సియోల్ : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గున్ హైకి ఎనిమిదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ సియోల్ సెంట్రల్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. గూఢాచార సంస్థకు జరిపిన కేటాయింపుల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడటం, నిషేధం ఉన్నప్పటికీ 2016 పార్లమెంటరీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలు రుజువైన నేపథ్యంలో శిక్ష ఖరారు చేసినట్లు కోర్టు తెలిపింది. కాగా పార్క్‌కు ఇప్పటికే ఓ అవినీతి కేసులో 24 ఏళ్ల పాటు శిక్ష పడింది. ప్రభుత్వ ఖజానాకు చెందిన 2.91 మిలియన్ డాలర‍్లను తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారన్న కారణంగా ఆమెకు శిక్ష పడింది. ఈ క్రమంలో పార్క్ 32 ఏళ్ల పాటు జైలులోనే జీవితాన్ని గడపాల్సి ఉంటుంది.
వివాదాలకు కేరాఫ్...
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు పార్క్ చుంగ్- హీ కుమార్తె అయిన పార్క్ గున్ హైపై అవినీతి, అధికార దుర్వినియోగం, కోర్టు ధిక్కరణ వంటి పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ సొంత పార్టీ నేతలే పట్టుబట్టారు. కాగా తనపై ఆరోపణలు రుజువైనప్పటికీ కూడా రాజీనామా చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఎనిమిది మందితో కూడిన రాజ్యాంగ కమిటీ ఆమెపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంతో పదవి కోల్పోవాల్సి వచ్చింది. 2017లో పదవి కోల్పోయిన అనంతరం పార్క్ గున్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయినప్పటికీ ఆమె తన ప్రవర్తన మార్చుకోకుండా కోర్టుకు హాజరు కాకుండా ధిక్కరణకు పాల్పడ్డారు. దీంతో శిక్షతో పాటు 16 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment