కీవ్ శివారులో ధ్వంసమైన రష్యా ట్యాంకుల సమీపంలో ఉక్రెయిన్ సైనిక వాహనం
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాల్లో గురువారం భీకర పోరు కొనసాగింది. దీంతో సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన ముసుగులో రష్యా తన సేనలను పునరేకీకరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా డోన్బాస్ ప్రాంతంలో భారీగా మోహరింపులు చేస్తోందని, వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ ప్రకటించారు. మరోవైపు మారియుపోల్ నుంచి ప్రజలను తరలించేందుకు పలు బస్సులను ఆ నగరానికి పంపారు.
నగరం నుంచి పౌర తరలింపు కోసం పరిమిత కాల్పుల విరమణకు రష్యా అంగీకరించింది. శుక్రవారం ఇరుపక్షాల మధ్య మరోదఫా ఆన్‌లైన్ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటికే నగరం నుంచి పలువురు వలస పోవడంతో నగర జనాభా 4.3 లక్షల నుంచి లక్షకు దిగివచ్చింది. వీరిని కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 45 బస్సులను ఇక్కడికి పంపామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. చెర్నోబిల్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు.
రష్యా వెనక్కు తగ్గలేదు
ముందుగా అంగీకరించినట్లు రష్యా వెనక్కు తగ్గడం లేదని నాటో జనరల్ స్టోల్టెన్‌బర్గ్ సైతం ఆరోపించారు. బలగాల ఉపసంహరణ ముసుగులో రష్యా తన బలగాలకు సరఫరాలందించడం, కావాల్సిన ప్రాంతాల్లో మోహరించడం చేస్తోందన్నారు. ఒకపక్క డోన్బాస్‌పై దాడికి దిగుతూనే మరోపక్క కీవ్ తదితర నగరాలపై రష్యా ఒత్తిడి పెంచుతోందని నాటో ఆరోపించింది. రష్యా చాలా పరిమితంగా బలగాల తరలింపు చేపట్టిందని బ్రిటన్ కూడా ఆరోపించింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి రష్యా తప్పు చేసిందన్న యూఎస్ వ్యాఖ్యలను రష్యా తోసిపుచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా 1, 34, 500 మందిని సైన్యంలో చేర్చుకునే ఆదేశాలపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు.
వ్యూహాత్మక తప్పిదం
ఉక్రెయిన్‌పై దాడికి దిగాలనుకోవడం పుతిన్ చేసిన వ్యూహాత్మక తప్పిదమని, దీని వల్ల రష్యా బలహీనపడిందని, ప్రపంచదేశాల మధ్య ఏకాకిగా మారిందని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. రష్యా మిలటరీ పుతిన్‌ను తప్పుదోవ పట్టించి యుద్ధానికి దించిందని, దీనివల్ల ప్రస్తుతం పుతిన్‌కు మిలటరీ అగ్రనాయకులకు మధ్య పొరపచ్చాలు వచ్చాయని వైట్‌హౌస్ ప్రతినిధి కేట్‌బీడింగ్‌ఫీల్డ్ చెప్పారు. రష్యాపై ఆంక్షలను, ఉక్రెయిన్‌కు సాయాన్ని అమెరికా కొనసాగిస్తుందన్నారు.
రష్యాలో నాయకత్వ మార్పును బైడెన్ కోరుకోలేదని చెప్పారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత్ పర్యటనకు వచ్చారు. శుక్రవారం ఆయన ప్రధాని మోదీతో, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమవుతారు. ఎస్400 మిసైల్ వ్యవస్థలోని భాగాలతో పాటు పలు మిలటరీ హార్డ్‌వేర్‌ను సకాలంలో అందించాలని లావ్రోవ్‌ను భారత్ కోరనుందని సమాచారం. తొలినుంచి ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment