‘అమెరికాది క్షమించరాని తప్పు.. ఢీకొడతాం’
ప్యాంగ్‌యాంగ్: సిరియాపై అమెరికా క్షిపణుల దాడిని ఉత్తర కొరియా ఖండించింది. ఒక సార్వభౌమాధికార దేశంపై అమెరికా చేసిన ఈ దాడి ఏమాత్రం సమ్మతించదగినది కాదని పేర్కొంది. అమెరికా చేసిన ఈ చర్యతో తమ మిలటరీ విభాగాన్ని మరింత అభివృద్ది చేసుకోవాలని అర్థమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యను చేసింది.
‘సిరియాపై అమెరికా చేసిన క్షిపణి దాడి క్షమించరానిది. ఒక సార్వభౌమ దేశంపై అమెరికా చేసిన దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి మాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నాం. ఇలాంటి దాడులు ఏక్షణమైనా తమపై జరగొచ్చని అమెరికా పరోక్షంగా తెలిపింది. అందుకే మేం సైనిక సంపత్తిని పెంచుకోవడంపై మరింత వేగాన్ని పెంచుతాం. తగిన సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బదులిస్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఏప్రిల్ 6న 59 క్షిపణులను అమెరికా సిరియా వైమానిక స్థావరాలపై ప్రయోగించిన విషయం తెలిసిందే. కెమికల్ దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడి చేసినట్లు అమెరికా ప్రకటించింది. మరోపక్క, ఈ దాడితో చైనాకు, ఉత్తర కొరియాకు పరోక్షంగా అమెరికా హెచ్చరికలు చేసిందంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికాను మరింత రెచ్చగొట్టేలా ఉత్తర కొరియా తాజా ప్రకటన చేసింది.