న్యూఢిల్లీ: ఇరవై రెండేళ్ల క్రితం పార్లమెంట్‌పై దాడి ఘటనలో అమరులైన భద్రతాబలగాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. బుధవారం పార్లమెంట్ దాడి మృతులకు ఆమె నివాళులర్పించారు. ‘‘ ప్రజాస్వామ్య దేవాలయంపైనే దాడికి తెగబడి అత్యున్నత స్థాయి రాజకీయనేతలను అంతంచేయాలని ఉగ్రవాదులు హేయమైన కుట్రపన్నారు. ఆ కుట్రను భారత భద్రతాబలగాలు వమ్ముచేసి ఆ క్రమంలో ప్రాణత్యాగంచేశాయి. ఆ ధైర్యశాలులకు నా నివాళులు. మాతృభూమి కోసం మీరు చేసిన ప్రాణత్యాగానికి దేశం సదా రుణపడి ఉంటుంది.
ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు సిద్ధమని అందరం ప్రతినబూనుదాం’’ అని సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం ఏ దేశంలో ఏ రూపంలో ఉన్నాసరే దానిని సమూలంగా తుదముట్టించాలని వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, పియూశ్ గోయల్, జితేంద్ర సింగ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో అమరులకు నివాళులర్పించారు. అమరుల త్యాగాన్ని భారత్ సదా స్మరించుకుంటుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు.
త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: ప్రధాని
పార్లమెంట్‌లో అమరులకు బుధవారం ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. ‘‘ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరోచిత భద్రతా సిబ్బందికి నా హృదయపూర్వక నివాళులు. ఆపత్కాలంలో తెగువ చూపిన వారి త్యాగాలను యావత్ దేశం చిరస్థాయిగా గుర్తుంచుకుంటుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. అమరులకు లోక్‌సభ నివాళులర్పించింది. లోక్‌సభ కార్యకలా పాలు బుధవారం మొదలవగానే స్పీకర్ బిర్లా మాట్లాడారు. ‘ ఉగ్రవాదులతో పోరాటంతో ప్రాణాలు కోల్పోయిన భద్రతా బలగాల కుటుంబాలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉగ్రవాదంపై భారత పోరు కొనసాగుతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా సభ్యులంతా లేచి నిల్చుని కొద్దిసేపు మౌనం పాటించారు.
Comments
Please login to add a commentAdd a comment