
నిరసనకారులతో నిండిపోయిన ఎయిర్‌పోర్టు
హాంకాంగ్: నిరసనకారుల సెగ హాంకాంగ్ విమానాశ్రయాన్ని తాకింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆ దేశ పోలీసులకు వ్యతిరేకంగా గళం విప్పారు. నల్లటి దుస్తులు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శించారు. విమానాశ్రయం లోపల ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు జరపడం ఇదే తొలిసారి. నిరసన తెలుపుతోన్న ఓ మహిళపై ఆదివారం పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ వారు ఆందోళన నిర్వహించారు. పోలీసుల దాడిలో రక్తమోడుతున్న మహిళ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడిలో మహిళ కంటిచూపు కోల్పోయిందని వారు ఆరోపించారు.
ఆమెకు మద్దతుగా కంటికి బ్యాండేజీలు కట్టుకుని నిరసన తెలిపారు. హాంకాంగ్ పోలీసులకు మతి భ్రమించిందని, వారు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘హాంకాంగ్ పోలీసులు మమ్మల్ని చంపేస్తున్నారు’, ‘హాంకాంగ్ సురక్షిత స్థలం కాదు’, ‘హాంకాంగ్ ప్రజలారా మేల్కోండి.. భయపడాల్సిన అవసరం లేదు’ అని ఫ్లకార్డులు ప్రదర్శించారు. నల్లటి దుస్తులు ధరించిన వేలాది మంది నిరసనకారులతో విమానాశ్రయ ప్రాంగణ మంతా నలుపు రంగును పులముకున్నట్లు అయింది. నిరసనకారుల దెబ్బకు హాంకాంగ్ నుంచి బయలుదేరాల్సిన, అక్కడికి రావాల్సిన అన్ని విమానాలను రద్దు చేశారు.
నిరసనకారులు ఉగ్రవాదులే: చైనా
పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న హాంకాంగ్ నిరసనకారులపై చైనా మండిపడింది. నిరసనకారుల చర్యలు ఉగ్రవాద చర్యల్లాగే ఉన్నాయని, ఇప్పుడిప్పుడే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోందని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment