బాబోయ్‌.. బిచ్చగాళ్లు! | Begging mafia in hyderabad, no plan on governament | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. బిచ్చగాళ్లు!

Published Tue, Dec 25 2018 4:49 AM | Last Updated on Tue, Dec 25 2018 4:49 AM

Begging mafia in hyderabad, no plan on governament - Sakshi

విశ్వనగరం లక్ష్యంలో భాగంగా అధికారులు హైదరాబాద్‌ను ‘బెగ్గర్‌ ఫ్రీ’ నగరంగా మారుస్తామని సంకల్పం చెప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా భాగ్యనగరాన్ని సందర్శించినప్పుడు ఆమె ప్రయాణించే మార్గాలు, మరికొన్ని ముఖ్యకూడళ్లలో యాచకులను నిరోధించి..వారికి పునరావాసంగా చర్లపల్లి జైలుకు తరలించారు. కొన్నాళ్లపాటు నగరవాసులకు వీరి బెడద తగ్గినా..మళ్లీ ఇది యాచకులకు నిజంగా బెగ్గర్‌..‘ఫ్రీ’ నగరంగా మారి వారి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. మళ్లీ ప్రధాన కూడళ్లలో వారు రెచ్చి పోతున్నారు.వీరి ఆగడాలపై ‘సాక్షి’ సోమవారం జరిపిన విజిట్‌లో అనేక ఆసక్తికర అంశాలు కనిపించాయి. ప్రధా నంగా మొజంజాహీ మార్కెట్, లక్డీకాపూల్, సెక్రటేరియట్‌ చౌరస్తా, మెహిదీ పట్నం ప్రాంతాల్లో యాచకుల ఆగడాలు నగరవాసులను అవస్థల పాల్జేస్తున్నాయి. వాటిపై ప్రత్యేక కథనం...      

– సాక్షి, హైదరాబాద్‌
దాడులకూ వెనుకాడని ధోరణి..
 నగరంలో దందా సాగిస్తున్నవారంతా దుర్భర పరిస్థితుల దృష్ట్యా యాచన చేసేవారు కారు. హరియాణా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి నగరానికి కుటుంబ సమేతంగా వచ్చి శివారుల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకొని యాచన పేరిట దందా నడిపేదే వీరిలో అధికులు. వీరిలో పురుషులు ముందుగా రద్దీ కూడళ్లను ఎంపిక చేసుకొని భిక్షాటన కోసం తమవారు ఎవరు ఎక్కడ వెళ్లాలి అనేది నిర్ధారిస్తారు. మహిళలు, మధ్య వయస్కులు కీలక రహదారుల్లో వాహనాలను అడ్డగించి తమకు లేని కృత్రిమ వైకల్యాన్ని చూపి యాచిస్తుంటారు.

కొంతమంది తమ చిన్నారులకు వైట్‌నర్‌ మత్తులో పెట్టి వారిని ఎత్తుకొని దీనంగా డబ్బులు అడుగుతుంటారు. ఒక్కోసారి ఎవరైనా విసుగెత్తి ద్విచక్ర వాహన దారులు వారి చర్యలను వ్యతిరేకిస్తే..వారిని తీవ్ర స్థాయిలో దూషించడమో, పరిస్థితులను బట్టీ తిరగ బడడమో చేస్తుంటారు. తమ చేతులకు కాళ్లకు ఉత్తుత్తి కట్లు, కాలినట్లు ఆయింట్‌మెంట్‌ పూతలు వేసుకొని జుగుప్సాకరంగా వాటిని ప్రదర్శిస్తూ ఇవతల వారిపై ఒత్తిడి తెస్తుంటారు.తమ కట్లు, లేదా దెబ్బలకు రుజువుగా వైద్య చీటీలు కూడా చూపి యాచన చేస్తున్నారు.  ఇలా షాపుల వద్ద, చౌరస్తాల్లో వీరి ఆగడాలు పెరుగుతున్నా  ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది.

ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం..
వీరి కార్యకలాపాలు కూడా రోజంతా ఒకే మాదిరిగా సాగడం లేదు. వీరు వాస్తవానికి ఉదయం పూట వీధుల్లో గృహస్తుల వద్ద యాచన చేపట్టరు. అప్పుడు మనకు కనిపించేది తప్పని స్థితిలో భిక్షాటనను చేపడుతున్న వృద్ధులో, వికలాంగులో కనిపిస్తారు. ముఠా వర్గీయులంతా ఆ సమయంలో కూడళ్ల ఎంపిక ప్రణాళికలో ఉంటారు. వారి పెద్ద నిర్దేశించిన ప్రాంతాలు  నిర్ణయించుకున్నాక ఉదయం 9.30 తర్వాత చేతులకు, కాళ్లకు ఇతరత్రానో మేకప్‌ కట్లు వేసుకొని వృత్తిలోకి దిగుతారు.

ఎవరికి కేటాయించిన అడ్డాల్లో వారు యాచన ప్రారంభిస్తారు. ఇలా మధ్యాహ్నం 2గంటలకు వీరికి బ్రేక్‌ వుంటుంది. సాయంత్రం పూట మరో బృందం మరో తరహాలో మేకప్‌ వేసుకొని రంగంలోకి దిగుతుంది. ఇదీ వీరు సాగిస్తున్న నిత్య దందా. వీరికి అడ్డుకట్ట వేసే పోలీసులు, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఈ యాచక ముఠాల ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నారు.

‘సాక్షి’ని వెంటాడిన ‘గార్డింగ్‌’ ముఠా...
ఈ నయా యాచకుల ఆగడాల దృశ్యాలను ‘సాక్షి’ చిత్రీకరిస్తూ.. వారి బాధ ఏమిటి, దుస్థితి ఏమిటని ఆరా తీసే ప్రయత్నం చేసినప్పుడు మహిళా యాచకులకు దూరంగా ఉంటూ ‘రక్షకుల’ పాత్ర పోషిస్తున్న వారి పురుషులు కట్టెలతో దాడికి యత్నించడం వీరి దుశ్చర్యలకు ఓ ఉదాహరణ. భిక్షాటన చేస్తున్న కుటుంబీకులను ఎవరైనా ఆగ్రహంతో నిరోధించే ప్రయత్నం చేస్తే వారు ఇలాంటి ‘గార్డింగ్‌’ ముఠా చేతుల్లో చావు దెబ్బలు తినాల్సిందే. రోడ్లపై ప్రయాణిస్తున్న వారు కూడా రద్దీ వేళల్లోనో, వారి పనుల ఒత్తిళ్లలోనూ వారితో లేని పోని వివాదాలు ఎందుకని చేతిలో ఉన్నది పడేసి వెళ్లి పోతుంటారు.అలా కాకుండా వారి చర్యలను ప్రశ్నిస్తే..వెంటనే ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న పురుషులు దూకుడుగా కట్టెలతో రంగంలోకి దిగుతుంటారు.

భయానక వాతావరణం సృష్టించి రభస చేస్తారు. ఇక నగరానికి చుట్టూ ఉన్న ఔటర్‌ ప్రాంతంలో కూడా యాచకుల దందా సాగుతోంది. ఈ ముఠాలు కూడా తమ కంటూ కొన్ని అడ్డాలు పెట్టుకొని అందులోకి వేరే వారు రాకుండా ముందే రింగ్‌ అవుతుంటారు. దీన్ని అతిక్రమిస్తే వారిలో వారు పర స్పరం దాడు లకు పాల్పడటం రివాజుగా మారుతోంది. ఇలా ఇటీవల నాంపల్లి రైల్వే స్టేషను పరిధిలో  రెండు యాచక వర్గాల మధ్య జరిగిన దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో ఎవరైనా వారిని నివారించే ప్రయత్నం చేస్తే వారంతా ఏకమై నచ్చజెప్పిన వారిపై దాడులకు దిగుతుంటారు.

నిరోధం.. నిలిచి పోయింది ఎందుకు?
సుమారు ఏడాది కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా నగరంలో పర్యటించినప్పుడు అధికార యంత్రాం గం ప్రతిష్టాత్మకంగా భావించి ఓ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా యాచకులను నిరోధించింది. వారిని  పోలీసులు పట్టుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం జీహెచ్‌ఎంసీ ఉన్నత అధికారులు కూడా బెగ్గింగ్‌ ఫ్రీ సిటీ కోసం కొన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. అయినా నగరంలో వారి సంఖ్య తగ్గలేదు. పునరావాస చర్యలు లేవు. అసలు ఎవరు బాధ్యత తీసుకోవాలి..తీసుకుంటే వారి పునరావాసం ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇందుకోసం ప్రత్యేక నిధులు, బాధ్యతలు లేక పోవడంతో అధికార యంత్రాంగం కూడా తమకెందుకులే అనే నిర్లిప్త ధోరణిలో వ్యవహరిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని పేరుచెప్పడానికి ఇష్టపడని ఓ జీహెచ్‌ఎంసీ అధికారి వెల్లడించారు. తమకు ఒక దిశా నిర్దేశం,  నిర్దిష్ట ప్రణాళిక లేనప్పుడు తాము మాత్రం ఏం చేస్తామని ఎదురు ప్రశ్నించారు. పోలీసులు కూడా వీరిపై చర్యలకు ఉపక్రమిస్తున్నా అది తాత్కాలికమే అవుతోంది. ఒక్కో మారు వారూ యాచకులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఉదంతాలూ ఉన్నాయి. ఈ పరిస్థితులను తక్షణం చక్కదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని నగర వాసులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement