![Iran strikes back at US with missile attack on bases in Iraq - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/9/usa.jpg.webp?itok=Ovc6yayS)
ఖమేనీ , ట్రంప్
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్–అమెరికాల మధ్య ఉద్రిక్తతలు బుధవారం కీలక మలుపు తీసుకున్నాయి. ఒకవైపు, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మంగళవారం రాత్రి క్షిపణుల వర్షం కురిపించగా, మరోవైపు, అమెరికా అనూహ్యంగా శాంతి మంత్రం జపించింది. ఇరాన్ క్షిపణి దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని, తమ మిలటరీ స్థావరాలకు కొంత నష్టం మాత్రం వాటిల్లిందని బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శాంతిని కోరుకునే అందరితో శాంతియుత సంబంధాలనే కోరుకుంటామన్నారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థను నిర్మూలించేందుకు కలసిరావాలని ఇరాన్‌ను కోరారు. దీంతో, తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు కొంతమేరకు చల్లబడ్డాయి. అమెరికా సైనికులు, సంకీర్ణ దళాలు ఉన్న అల్ అసద్, ఇర్బిల్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ప్రకటించింది. ఈ దాడి అమెరికాకు చెంపపెట్టులాంటిదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ‘అమెరికాకు భయపడి వెనక్కువెళ్లబోం’ అని ఈ దాడి ద్వారా స్పష్టం చేశామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ స్పష్టం చేశారు.
ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని అమెరికా చంపినందుకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ అధికార టీవీ ప్రకటించింది. ‘ఈ దాడుల్లో అమెరికాకు చెందిన 80 టెర్రరిస్ట్ సైనికులు హతమయ్యారు’ అని వ్యాఖ్యానించింది. ‘అమెరికా సైనికులు ఉన్న రెండు స్థావరాలపై 22 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడిలో ఇరాకీ సైనికులకు గాయాలు కాలేదు’ అని ఇరాక్ మిలటరీ ప్రకటించింది. ‘నేరానికి పాల్పడితే.. తగిన జవాబు సిద్ధంగా ఉంటుందని ఆమెరికాకు తెలియాలి’ అని హసన్ రౌహానీ పేర్కొన్నారు. ‘వారు తెలివైన వారైతే.. ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోరు’ అని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
భయాందోళనలకు తెర
ఇరాన్ క్షిపణి దాడులపై అమెరికా ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ, మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేవనుందనే ఊహాగానాల మధ్య బుధవారం ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘శాంతిని కోరుకునే అందరితో అమెరికా సామరస్యపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది’ అని ఇరాన్ నాయకత్వానికి, ప్రజలకు స్పష్టం చేశారు. ‘ఇరాన్ ప్రజలు, ఆ దేశ నాయకులు కోరుకున్న భవిష్యత్తు, గొప్ప భవిష్యత్తు లభించాలనే మేమూ కోరుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారనివ్వబోనని ప్రతినబూనారు. ‘నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతవరకు ఇరాన్ అణ్వాయుధ దేశం కాబోదు’ అన్నారు. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని తక్షణమే విడనాడాలన్నారు. ప్రస్తుతం ఇరాన్‌తో ప్రపంచ దేశాలు మరింత సమర్ధవంతమైన అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉందన్నారు. సులేమానీని క్రూరుడైన ఉగ్రవాదిగా ట్రంప్ మరోసారి అభివర్ణించారు.
అమెరికా, ఇరాన్ రక్తంతో సులేమానీ చేతులు తడిచాయన్న ట్రంప్.. అతడిని అంతమొందించడం ద్వారా ఉగ్రవాదులకు కఠిన సందేశమిచ్చామన్నారు. ఉగ్ర సంస్థ ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీని అంతమొందించడం వల్ల ఇరాన్‌కు మంచి జరిగిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్‌పై తక్షణమే మరిన్ని ఆర్థిక ఆంక్షలను విధించనున్నామని ప్రకటించారు. ఇరాన్ తన తీరును మార్చుకునే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ దాడి చేసిన సైనిక కేంద్రాల్లోని తమ సైనికులంతా క్షేమంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు.
ఇరాన్ దాడులకు తెగబడే అవకాశముందన్న సమాచారం నేపథ్యంలో ఇరాక్‌లో తమ దళాలున్న అన్ని మిలటరీ స్థావరాల్లో తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నామని అమెరికా మిలటరీ కేంద్రం పెంటగన్ అధికార ప్రతినిధి జొనాథన్ హాఫ్‌మన్ తెలిపారు. తమ దళాలు, మిత్ర పక్షాల సంకీర్ణ దళాల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు, ట్రంప్ బుధవారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానికి ఫోన్ చేసి ఇరాన్ – ఇరాక్ పరిస్థితిపై చర్చించారు. జర్మనీ చాన్సెలర్ మెర్కెల్‌తో ఉద్రిక్త పరిస్థితిపై ట్రంప్ చర్చించారు.
చావుదెబ్బ తీస్తాం: ఇజ్రాయెల్
మాపై దాడికి దిగితే చావుదెబ్బ తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తమ బద్ధ శత్రువు ఇరాన్‌ను హెచ్చరించారు. సులేమానీని హతమార్చినందుకు అమెరికాకు అభినందనలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో ఘర్షణల్లో అమెరికాకు తమ సంపూర్ణ మద్దతుంటుందన్నారు. ఇజ్రాయెల్ నగరాలను నేలమట్టం చేస్తామని ఇటీవల ఇరాన్ మిలటరీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో నెతన్యాహూ పై వ్యాఖ్యలు చేశారు.
ఇరాక్ వెళ్లకండి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాక్ వెళ్లాలనుకునే పర్యాటకులకు భారత్ పర్యాటక సూచన జారీ చేసింది. ‘అంతగా అవసరం లేని ప్రయాణమైతే రద్దు చేసుకోండి’ అని ఇరాక్ వెళ్లే భారత ప్రయాణీకులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇరాక్‌లోని భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు అస్సలు చేయవద్దని సూచించింది.
శాంతికి భారత్ కృషి చేయాలి
ఇరాన్–అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తీసుకునే ఎలాంటి శాంతి చర్యలనైనా ఇరాన్ స్వాగతిస్తుందని భారత్‌లో ఆ దేశ రాయబారి అలీ చెగెనీ పేర్కొన్నారు. ఇరాన్–అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగబోవని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. సులేమానీకి నివాళులర్పించేందుకు ఇరాన్ ఎంబసీలో బుధవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment