ఫ్రాంకోయిస్ హోలాండ్
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌కు ఇండియాలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ బయటపెట్టారు. ఫ్రెంచి మీడియాతో హోలాండ్ మాట్లాడుతూ ‘డసాల్ట్ ఏవియేషన్‌కు భారత్‌లో భాగస్వామిగా అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసింది. మా ప్రమేయం ఏమీ లేదు.
ఎంచుకోవడానికి మాకు మరో కంపెనీ కూడా లేదు. భారత్ నిర్ణయించిన భాగస్వామినే మేం అంగీకరించి చర్చలు ప్రారంభించాం’ అని తెలిపారు. దీంతో రాఫెల్ ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, హోలాండ్ వెల్లడించిన విషయాలకు పొంతన లేకుండా పోయింది. 2015 ఏప్రిల్‌లో నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో చర్చల తర్వాత 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనున్నట్లు మోదీ చెప్పారు.
ప్రాణమిత్రుడి కోసమే ఈ కుట్ర: కాంగ్రెస్
రాఫెల్ విషయంలో హోలాండ్ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని బీజేపీపై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. ప్రాణ స్నేహితుడికి లాభం చేకూర్చేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వం కుట్ర, దగాకు పాల్పడిందనీ, ఇప్పుడు హోలాండ్ మాటలతో ఆ విషయం బట్టబయలైందని విమర్శించింది. ‘మోదీ భారత్‌ను వెన్నుపోటు పొడిచారు. మోదీ రహస్యంగా, వ్యక్తిగతంగా చర్చలు జరిపి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని మార్చారు. దివాలా తీసిన, రక్షణ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రాజెక్టును మోదీనే∙ఇచ్చినట్లు ఇప్పుడందరికీ తెలిసింది.
మన సైనికుల రక్తాన్ని మోదీ అగౌరవపరిచారు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీట్‌చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ను కాదని 30 వేల కోట్ల ప్రాజెక్టును ప్రధాని తన స్నేహితుడి కంపెనీకి కట్టబెట్టడంలో ఉన్న మోసం, కుట్ర, దగా బయటపడింది’ అని అన్నారు. కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ ‘ఎన్డీయే కుదుర్చుకున్న రాఫెల్ ఒప్పందంలో మనకు విమానాలు రాలేదు. అబద్ధాలు మాత్రమే వచ్చాయి. హోలాండ్ చెప్పిన వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఏ కొత్త అబద్ధం చెబుతారో?’ అని అన్నారు.
కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ట్వీట్ చేస్తూ 2012లో తాము ఒక్కో రాఫెల్ యుద్ధ విమానాన్ని రూ. 526 కోట్లకే కొనేందుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ 2015కు ఆ ధర రూ. 1,670 కోట్లకు ఎలా పెరిగిందో కూడా హోలాండ్ చెప్పాలని కోరారు. కీలక వాస్తవాలను దాచిపెట్టి దేశ భద్రతను మోదీ ప్రమాదంలో పడేస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మాట్లడుతూ రాఫెల్ ఒప్పందం పెద్ద కుంభకోణమనీ, మోదీ ప్రభుత్వం అబద్ధాలతో భారతీయులను తప్పుదోవ పట్టించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment