రష్యా దాడులతో కీవ్‌లోని ఓ అపార్టుమెంట్‌కు అంటుకున్న మంటలు.. ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ సహా పలు కీలక నగరాలపై రష్యా సైన్యం దాడులు సోమవారం మరింత పదునెక్కాయి. కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా దళాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. నగరాన్ని, శివార్లను లక్ష్యం చేసుకుని క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దాంతో ఇర్పిన్, బుచా, హోస్టొమెల్ వంటి శివారు ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. దాడుల్లో నగరంలోని ఒక పెద్ద అపార్ట్‌మెంట్ కూలిపోగా ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా విమానాలు తయారు చేసే కీవ్‌లోని ఆంటొనోవ్ ఫ్యాక్టరీ దెబ్బ తిన్నది. ప్లాంటులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
మారియుపోల్, మైకోలెయివ్, ఖర్కీవ్ సహా పలు నగరాలు దాడుల ధాటికి అల్లాడుతున్నాయి. మైకోలెయివ్, ఖర్కీవ్‌ల్లో రష్యా వైమానిక దాడుల్లో పలు నివాస భవనాలు, రివైన్ ప్రాంతంలో ఓ టీవీ టవర్ నేలమట్టమయ్యాయి. పౌర మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఒక్క మారియుపోల్‌లోనే కనీసం 2,500 మందికి పైగా యుద్ధానికి బలైనట్టు నెక్స్‌టా మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వలసలు 28 లక్షలు దాటాయని ఐరాస పేర్కొంది. సంక్షోభంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్, చైనా విదేశాంగ శాఖ సలహాదారు యాంగ్ జీచీ రోమ్‌లో చర్చలు జరిపారు.
మా అంచనాలు తప్పుతున్నాయి: రష్యా
యుద్ధం తాము ఆశించినట్టుగా సాగడం లేదని రష్యా తొలిసారి అంగీకరించింది. తమ సేనలు అనుకున్న దానికంటే నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని రష్యా నేషనల్ గార్డ్స్ చీఫ్ విక్టర్ జొలొటోవ్ అన్నారు. మరోవైపు రష్యా జీఆర్‌యూ మిలిటరీ ఇంటలిజెన్స్ అధికారి కెప్టెన్ అలెక్సీ గుల్చక్ సోమవారం మారియుపోల్‌లో దాడుల్లో మరణించారు. దీంతో యుద్ధంలో ఇప్పటిదాకా మరణించిన రష్యా సైనికాధికారుల సంఖ్య 12కు చేరింది.
ఎటూ తేల్చని నాలుగో రౌండ్ చర్చలు
భీకర దాడుల మధ్యే సోమవారం రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం నాలుగో రౌండ్ చర్చలు జరిగాయి. గంటల తరబడి జరిగిన చర్చలు చెప్పుకోదగ్గ ఫలితమేదీ లేకుండానే ముగిశాయి. ముట్టడిలో ఉన్న నగరాలకు సాయం అందించడం తదితరాలకే చర్చలు పరిమితమైనట్టు సమాచారం. చర్చలు మంగళవారం కొనసాగనున్నాయి. శాంతి, కాల్పుల విరమణ, తక్షణం సైన్యాల ఉపసంహరణ, భద్రత హామీలను తమ ప్రధాన డిమాండ్లుగా ఉంచినట్టు ఉక్రెయిన్ చెప్పింది.
చైనా సైనిక సాయం కోరిన రష్యా!
ఉక్రెయిన్‌పై పట్టు సాధించేందుకు మిత్రదేశం చైనాను రష్యా సైనిక సాయం అర్థిస్తోందని అమెరికా సీనియర్ అధికారి ఒకరన్నారు. ఆయుధాలు, సైనిక సామాగ్రి కోరుతోందని వెల్లడించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల భయంతో చైనా ఎటూ తేల్చుకోలేకపోతోందని సమాచారం. ఇది తప్పుడు ప్రచారమని, చైనాతో పాటు రష్యా కూడా ఖండించింది.
ఆహార విపత్తును ఎదుర్కొంటాం: ఐరాస
చూçస్తుండగానే ఉక్రెయిన్ శ్మశానంగా మారిపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వెలిబుచ్చారు. అణు యుద్ధ ప్రమాదం వెన్నులో చలి పుట్టిస్తోందన్నారు. ప్రపంచ ఆహార భద్రతపైనా యుద్ధం పెను ప్రభావం చూపుతోందన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆహార, ఇంధన విపత్తు స్పందన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
30 వేల సైన్యంతో నాటో విన్యాసాలు
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో అంతర్జాతీయంగా నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో భారీ బల ప్రదర్శనకు దిగింది. యూరప్, ఉత్తర అమెరికా నుంచి 25కు పైగా సభ్య దేశాలకు చెందిన 30 వేల మంది సైనికులు, 200 యుద్ధ విమానాలు, 50కి పైగా యుద్ధ నౌకలతో ఉత్తర నార్వేలో సోమవారం భారీ కవాతు జరిపింది. ఇది యుద్ధానికి చాలా ముందే ఖరారైన షెడ్యూల్ అని, రష్యాకూ వీటిపై సమాచారముందని నార్వే చెప్పింది. రెండేళ్లకోసారి జరిగే ఈ విన్యాసాలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1న ముగియాలి.
ప్రత్యక్ష చర్చలు జరపాలి: భారత్
యుద్ధం ఆగాలని ఐరాసలో భారత ప్రతినిధి ఆర్.రవీంద్ర ఆకాంక్షించారు. ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు ప్రారంభించాలని కోరారు. ఆయన సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్‌తో తాము సంప్రదింపులు కొనసాగిస్తామని అన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను అన్ని దేశాలు గౌరవించాలని సూచించారు.
నిండు చూలాలు దుర్మరణం
రష్యా దాడికి ఓ నిండు చూలాలు బలైన వైనం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మారియుపోల్‌లో ఓ ప్రసూతి ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. అంబులెన్సుతో తరలిస్తుండగా నొప్పితో అల్లాడుతున్న వీడియో వైరలైంది. హుటాహుటిన మరో ఆస్పత్రికి తరలించి సిజేరియన్ చేసినా లాభం లేకపోయింది. పాప దక్కదని అర్థమయ్యాక ‘నన్ను చంపేయండి’ అంటూ ఆమె రోదించిన తీరు డాక్టర్లను కూడా కలచివేసింది.
నాతో ఫైటింగ్‌కు రా పుతిన్‌కు ఎలాన్ మస్క్ చాలెంజ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో ద్వంద్వ యుద్ధానికి రావాలని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సవాలు చేశారు. ఉక్రెయిన్‌ను పందెంగా ఒడ్డాలంటూ ట్వీట్ చేశారు. పుతిన్‌కు వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లేకపోవడంతో, తన సవాలుకు రష్యా అధ్యక్షుని అధికారిక అకౌంట్ ద్వారా స్పందించాలని సూచించారు. ‘‘నాతో ఫైటింగ్‌కు ఒప్పుకుంటారా?’’ అని పుతిన్‌ను ప్రశ్నించారు. అందులో పుతిన్, ఉక్రెయిన్ పేర్లను రష్యన్‌లో రాశారు. యుద్ధం వల్ల ఇంటర్నెట్ సేవలకు దూరమైన ఉక్రెయిన్‌కు తన స్టార్‌లింక్ కంపెనీ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని మస్క్ అందజేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment