Ukraine conflict: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై ప్రత్యక్ష దాడికి దిగిన రష్యా సేనలు శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దులకు వచ్చాయి. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు, మిలటరీ బేస్‌లపై రష్యా వైమానిక దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించి తమకనుకూల ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాలన్నదే పుతిన్ ప్రయత్నమని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. ఇందులో భాగంగా కీవ్ వైపు పుతిన్ తన బలగాలను నడిపిస్తున్నట్లు భావిస్తున్నారు.
శుక్రవారం కీవ్ నగరంలో పలుచోట్ల పేలుళ్లు వినిపించాయి. పశ్చిమం వైపునుంచి కీవ్‌కు సంబంధాలను నిలిపివేశామని రష్యా బలగాలు తెలిపాయి. నీపర్ నదిపై వంతెన వద్ద 200 మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా బలగాలను ఎదుర్కొంటున్నారు. కీవ్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని ఇవాంకివ్ నగరంలో రష్యా బలగాలతో భీకరంగా పోరాటం జరిపినట్లు ఉక్రెయిన్ మిలటరీ తెలిపింది. కీవ్‌కు తూర్పున ఉన్న సుమే నగరంలోకి మాత్రం రష్యా బలగాలు ప్రవేశించాయి. మరోవైపు పాశ్చాత్య దేశాల నేతలు ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమవుతున్నారు.
పలు దేశాలు మరింత కఠినమైన ఆంక్షలను రష్యాపై విధించాయి. కీవ్‌కు దగ్గరలోని ఒక వ్యూహాత్మక ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు రష్యా బలగాలు ప్రకటించాయి. రష్యా గూఢచారులు కీవ్ సమీపంలో ఉన్నారని ఉక్రెయిన్ బలగాలు చెప్పాయి. నగరంలో పలుచోట్ల ఉక్రెయిన్ సైనికులు భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. కీవ్‌పై దాడి తప్పక జరుగుతుందని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్ అభిప్రాయపడ్డారు. తామంతా భయం గుప్పిట్లో బతుకుతున్నామని ఉక్రెయిన్ ప్రజలు మీడియా ముందు వాపోయారు. రష్యా దాడి తప్పదన్న భయాలతో వేలాదిమంది పౌరులు అండర్‌గ్రౌండ్‌లో దాగారు. దీంతో పలుచోట్ల సబ్‌వే స్టేషన్లు నిండిపోయాయి.
రష్యా టార్గెట్ నేనే
రష్యా దాడి ప్రధాన లక్ష్యం తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. తాను దేశం విడిచిపోలేదని, కీవ్‌లోనే ఉంటానని ప్రకటించారు. యుద్ధంలో 137 మంది సైనికులు మరణించారని, 316 మంది పౌరులు గాయపడ్డారని చెప్పారు. తమ ప్రతిదాడిలో 400కు పైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా ఇంతవరకు అధికారిక మృతుల సంఖ్యను ప్రకటించలేదు. కేవలం తమ యుద్ధ విమానం ఒకటి మాత్రం కూలిపోయిందని, అదికూడా పైలెట్ తప్పిదం వల్ల జరిగిందని తెలిపింది.
25 మంది పౌరులు దాడిలో చనిపోయారని, లక్ష మంది నిరాశ్రయులయ్యారని, దాడి ముమ్మరమైతే 4 లక్షలమంది పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఐరాస వర్గాలు తెలిపాయి. యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న అతిపెద్ద భౌగోళిక ముట్టడి ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ నేతల సమావేశానికి జెలెన్‌స్కీ ఆన్‌లైన్‌లో హాజరవుతారు. ఉక్రెయిన్ నగరాలను తాము లక్ష్యంగా చేసుకోలేదని రష్యా ప్రకటించింది. అయితే పలు నగరాల్లో పౌర ఆవాసాలు దాడుల్లో ధ్వంసమైనట్లు ఉక్రెయిన్‌లోని పాత్రికేయులు చెప్పారు.
వణికించిన పేలుళ్లు
రాజధాని కీవ్ నగరం శుక్రవారం రష్యా బలగాల దాడులతో దద్దరిల్లింది. దీంతో ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కీవ్‌వైపు కదులుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టి తమకనుకూల ప్రభుత్వాన్ని ప్రతిష్టించడమే పుతిన్ లక్ష్యమని అమెరికా ఆరోపించింది. ఇందుకోసమే రష్యా సేనలు రాజధానిని లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించింది. రష్యా ప్రయోగించిన ఒక రాకెట్ దెబ్బకు భారీ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయని కీవ్ మేయర్ తెలిపారు. ఇప్పటికే చెర్నోబిల్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. దీంతో ఇక రష్యా దృష్టి పూర్తిగా కీవ్‌పై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా దుర్మార్గ మార్గాన్ని ఎంచుకుందని కానీ తాము తమ స్వాతంత్య్రం కోసం పోరాడతామని జెలెన్‌స్కీ ప్రకటించారు.
ఆయుధాలు వీడితే చర్చిద్దాం!
► ఉక్రెయిన్‌ను ఆక్రమించే యోచన లేదు
► రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్
మాస్కో: ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు వీడితే చర్చలకు తాము సిద్ధమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ శుక్రవారం ప్రకటించారు. తమ అధ్యక్షుడు పుతిన్ కోరినట్లు సైన్యం ఆయుధాలు వీడి స్పందిస్తే ఎప్పుడైనా చర్చిద్దామన్నారు. డొనెట్స్‌క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్స్‌క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఇటీవల రష్యా గుర్తించిన భూభాగాలు) విదేశాంగ మంత్రులతో చర్చల అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. తమ సైనిక చర్య కేవలం ఉక్రెయిన్‌ను డీనాజీఫై(నాజీలు లేకుండా చేయడం), డీమిలటరైజ్ ( నిస్సైనికీకరణ) చేసేందుకేనని, ఉక్రెయిన్‌ను ఆక్రమించేందుకు కాదని చెప్పారు.
‘‘ పుతిన్ పిలుపునకు స్పందించి ఉక్రెయిన్ తన పోరాటాన్ని నిలిపి వేసి, ఆయుధాలు వదిలేస్తే చర్చలకు తయారుగా ఉన్నాం. ఉక్రేనియన్లపై దాడి చేసి వారిని అణచివేయాలని ఎవరూ అనుకోవడం లేదు. ఉక్రేనియన్లకు తమ భవిష్యత్‌ను తామే నిర్ణయించుకునే అవకాశం ఇద్దాం.’’ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. చర్చలకు కొరత లేదని, కానీ చర్చల స్థానంలో కఠోర విధ్వంసం జరిగినప్పుడు, మిన్స్‌క్ ఒప్పందాల అమలులో రష్యా విఫలమైందని అసత్య ఆరోపణలు చేస్తున్నప్పుడు (ఇందులో పాశ్చాత్య దేశాలది ప్రముఖ పాత్ర), రష్యా దౌర్జన్యం చేస్తోందని ఆరోపిస్తూ ఈ దఫా అన్ని పరిమితులను దాటినప్పుడు చర్చలుండవన్నారు.
బెలారస్‌కు బృందం
ఉక్రెయిన్ అధికారులతో చర్చలకు ఒక బృందాన్ని బెలారస్‌కు పంపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధికార వర్గాలు తెలిపాయి. ఏ కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండేందుకు తాము సిద్ధమని జెలెన్‌స్కీ ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ స్పందించినట్లు తెలిపాయి. అయితే వార్సా నగరానికి చర్చకు వస్తామని ఉక్రెయిన్ అధికారులు చెప్పారని అనంతరం ఎలాంటి సందేశం రాలేదని రష్యా వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌ను డీమిలటరైజ్ చేయడం కోసమే తాము దాడి చేస్తున్నామని పుతిన్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే! ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు త్యజించి ఇళ్లకు వెళ్లాలని సూచించారు.
రేపు మీకూ ప్రమాదమే!
‘మీరు మాకిప్పుడు సహాయం చేయకపోతే, రేపు యుద్ధం మీ తలుపు తడుతుంది’ అని జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. తమ పై పడే ప్రతి బాంబు యూరప్‌పై పడినట్లేనని ఆయన యూరోపియన్ యూనియన్ దేశాలకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. నేరుగా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తామని రష్యా చెప్పకపోయినా, ఉక్రెయిన్‌ను ఇలాగే వదిలేస్తే ఎప్పటికైనా నాటోలో చేరవచ్చని పుతిన్ భావిస్తున్నారు. అందుకే తమకు అనుకూల ప్రభుత్వం ఏర్పరచాలని యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment