కీవ్/మాస్కో: రష్యా నుంచి చమురు దిగుమతిపై నిషేధంతో సహా పలు ఆంక్షలను యూరోపియన్ యూనియన్(ఈయూ) శుక్రవారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. రాబోయే ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఈయూ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై నిషేధాన్ని వచ్చే ఎనిమిది నెలల్లో పూర్తిగా నిషేధిస్తామని పేర్కొంది.
హంగేరి, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, బల్గేరియా, క్రొయేషియా తదితర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను 90 శాతం నిలిపేస్తామని ఈయూ నేతలు ప్రకటించారు. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలకు వేదిక అయిన ‘స్విఫ్ట్’ వ్యవస్థను రష్యా ఉపయోగించుకోకుండా ఈయూ ఇప్పటికే కట్టడి చేసింది. రష్యా టీవీ చానళ్లను కూడా ఈయూ నిషేధించింది.
రష్యా క్రూర దాడులు: జెలెన్‌స్కీ
తూర్పు డోన్బాస్‌లో భీకర యుద్ధం కొనసాగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. రష్యా క్రూరంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. సీవిరోడోంటెస్క్‌లో రష్యా దాడులను తిప్పికొట్టడంలో తాము కొంత పురోగతి సాధించామని అన్నారు. సమీపంలోని లీసిచాన్‌స్క్, బఖ్‌ముత్‌లో పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని తెలిపారు. పలు నగరాలు, పట్టణాలపై రష్యా సేనలు క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.
డోన్బాస్‌లో రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించి, యుద్ధ రంగంలోకి దించుతున్నారని జెలెన్‌స్కీ ఆరోపించారు. సాధారణ ప్రజలను ముందు వరుసలో ఉంచి, వారి వెనుక రష్యా సైనికులు వస్తున్నారని వెల్లడించారు. మున్ముందు మరింత సిగ్గుమాలిన, హేయమైన పరిణామాలను చూడబోతున్నామని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్ సిస్టమ్స్ ఇచ్చేందుకు అంగీకరించిన అమెరికాకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు.
లీసిచాన్‌స్క్.. 60 శాతం ధ్వంసం
తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రధాన నగరాల్లో ఒకటైన లీసిచాన్‌స్క్‌లో రష్యా సేనలు క్షిపణుల మోత మోగిస్తున్నాయి. సిటీలో 60 శాతం మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా నిరంతర దాడుల వల్ల విద్యుత్, సహజ వాయువు, టెలిఫోన్; ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయినట్లు స్థానిక అధికారి ఒలెగ్జాండ్రా జైకా చెప్పారు. బఖ్‌ముత్–లీసిచాన్‌స్క్ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. లీసిచాన్‌స్క్ నుంచి ఇప్పటిదాకా 20,000 మంది పౌరులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గతంలో ఇక్కడ 97,000 జనాభా ఉండేది.
షోల్జ్‌తో ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ భేటీ
ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ స్టెఫాన్‌చుక్ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో బెర్లిన్‌లో సమావేశమయ్యారు. తమ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు. జర్మనీ పార్లమెంట్ సమావేశంలో స్టెఫాన్‌చుక్ పాల్గొన్నారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ ఆయనకు స్వాగతం పలికారు.
ఉక్రెయిన్‌లో పౌర మరణాలు
4,945: ఐరాస
రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 9,094 మంది సాధారణ పౌరులు బాధితులుగా మారారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం తాజా నివేదికలో వెల్లడించింది. 4,149 మంది ప్రాణాలు కోల్పోయారని, 4,945 మంది క్షతగాత్రులయ్యారని తెలియజేసింది. బలమైన పేలుడు సంభవించే ఆయుధాల వల్లే ఎక్కువ మంది మరణించారని, గాయపడ్డారని పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం భారీ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా ప్రారంభించిన యుద్ధంలో తమ దేశంలో 243 మంది చిన్నారులు బలయ్యారని, 446 మంది గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment