంప మీదుగా రక్తమోడుతున్న ట్రంప్‌ను హుటాహుటిన వేదిక నుంచి తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి సురక్షితంగా తరలించారు. 

వేదికను వీడుతూ ట్రంప్‌ పిడికిలి బిగించి పైకెత్తి, సభికులనుద్దేశించి ‘ఫైట్‌’ అని పదేపదే భావోద్వేగంతో బిగ్గరగా నినాదాలు చేశారు. వారు కూడా తమ నేతకు మద్దతుగా ఫైట్‌ అంటూ పెద్దపెట్టున ప్రతి నినాదాలు చేశారు. అక్కణ్నుంచి ట్రంప్‌ను హుటాహుటిన పిట్స్‌బర్గ్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారెక్కే ముందు కూడా ట్రంప్‌ మరోసారి పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రపంచమంతటా వైరలవుతోంది. 

ట్రంప్‌ క్షేమంగా ఉన్నట్టు అనంతరం ఆయన ప్రచార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దుండగుని కాల్పుల్లో సభికుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమీప భవనాలపై మోహరించి ఉన్న సీక్రెట్‌ సరీ్వస్‌ స్నైపర్లు తక్షణం స్పందించి దుండగున్ని కాల్చి చంపారు. అతన్ని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ అనే యువకునిగా గుర్తించారు. అతను కాల్పులకు తెగబడేందుకు కారణం తెలియాల్సి ఉంది. 

అమెరికా వంటి అగ్ర రాజ్యంలో మాజీ అధ్యక్షుని స్థాయి నేతపై ఇంత సమీపం నుంచి కాల్పులు జరగడం ఘోర భద్రతా వైఫల్యమేనంటున్నారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ట్రంప్‌పై దాడితో ప్రపంచం నివ్వెరపోయింది. హత్యా యత్నాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశాధినేతలంతా ఈ ఘటనను ఖండించారు.

దేవుడే కాపాడాడు: ట్రంప్‌ 
ప్రాణాంతక దాడి నుంచి తనను భగవంతుడే రక్షించాడని ట్రంప్‌ అన్నారు. కాల్పుల ఘటనపై తన సొంత సోషల్‌ మీడియా ‘ట్రూత్‌’లో ఆయన స్పందించారు. కాల్పుల్లో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘నిర్భయంగా ముందుకెళ్దాం. ఈ సమయంలో అమెరికన్లమంతా మరింత సమైక్యంగా నిలబడాల్సిన అవసరముంది. 

అమెరికన్లుగా మన వ్యక్తిత్వాన్ని చాటాల్సిన, దుష్టశక్తి గెలవకుండా అడ్డుకోవాల్సిన సమయమిది. మిమ్మలి్న, మన దేశాన్ని నేను త్రికరణశుద్ధిగా ప్రేమిస్తున్నా. త్వరలో విస్కాన్సిన్‌ సభ ద్వారా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని రిపబ్లికన్‌ పార్టీ మూడు రోజుల సదస్సును ఉద్దేశించి అన్నారు. ఈ సదస్సులో అధ్యక్ష అభ్యరి్థని అధికారికంగా ప్రకటించనుండటం తెలిసిందే.

120 మీటర్ల నుంచే కాల్పులు 
ట్రంప్‌పై కాల్పుల ఘటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం 120 నుంచి 150 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే అమెరికా మాజీ అధ్యక్షునిపైకి ఇంత సమీపం నుంచి కాల్పులు జరపడం నమ్మకశ్యం కాని విషయమని ఎఫ్‌బీఐ స్పెషల్‌ ఏజెంట్‌ కెవిన్‌ రోజెక్‌ అన్నారు. అంతమంది భద్రతా సిబ్బంది రక్షణలో ఉన్న ట్రంప్‌పైకి దుండగుడు అన్ని రౌండ్ల పాటు కాల్పులు జరపగలగడం వింతగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘దుండగుడు అంత సమీపానికి ఎలా రాగలిగాడు, ఎవరు సహకరించారు వంటి కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుంది’’ అని చెప్పారు.

దుండగుడు రిపబ్లికన్‌ ఓటరే 
ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ రిపబ్లికన్‌ పార్టీ ఓటరుగా నమోదు చేసుకున్నట్టు తేలడం విశేషం. అయితే 2021లో డెమొక్రటిక్‌ పార్టీ అనుబంధ విభాగానికి 15 డాలర్ల విరాళం ఇచి్చనట్టు కూడా వెల్లడైంది. కొద్ది రోజుల ముందే ట్రంప్‌ను ద్వేషిస్తూ, రిపబ్లికన్‌ పార్టీని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడట. క్రూక్స్‌ది పెన్సిల్వేనియాలో పిట్స్‌బర్గ్‌ శివార్లలోని బెథెల్‌ పార్క్‌ అని తేలింది. బతికుంటే ఈ నవంబర్లో అతను తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవాడు. మృతదేహం వద్ద గుర్తింపు కార్డుల వంటివేవీ లభించకపోవడంతో అతన్ని గుర్తించడం ఏజెంట్లకు కష్టంగా మారింది. దాంతో చివరికి డీఎన్‌ఏ పరీక్ష చేసి గుర్తించారు.

దుండగుని ముందస్తు ఏర్పాట్లు! 
ట్రంప్‌పై కాల్పులకు తెగబడేందుకు దుండగుడు ముందుగానే పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నట్టు భావిస్తున్నారు. దాడికి పాల్పడ్డ గోడౌన్‌ వంటి భవనం ర్యాలీకి అతి సమీపంలో ఉంది. దానిపైకి చేరుకునేందుకు ఒక నిచ్చెన కూడా ఏర్పాటు చేసి ఉంది. అతని మృతదేహం పక్కన పలు రకాలైన ప్యాకేజీలను పోలీసులు గుర్తించారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.  

భీతావహంగా ఘటనా స్థలి 
ట్రంప్‌పై హత్యా యత్నం జరిగిన బట్లర్‌ కేవలం 13 వేల జనాభా ఉండే చిన్న పట్టణం. పశి్చమ పెన్సిల్వేనియాలో పిట్స్‌బర్గ్‌కు 33 మైళ్ల దూరంలో ఉంటుంది. ఆరుబయట మైదాన ప్రదేశంలో ర్యాలీ జరిగింది. తన మార్కు ఎర్ర టోపీ, నల్ల సూటులో ట్రంప్‌ వేదికపైకి చేరుకుని ప్రసంగం మొదలు పెట్టారు. అమెరికాలోకి అక్రమ వలసలు పెరిగిపోయాయంటూ చార్ట్‌ సాయంతో వివరిస్తుండగా కాల్పులు మొదలయ్యాయి. దాంతో అంతా ప్రాణభయంతో కేకలు వేశారు. తూటాలను తప్పించుకునేందుకు నేలపై పడుకుండిపోయారు. ఆ ప్రదేశమంతా భీతావహంగా మారింది. ట్రంప్‌ను సురక్షితంగా తరలించాక కూడా చాలాసేపటిదాకా జనం నేలపై పడుకునే కని్పంచారు. అనంతరం భద్రతా సిబ్బంది రంగప్రవేశం చేసి ర్యాలీ వేదికను అదుపులోకి తీసుకున్నారు.

ముందే చూసిన జనం...! 
ట్రంప్‌పై కాల్పులకు దిగిన దుండగుడు క్రూక్స్‌ను తాము ముందే చూసినట్టు సభికుల్లో పలువురు వెల్లడించారు. అతడు గోడౌన్‌పై నెమ్మదిగా కదులుతూ ట్రంప్‌కు వీలైనంత సమీపంగా వచి్చనట్టు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులకు ముందే క్రూక్స్‌ చేతిలో తుపాకీని స్పష్టంగా చూసినట్టు మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ‘‘దేవుడా! అతని చేతిలో తుపాకీ ఉందంటూ అరిచా. అంతలోనే కాల్పులకు తెగబడటంతో వెంటనే నేలపై పడుకుని తలెత్తి చూశా. ఏజెంట్ల తూటాలకు అతని తల పేలిపోవడాన్ని కళ్లారా చూశా’’ అని చెప్పుకొచ్చాడు.  

పెరిగిన ట్రంప్‌ విజయావకాశాలు! 
అధ్యక్ష ఎన్నికల రేసులో ఇప్పటికే దూసుకుపోతున్న ట్రంప్‌ విజయావకాశాలు కాల్పుల ఉదంతం నేపథ్యంలో మరింతగా పెరిగినట్టు చెబుతున్నారు. ఆయన విజయావకాశాలు గత 24 గంటల్లోనే 8 శాతం పెరిగి ఏకంగా 70 శాతానికి చేరినట్టు రాజకీయ అంచనాల వేదిక పాలీమార్కెట్‌ పేర్కొంది. అంతటి ప్రాణాపాయ పరిస్థితిలోనూ ట్రంప్‌ అత్యంత వీరోచితంగా వ్యవహరించారంటూ అన్నివైపుల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తోంది.

 ‘‘తల పక్కనుంచి తూటాలు దూసుకెళ్లాయి. ఒకటి చెవిని ఛిద్రం చేసింది. అయినా ట్రంప్‌ అస్సలు భయపడలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి మోకాళ్లపై పాక్కుంటూ పోవడం వంటివేవీ చేయలేదు. ఏ మాత్రం వెరవకుండా తిరిగి లేచి నుంచున్నారు. భద్రతా సిబ్బందిని నిలువరించి మరీ పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు’’ అంటూ పలువురు మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు.

ట్రంప్‌తో మాట్లాడిన బైడెన్‌ 
హత్యా యత్నంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విస్మయం వెలిబుచ్చారు. ఈ దారుణ ఘటనను అంతా తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ట్రంప్‌ క్షేమంగా ఉండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం బైడెన్‌ ప్రజలనుద్దేశించి కూడా మాట్లాడారు. ఇలాంటి హింసకు అమెరికాలో తావు లేదన్నారు. షెడ్యూల్‌ ప్రకారం వారాంతాన్ని గడిపేందుకు బైడెన్‌ డెలావెర్‌ వెళ్లాల్సి ఉన్నా పర్యటన రద్దు చేసుకుని వైట్‌హౌస్‌కు తిరిగొచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్, జార్జి బుష్, డెమొక్రటిక్, రిపబ్లికన్‌ పార్టీ నేతలు తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.

మోదీ ఖండన 
ట్రంప్‌పై హత్యా యత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ‘‘నా మిత్రుడు ట్రంప్‌పై దాడి పట్ల తీవ్రంగా ఆందోళన చెందా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దేశాధినేతలు మాక్రాన్‌ (ఫ్రాన్స్‌), స్టార్మర్‌ (బ్రిటన్‌), ఆల్బనీస్‌ (ఆస్ట్రేలియా), మెలోనీ (ఇటలీ), కిషిడా (జపాన్‌), ట్రూడో (కెనడా), జెలెన్‌స్కీ (ఉక్రెయిన్‌), నెతన్యాహూ (ఇజ్రాయెల్‌) తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.

ఎప్పుడు ఏమి జరిగిందంటే
అమెరికా స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఆరింటికి ర్యాలీని ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగం మొదలైంది. తర్వాతేం జరిగిందంటే...  
6:11:33 – ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఒక తూటా కుడి చెవికి తాకడంతో బాధతో ముఖాన్ని తడుముకున్నారు 
6:11:35  – తూటాల నుంచి తప్పించుకునేందుకు డయాస్‌ కిందికి వంగారు. ‘గెట్‌ డౌన్‌’ అని అరుస్తూ భద్రతా సిబ్బంది పోడియంపైకి దూసుకొచ్చారు. రక్షణ కవచంలా ట్రంప్‌ను చుట్టుముట్టారు. అంతలో మరిన్ని తూటాలు దూసుకొచ్చాయి. 
6:11:41 – ‘ఏం చేస్తున్నాం మనం? ఏం జరుగుతోంది?’ అంటూ మహిళా ఏజెంట్‌ కేకలు. జనం కేకలు, అరుపులు. అంతటా గందరగోళం 
6:11:50 – మళ్లీ కాల్పుల చప్పుడు. ఒక మహిళ ఆక్రందన 
6:11:58 – ‘‘స్పేర్‌ (కారు) దగ్గరికి కదలండి’’ అంటూ ట్రంప్‌ భద్రతా ఏజెంట్ల పరస్పర హెచ్చరికలు 
6:12:06 – ‘హాక్‌ఐ (కౌంటర్‌ అటాక్‌ టీం) వచ్చేసింది, కారు వైపు వెళ్దాం’ అన్న భద్రతా సిబ్బంది

6:12:09 – సిద్ధంగా ఉండాలంటూ కార్లోని సిబ్బందికి సూచనలు
6:12:21 – షూటర్‌ చనిపోయాడని నిర్ధారించుకున్న ట్రంప్‌ భద్రతా సిబ్బంది
6:12:22 – కారువైపు కదిలేందుకు సేఫేనా అంటూ ఏజెంట్ల ఆరా
6:12:23 – ‘అంతా సేఫ్, కారువైపు పదండి’ అన్న మరో ఏజెంట్‌. ట్రంప్‌ను పైకి లేపిన సిబ్బంది.
6:12:35 – అంతా ఓకే అని ట్రంప్‌కు చెప్పిన ఏజెంట్లు
6:12:36 – తన షూ వేసుకోనివ్వాలన్న ట్రంప్‌
6:12:37 – ‘ఆగండి సర్‌. మీ తలంతా రక్తం’ అని ట్రంప్‌తో ఓ ఏజెంట్‌
6:12:39 – ‘సర్,  మనం కారువైపు కదలాలి’ అన్న మరో ఏజెంట్‌ 
6:12:47 – ‘ఆగండి, ఆగండి’ అంటూ భద్రతా సిబ్బందిని నిలువరించిన ట్రంప్‌. జనంకేసి చూస్తూ పిడికిలి బిగించి ‘ఫైట్‌’ అంటూ బిగ్గరగా నినాదాలు. అంతే బిగ్గరగా బదులిచి్చన జనం 
6:12:54 – ‘మనమిక వెళ్లాలి’ అంటూ ట్రంప్‌ను కారుకేసి తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది. మరోసారి నినాదాలు చేస్తూ కార్లో కూర్చున్న ట్రంప్‌

జుయ్‌మంటూ తూటాలు దూసుకెళ్తున్న శబ్దాలు స్పష్టంగా విని్పంచాయి. ఏదో జరుగుతోందని అనుకునేంతలో ఓ తూటా నా కుడి చెవి పై భాగాన్ని ఛిద్రం చేసింది. చర్మం తెగిపోయింది. విపరీతంగా రక్తం కారింది. ఏం జరుగుతోందో అప్పటికి నాకర్థమైంది. అమెరికా వంటి దేశంలో ఇలాంటి చర్య జరగడం అనూహ్యం. గాడ్‌ బ్లెస్‌ అమెరికా
– తనపై కాల్పులను ఉద్దేశించి సొంత సోషల్‌ మీడియా ‘ట్రూత్‌’లో డొనాల్డ్‌ ట్రంప్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement