ఉత్తర కొరియావైపు కదిలిన అమెరికా దండు
వాషింగ్టన్: ఇప్పటికే సిరియాపై దాడితో ఒక్కసారిగా ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిన అమెరికా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అమెరికా నేవికి చెందిన యుద్ధవిమానాల వాహక నౌకాదళాన్ని ఉత్తర కొరియావైపు పంపించింది. గత కొద్ది రోజులుగా అణుకార్యక్రమాలను ఆపివేయాలని చెబుతున్నప్పటికీ బుద్ధి మార్చుకోకుండా వ్యవహరిస్తున్న ఆ దేశానికి తన పవరేమిటో చూపించేందుకు నావికాదళాన్ని కొరియా ద్వీపంవైపుగా నడిపిస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్పారు. అమెరికా చేస్తున్న ఈ పనితో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
సిరియాపై దాడిని ఖండించినా ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం సర్దుమణుగుతున్న తరుణంలో అమెరికా మరింత దూకుడుగా తీసుకున్న ఈ నిర్ణయం కొంత ఆందోళనలో పడేసింది. ఇప్పటికే అమెరికా దాడిని ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించడంతోపాటు తమ సైనిక, ఆయుధ సంపత్తిని మరింత మెరుగుపరుచుకుంటామని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటామని ప్రకటించిన ప్రస్తుత తరుణంలో అమెరికా యుద్ధనౌక అటుగా వెళ్లడం టెన్షన్ పూరిత వాతావరణం నెలకొంది. ‘అమెరికా పసిఫిక్ కమాండ్ ఉత్తర ప్రాంతంలో ఉన్న కార్ల్ విన్సన్ దాడి గ్రూపును పశ్చిమ పసిఫిక్‌లో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించాం’ అని అమెరికా పసిఫిక్ కమాండ్ కమాండర్, అధికార ప్రతినిధి దేవ్ బెన్హామ్ తెలిపారు.