begging mafia
-
కోటీశ్వరుడైన ముంబై బిచ్చగాడు.. మొత్తం ఆస్తి ఎంతో తెలుసా?
హైదరాబాద్: సాధారణంగా చేయి చాచడానికే చాలా అవమానకరంగా భావిస్తూ ఉంటాం అలాంటిది భిక్షాటనను ప్రొఫెషన్ గా ఎంచుకుని అందులో కోటానుకోట్లు ఆర్జిస్తున్నాడు ముంబైకి చెందిన బిచ్చగాడు భరత్ జైన్. ఎటువంటి టాక్స్ మినహాయింపు లేకుండా నెలకు సుమారు రూ.7 కోట్లు సంపాదించే ప్రొఫెషనల్ బిచ్చగాడైన భరత్ జైన్ ఇటీవల రూ.22 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేశాడు. దీంతో అనుమానమొచ్చిన ఐటీ శాఖ ఆయన ఇంటిపై సోదాలు జరపగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ కథనాన్ని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ తన ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చూసినా కాళ్ళు చేతులూ చక్కగా ఉన్నవారు కూడా భిక్షాటన చేస్తూ కనిపిస్తుంటారు. వీరంతా బయట రాష్ట్రాలకు చెందినవారని అందరికీ తెలిసిందే. వీరి వెనుక ఏదైనా బెగ్గింగ్ మాఫియా ఉండి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమీషనర్ సీవీ ఆనంద్ గతంలో సంచలనం సృష్టించిన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు భరత్ జైన్ కథనాన్ని గుర్తుచేశారు. భరత్ జైన్ భిక్షాటనను వృత్తిగా చేసుకుని దేశవ్యాప్తంగా మాఫియాను మించిన ముష్టియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కేవలం భిక్షాటనతోనే 8 విల్లాలు, 18 అత్యాధునిక అపార్ట్మెంట్లు, ఒక విలాసవంతమైన హోటల్, నలుగురు భార్యలతో కలిసి ఆయన నివాసముండటానికి లంకంత బంగ్లాలు రెండు సంపాదించాడు. ఇంతకాలం ఈ దందా గుట్టుగా సాగింది. కానీ ఇటీవల ముంబై విలాసవంతమైన ప్రాంతంలో రూ.22 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేయడంతో ఐటీ శాఖ దృష్టి భరత్ పైన పడింది. ఇక అక్కడి నుండి తీగ లాగితే డొంకంతా కదిలింది. భరత్ జైన్ కేవలం మన దేశంలోనే కాదు ఇండోనేషియా, మలేషియాల్లో కూడా తన ముష్టి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. భరత్ జైన్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ వృత్తిలోకి వచ్చినవాడు కాదు. ఐఐఎం కోల్‌కతాలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన భరత్ అక్కడ ర్యాంక్ హోల్డర్ కూడా. ప్రస్తుతానికైతే ఆతడు స్థాపించిన ఈ ముష్టి సామ్రాజ్యంలో దేశవ్యాప్తంగా 18,000 మంది బిచ్చగాళ్ళు పనిచేస్తున్నారు. భరత్ వద్ద పనిచేసే బిచ్చగాళ్లకు ఒక్కొక్కరికి ధారావిలో ఉండటానికి ఇల్లు మూడు పూటలు భోజన సదుపాయాలు కూడా ఉంటాయట. ఆయన సంస్థలో పనిచేసే బిచ్చగాళ్ళ ఆర్జనలో 20% భరత్ జైన్ ఖాతాలోకి వెళుతుందట. ఇది కూడా చదవండి: బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్ -
రాజేష్ దగ్గర 100 మంది నకిలీ ట్రాన్స్జెండర్లు
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు వెస్ట్‌జోన్ డీసీపీ చందన దీప్తి. వీళ్లంతా బీహార్‌కు చెందిన వాళ్లని, ఇలాంటి వాళ్లు వంద మందిదాకా ఉన్నారని ఆమె తెలిపారు. రాజేష్, అనితలు ఈ ముఠా నాయకులు. రాజేష్ దగ్గర 100 దాకా సభ్యులు ఉన్నారు. వీళ్లంతా పగలంతా ట్రాన్స్జెండర్ల వేషంలో ఉంటూ జనం దగ్గరి నుంచి డబ్బులు గుంజుతుంటారు. సాయంత్రం కాలనీలు, కమర్షియల్ ఏరియాల్లో దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈజీ మనీ కోసమే వాళ్లు ఈ గ్యాంగ్‌ను నడిపిస్తున్నారు అని డీసీపీ చందన దీప్తి తెలిపారు. ఈ ముఠాలో మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారామె. పగలంతా ప్రజలను బెదిరిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు గుంజుతున్న ఈ నకిలీ ట్రాన్స్జెండర్ల గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. సికింద్రాబాద్, ప్యారడైజ్, జూబ్లీహిల్స్ స్టేషన్ ప్రాంతంలో వీళ్లు హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. -
పసిబాల్యంపై యాచక మాఫియా దందా!
బనశంకరి (బెంగళూరు): అనాథ మహిళలు, పేద కుటుంబాల పిల్లలే పెట్టుబడిగా యాచక మాఫియా నగరాల్లో పేట్రేగిపోతున్నది. వీరి ఆర్థిక, సాంఘిక పరిస్థితులను ఆసరా చేసుకున్న కొంతమంది సంఘ విద్రోహశక్తులు వారితో భిక్షాటన చేయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. బెగ్గింగ్ మాఫియా ద్వారా ఏడాదికి దేశవ్యాప్తంగా రూ.260 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయంటేనే.. ఈ అనాగరిక వ్యవస్థ సమాజంలో ఏ మేరకు వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అద్దెకు పేద రాష్ట్రాల పిల్లలు.. కొంతమంది దళారులు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, అసోం, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నిరుపేద కుటుంబాలను కలిసి వారి పిల్లలను రోజువారి, లేదా శాశ్వతంగా కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని నగరాలకు పిలిపించి నెలకు కొద్దిమేర అద్దె ఇచ్చి పసిపిల్లలను తీసుకుంటారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రముఖ నగరాలు, జనసందడి కలిగిన ప్రాంతాలు, జాతర, ఉత్సవాలు, పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో ఈ పిల్లలతో భిక్షాటన చేయిస్తారు. ప్రభుత్వాల పునరావాసం.. భిక్షాటన మాఫియాలో చిక్కుకున్న పిల్లల ఆచూకీని ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు కనిపెట్టి ప్రభుత్వ పరంగా పునర్వసతి కల్పిస్తున్నారు. భిక్షాటన దందాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, పిల్లలను, మహిళలను ఈ దందాలో వినియోగిస్తున్నట్లు తెలిస్తే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. -
బాలిక కిడ్నాప్.. పట్టించిన రూ. 5 భోజనం
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ‘బెగ్గింగ్ మాఫియా’ కోసం చిన్నారిని కిడ్నాప్ చేశాడో ప్రబుద్ధుడు. సికింద్రాబాద్ స్టేషన్లో చిన్నారిని అపహరించి బండిమెట్ వరకు తీసుకెళ్లాడు. నిద్రలేచిన ఆ చిన్నారి ఏడుస్తుండటంతో వదిలేసి పారిపోయాడు. దీనిపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ రాధాకిషన్‌రావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా, గుండ్యాలకు చెందిన రాజు చిన్నతనంనుంచే దురవాట్లకు బానిసయ్యాడు. 2000లో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన అతను కొన్నేళ్ల పాటు బెంగళూరు, చెన్నై, విజయవాడ ప్రాంతాల్లో వంటపని చేశాడు. తిరుమలలోనూ కొన్నాళ్లు పని చేశాడు. అయితే అక్కడ అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని బైండోవర్ చేసి విడిచిపెట్టారు. దీంతో అక్కడ ఉండలేక జూలైలో మళ్లీ స్వస్థలానికి వెళ్లిన రాజు అక్కడ నెల రోజుల పాటు ఉన్నాడు. సెప్టెంబర్‌లో హైదరాబాద్ చేరుకుని కూలీ పని చేస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లపై తలదాచుకునేవాడు. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లాకు చెందిన దండు సురేష్ ఆదివారం తన ఇద్దరు పిల్లలతో కలిసి సరాయ్‌గూడెం నుంచి నగరానికి వచ్చాడు. ఆ రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నెం.10పై పడుకున్నాడు. అదే ప్రాంతంలో ఉన్న రాజు దీన్ని గమనించాడు. తిరుపతిలో చిన్నారులతో భిక్షాటన చేయిస్తే డబ్బు బాగా వస్తుందని భావించిన అతను సురేష్ కుమార్తె స్వర్ణలతను (2.5) కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. సురేష్, అతడి కుమారుడు, స్వర్ణలత నిద్రలో ఉండగా చిన్నారిని భుజాలపై ఎత్తుకుని స్టేషన్ ఆవరణ దాటేశాడు. బండిమెట్ ప్రాంతానికి చేరుకునేసరికి నిద్రలేచిన స్వర్ణలత ఏడవటంతో చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. అర్ధరాత్రి నిద్రలేచిన సురేష్ తన కుమార్తె కనిపించకపోవడంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలో బండిమెట్ వద్ద ఏడుస్తున్న చిన్నారిని గుర్తించిన స్థానికులు మార్కెట్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్ళి బాలికను అక్కున చేర్చుకున్నారు. రైల్వేస్టేషన్ నుంచి కిడ్నాప్ అయినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను తండ్రికి అప్పగించారు. రైల్వే పోలీసుస్టేషన్లో నమోదైన కేసును ఛేదించేందుకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఆధారంగా జర్కిన్ వేసుకున్న ఓ వ్యక్తి చిన్నారిని తీసుకుని ఐదో నంబర్ గేట్ నుంచి బయటికి వెళ్లినట్లు గుర్తించారు. పట్టించిన రూ. 5 భోజనం రైల్వేస్టేషన్‌లోని మరికొన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన నేపథ్యంలోనే అతను గత కొన్ని రోజులుగా అక్కడే నిద్రిస్తున్నట్లు, కొందరు కూలీలతో కలిసి తిరుగుతున్నట్లు తేలింది. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు కొందరు కూలీలను ఆరా తీశారు. వారెవరూ అతడిని రాజును గుర్తించకపోయినా... వరంగల్ నుంచి అప్పుడప్పుడు నగరానికి వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లోనే నిద్రించే ఓ వ్యక్తి అతడిని గుర్తించాడు. స్టేషన్లో ఉంటున్న మరో యువకుడితో కలిసి ఉండగా తాను చూసినట్లు తెలిపాడు. ఆ యువకుడిని గుర్తించిన అధికారులు రాజు ఫొటో చూపించి అతడి వివరాలు ఆరా తీశారు. తనను రెండు మూడుసార్లు కలిశాడని, స్టేషన్ సమీపంలోని రూ.5 భోజన కేంద్రం వద్దే మధ్యాహ్నం భోజనం చేస్తుంటాడని చెప్పాడు. దీంతో టాస్క్‌ఫోర్స్ టీమ్ రెండు రోజుల పాటు అక్కడ నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం భోజనం చేసేందుకు వచ్చిన రాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరం అంగీకరించడంతో తదుపరి చర్యల నిమిత్తం సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారు. -
2,119 మంది చిన్నారుల రెస్క్యూ
సాక్షి, హైదరాబాద్: బాల కార్మికులుగా, బెగ్గింగ్ మాఫియాలో బలిపశువులుగా బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులను రెస్క్యూ చేసేందుకు ప్రారంభించిన ఐదో దఫా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. జనవరి 1న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,119 మంది చిన్నారులను బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ పోలీస్‌తోపాటు మహిళా శిశుసంక్షేమ శాఖ, ఆరోగ్యశాఖ, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా ఆ చిన్నారులను ఫేస్ రికగ్నైజేషన్ టూల్ దర్పన్ ఉపయోగించి తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు తెలిపారు. వీరిలో బాలురు 1,653 మంది, బాలికలు 466 మంది ఉన్నారని పేర్కొన్నారు. 1,303 మంది చిన్నారులను తల్లిదండ్రులు, సంరక్షకులకు అప్పగించగా, 816 మందిని రెస్క్యూ హోంకు తరలించామని వెల్లడించారు. గుర్తించిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 763 మంది ఉన్నారని తెలిపారు. చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్న వారిపై 58 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
బాబోయ్.. బిచ్చగాళ్లు!
విశ్వనగరం లక్ష్యంలో భాగంగా అధికారులు హైదరాబాద్‌ను ‘బెగ్గర్ ఫ్రీ’ నగరంగా మారుస్తామని సంకల్పం చెప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా భాగ్యనగరాన్ని సందర్శించినప్పుడు ఆమె ప్రయాణించే మార్గాలు, మరికొన్ని ముఖ్యకూడళ్లలో యాచకులను నిరోధించి..వారికి పునరావాసంగా చర్లపల్లి జైలుకు తరలించారు. కొన్నాళ్లపాటు నగరవాసులకు వీరి బెడద తగ్గినా..మళ్లీ ఇది యాచకులకు నిజంగా బెగ్గర్..‘ఫ్రీ’ నగరంగా మారి వారి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. మళ్లీ ప్రధాన కూడళ్లలో వారు రెచ్చి పోతున్నారు.వీరి ఆగడాలపై ‘సాక్షి’ సోమవారం జరిపిన విజిట్‌లో అనేక ఆసక్తికర అంశాలు కనిపించాయి. ప్రధా నంగా మొజంజాహీ మార్కెట్, లక్డీకాపూల్, సెక్రటేరియట్ చౌరస్తా, మెహిదీ పట్నం ప్రాంతాల్లో యాచకుల ఆగడాలు నగరవాసులను అవస్థల పాల్జేస్తున్నాయి. వాటిపై ప్రత్యేక కథనం... – సాక్షి, హైదరాబాద్ దాడులకూ వెనుకాడని ధోరణి.. నగరంలో దందా సాగిస్తున్నవారంతా దుర్భర పరిస్థితుల దృష్ట్యా యాచన చేసేవారు కారు. హరియాణా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి నగరానికి కుటుంబ సమేతంగా వచ్చి శివారుల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకొని యాచన పేరిట దందా నడిపేదే వీరిలో అధికులు. వీరిలో పురుషులు ముందుగా రద్దీ కూడళ్లను ఎంపిక చేసుకొని భిక్షాటన కోసం తమవారు ఎవరు ఎక్కడ వెళ్లాలి అనేది నిర్ధారిస్తారు. మహిళలు, మధ్య వయస్కులు కీలక రహదారుల్లో వాహనాలను అడ్డగించి తమకు లేని కృత్రిమ వైకల్యాన్ని చూపి యాచిస్తుంటారు. కొంతమంది తమ చిన్నారులకు వైట్నర్ మత్తులో పెట్టి వారిని ఎత్తుకొని దీనంగా డబ్బులు అడుగుతుంటారు. ఒక్కోసారి ఎవరైనా విసుగెత్తి ద్విచక్ర వాహన దారులు వారి చర్యలను వ్యతిరేకిస్తే..వారిని తీవ్ర స్థాయిలో దూషించడమో, పరిస్థితులను బట్టీ తిరగ బడడమో చేస్తుంటారు. తమ చేతులకు కాళ్లకు ఉత్తుత్తి కట్లు, కాలినట్లు ఆయింట్మెంట్ పూతలు వేసుకొని జుగుప్సాకరంగా వాటిని ప్రదర్శిస్తూ ఇవతల వారిపై ఒత్తిడి తెస్తుంటారు.తమ కట్లు, లేదా దెబ్బలకు రుజువుగా వైద్య చీటీలు కూడా చూపి యాచన చేస్తున్నారు. ఇలా షాపుల వద్ద, చౌరస్తాల్లో వీరి ఆగడాలు పెరుగుతున్నా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం.. వీరి కార్యకలాపాలు కూడా రోజంతా ఒకే మాదిరిగా సాగడం లేదు. వీరు వాస్తవానికి ఉదయం పూట వీధుల్లో గృహస్తుల వద్ద యాచన చేపట్టరు. అప్పుడు మనకు కనిపించేది తప్పని స్థితిలో భిక్షాటనను చేపడుతున్న వృద్ధులో, వికలాంగులో కనిపిస్తారు. ముఠా వర్గీయులంతా ఆ సమయంలో కూడళ్ల ఎంపిక ప్రణాళికలో ఉంటారు. వారి పెద్ద నిర్దేశించిన ప్రాంతాలు నిర్ణయించుకున్నాక ఉదయం 9.30 తర్వాత చేతులకు, కాళ్లకు ఇతరత్రానో మేకప్ కట్లు వేసుకొని వృత్తిలోకి దిగుతారు. ఎవరికి కేటాయించిన అడ్డాల్లో వారు యాచన ప్రారంభిస్తారు. ఇలా మధ్యాహ్నం 2గంటలకు వీరికి బ్రేక్ వుంటుంది. సాయంత్రం పూట మరో బృందం మరో తరహాలో మేకప్ వేసుకొని రంగంలోకి దిగుతుంది. ఇదీ వీరు సాగిస్తున్న నిత్య దందా. వీరికి అడ్డుకట్ట వేసే పోలీసులు, జీహెచ్ఎంసీ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఈ యాచక ముఠాల ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నారు. ‘సాక్షి’ని వెంటాడిన ‘గార్డింగ్’ ముఠా... ఈ నయా యాచకుల ఆగడాల దృశ్యాలను ‘సాక్షి’ చిత్రీకరిస్తూ.. వారి బాధ ఏమిటి, దుస్థితి ఏమిటని ఆరా తీసే ప్రయత్నం చేసినప్పుడు మహిళా యాచకులకు దూరంగా ఉంటూ ‘రక్షకుల’ పాత్ర పోషిస్తున్న వారి పురుషులు కట్టెలతో దాడికి యత్నించడం వీరి దుశ్చర్యలకు ఓ ఉదాహరణ. భిక్షాటన చేస్తున్న కుటుంబీకులను ఎవరైనా ఆగ్రహంతో నిరోధించే ప్రయత్నం చేస్తే వారు ఇలాంటి ‘గార్డింగ్’ ముఠా చేతుల్లో చావు దెబ్బలు తినాల్సిందే. రోడ్లపై ప్రయాణిస్తున్న వారు కూడా రద్దీ వేళల్లోనో, వారి పనుల ఒత్తిళ్లలోనూ వారితో లేని పోని వివాదాలు ఎందుకని చేతిలో ఉన్నది పడేసి వెళ్లి పోతుంటారు.అలా కాకుండా వారి చర్యలను ప్రశ్నిస్తే..వెంటనే ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న పురుషులు దూకుడుగా కట్టెలతో రంగంలోకి దిగుతుంటారు. భయానక వాతావరణం సృష్టించి రభస చేస్తారు. ఇక నగరానికి చుట్టూ ఉన్న ఔటర్ ప్రాంతంలో కూడా యాచకుల దందా సాగుతోంది. ఈ ముఠాలు కూడా తమ కంటూ కొన్ని అడ్డాలు పెట్టుకొని అందులోకి వేరే వారు రాకుండా ముందే రింగ్ అవుతుంటారు. దీన్ని అతిక్రమిస్తే వారిలో వారు పర స్పరం దాడు లకు పాల్పడటం రివాజుగా మారుతోంది. ఇలా ఇటీవల నాంపల్లి రైల్వే స్టేషను పరిధిలో రెండు యాచక వర్గాల మధ్య జరిగిన దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో ఎవరైనా వారిని నివారించే ప్రయత్నం చేస్తే వారంతా ఏకమై నచ్చజెప్పిన వారిపై దాడులకు దిగుతుంటారు. నిరోధం.. నిలిచి పోయింది ఎందుకు? సుమారు ఏడాది కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా నగరంలో పర్యటించినప్పుడు అధికార యంత్రాం గం ప్రతిష్టాత్మకంగా భావించి ఓ ప్రత్యేక డ్రైవ్ ద్వారా యాచకులను నిరోధించింది. వారిని పోలీసులు పట్టుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు కూడా బెగ్గింగ్ ఫ్రీ సిటీ కోసం కొన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. అయినా నగరంలో వారి సంఖ్య తగ్గలేదు. పునరావాస చర్యలు లేవు. అసలు ఎవరు బాధ్యత తీసుకోవాలి..తీసుకుంటే వారి పునరావాసం ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక నిధులు, బాధ్యతలు లేక పోవడంతో అధికార యంత్రాంగం కూడా తమకెందుకులే అనే నిర్లిప్త ధోరణిలో వ్యవహరిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని పేరుచెప్పడానికి ఇష్టపడని ఓ జీహెచ్ఎంసీ అధికారి వెల్లడించారు. తమకు ఒక దిశా నిర్దేశం, నిర్దిష్ట ప్రణాళిక లేనప్పుడు తాము మాత్రం ఏం చేస్తామని ఎదురు ప్రశ్నించారు. పోలీసులు కూడా వీరిపై చర్యలకు ఉపక్రమిస్తున్నా అది తాత్కాలికమే అవుతోంది. ఒక్కో మారు వారూ యాచకులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఉదంతాలూ ఉన్నాయి. ఈ పరిస్థితులను తక్షణం చక్కదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని నగర వాసులు కోరుతున్నారు. -
దారుణం : నాయక్ సినిమా తరహా ఘటన
సాక్షి, బళ్లారి : కొన్నేళ్ల క్రితం రామ్‌చరణ్ నటించిన నాయక్ సినిమా చూశారా? అందులో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి, వికలాంగులుగా మార్చి బిక్షాటన చేయిస్తూ ఉంటారు. సరిగ్గా అదే తరహా ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. అభం శుఖం తెలియని చిన్నారులను, అపహరించిన చిన్నారుల నాలుకలు కత్తరించి మాటలు రాకుండా చేసి భిక్షాటన చేసేందుకు ఉపయోగిస్తున్న ముగ్గురు మానవ అక్రమ రవాణాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కలబురిగిలో శుక్రవారం వెలుగు చూసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన చిన్నారులను కలబురిగికి తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈనెల 8న అధికారులు పోలీసులు తనిఖీలు చేపట్టారు. భిక్షాటన చేస్తున్న ఐదు మంది చిన్నారులను గుర్తించి స్థానిక ఆస్పత్రికి తరలించగా చిన్నారుల నాలుకలను కత్తరించినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. పగలంతా భిక్షాటన చేయగా వచ్చిన సొమ్మును రవాణాదారులకు అందజేసినా కడుపునిండా అన్నం కూడా పెట్టడం లేదని విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చిన్నారులను అపహరించి తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్న రూబీ, రైయిసా బేగం, ఫరీదాలను కలబుర్గిలోని అరెస్ట్ చేశారు. -
అయ్యో పాపం..!
చీరాల: చంకలో పసిబిడ్డ.. చేతికో కాలికో రక్తగాయాలు ఉన్నట్లు కట్లు.. అత్యంత దీన స్థితిలో ఉన్నట్టు భ్రమింపజేసే నటన.. రద్దీగా ఉండే కూడళ్లలో యాచన. ఇది నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ వంటి నగరాల్లో ముష్టి మాఫియా ముఠాలు సాగించే దందా. ఇప్పుడు ఇది చిన్న చిన్న పట్టణాలకూ పాకింది. పసి బిడ్డలను అడ్డుపెట్టుకుని సాగించే యాచక వృత్తి అధికమవుతోంది. పసి బిడ్డలను అద్దెకు తీసుకుని చీరాలకు చెందిన కొందరు మహిళలు బిక్షాటన సాగిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటుగా తెలంగాణ ప్రాంతాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చే పేద మహిళలను, అలానే స్థానికంగా కొన్ని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి చిత్తుకాగితాలు ఏరుకుని జీవనం సాగించే కుటుంబాలను కొందరు టార్గెట్ చేస్తున్నారు. పేదల బిడ్డలకు రోజుకు రూ.150 చెల్లించి అద్దెకు తీసుకుంటున్నారు. ఆ పసిపిల్లలను చంకలో పెట్టుకుని చీరాల, ఒంగోలు పట్టణాలతో పాటుగా, రైళ్లు, బస్టాండ్, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో యాచక వృత్తి సాగిస్తున్నారు. ముఖ్యంగా చీరాల పట్టణంలో ఇలాంటి సంఘటనలు అధికంగా ఉన్నాయి. వలస కూలీలు అధికంగా ఉండటానికి తోడు రవాణా సౌకర్యాలు కూడా అనుకూలంగా ఉండటంతో ఇటువంటి నీచ వ్యాపారానికి చీరాల అడ్డాగా మారింది. చీరాల ప్రాంతం నుంచి రోజుకు సుమారు 70 మంది వరకు చిన్నారులను అద్దెకు తీసుకుని యాచక వృత్తి చేస్తున్న ముఠా ఉంది. చినబొంబాయిగా పేరుగాంచిన చీరాలకు ఆంధ్ర, తెలంగాణా, రాజస్థాన్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు నివాసం ఉంటారు. వీరిలో తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారు అధికంగా పట్టణంలోని విజిలిపేట, రైల్వేగూడ్స్ షెడ్, సెయింటాన్స్ స్కూల్ సమీపం, పట్టణ శివారు కాలనీల్లో నివసిస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వీరిలో కొంత మంది వివిధ వ్యాపార సముదాయాల్లో కూలీ పనులు చేసుకుంటుండగా కొందరు మాత్రం తమ పిల్లలను చిత్తు కాగితాలు ఏరిపించడం, చిన్నపిల్లలను అడుక్కోవడానికి రోజుకు అద్దెకు ఇస్తున్నారు. పసి పిల్లలు రోజంతా ఏడవకుండా ఉండేందుకు వారికి మత్తుమందులు ఇచ్చి చంకలో పెట్టుకుంటారు. 8 నుంచి 12 ఏళ్ల వయస్సు వారిని మాత్రం చేతులు, కాళ్లు విరిగినట్లుగా చిత్రీకరించి యాచకవృత్తి చేయిస్తున్నారు. చీరాల పరిసర ప్రాంతాలతో పాటుగా ఒంగోలు పట్టణానికి ప్రతి రోజు రైళ్లు ద్వారా 70 మంది వరకు తమ సొంత పిల్లలు లాగా చిన్నారులను చంకన పెట్టుకుని యాచకవృత్తి సాగిస్తున్నారు. పసిబిడ్డకు రోజుకు రూ.150 అద్దె ఇచ్చి యాచకం చేస్తు వారు మాత్రం వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో ఈ తరహా తంతు కొనసాగుతుంది. చీరాల కేంద్రంగా అద్దె పిల్లలతో యాచక వృత్తిని గుర్తించాం..: జిల్లాలో అధికంగా పసిబిడ్డలను అద్దెకు తీసుకుని యాచక వృత్తి చేయిస్తున్నారు. గతంలోనే వీరిని గుర్తించాం. ప్రధానంగా చీరాలకు ఇతర ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీలు వారి అవసరాల కోసం చంటి పిల్లలను అద్దెకు ఇస్తున్నారు. ఇది లాభసాటి వ్యాపారం కావడంతో చీరాల్లో చాలామంది వ్యక్తులు రోజుకు రూ.150 చెల్లించి వారి పిల్లలను అడ్డుపెట్టుకుని యాచక వృత్తి చేస్తున్నారు. ఇప్పటికే తాము కౌన్సిలింగ్‌తో పాటు పలువురు చిన్నారులను చైల్డ్‌హోంకు తరలించాం. జిల్లాలోని చీరాల్లోనే ఈ తంతు ఎక్కువగా జరగడం బాధాకరం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం.- బీవీ సాగర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి, ఒంగోలు. -
బెగ్గింగ్ మాఫియాపై చర్యలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో విజృంభిస్తున్న బెగ్గింగ్ మాఫియాపై శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బాలల హక్కుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలను భిక్షగాళ్ల మాఫియా నుంచి రక్షించి పునరావాసం కల్పించాలని ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఆమోదించిన మానవ హక్కుల కమిషన్.. ఏప్రిల్ 11లోగా బెగ్గింగ్ మాఫియాపై తగిన చర్యలు చేపట్టి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
బెగ్గింగ్ మాఫియా
-
బెగ్గింగ్ మాఫియా
బాబ్బాబ్బాబు.. చేతులు చాస్తూ ఓ ముదుసలి! అమ్మా.. అయ్యా.. ఒక్క రూపాయి.. చుట్టూరా తిరుగుతూ ఓ కుర్రాడు..! చంటిదానికి తిండి లేదయ్యా.. చంకన పిల్లతో దీనంగా ఓ మహిళ!! ..భాగ్యనగరంలో ఏ కూడలి వద్ద చూసినా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. కానీ ఇలా అడుక్కునేవారిలో చాలామంది ‘నకిలీ’లే అన్న సంగతి మీకు తెలుసా? వీరిని ముందుంచి బిచ్చం పేరుతో బిజినెస్ చేస్తున్న మాఫియా గురించి విన్నారా? ఈ బెగ్గింగ్ మాఫియా టర్నోవర్ ఏటా ఏకంగా రూ.100 కోట్లపైనే ఉందంటే నమ్ముతారా? నమ్మలేని ఈ వాస్తవాలే కాదు.. వీరిలో కాస్తా ఒడ్డూపొడుగు ఉన్న యువకులను సెటిల్మెంట్లు, దందాలకు వాడుకుంటున్న ఫైనాన్షియర్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బెగ్గర్స్ ఫ్రీ ఫెడరేషన్ సర్వే ఈ సంచలన అంశాలను వెల్లడించింది. చివరికి బిచ్చమెత్తుకునే మహిళల చేతుల్లో కనిపిస్తున్న పసిపాపలూ వారి పిల్లలు కాదని తేలింది. అందుకు సాక్ష్యమే ఈ చిత్రం. ఈ మహిళ ఒడిలో కనిపిస్తున్న చిన్నారితో ఈమెకు ఎలాంటి సంబంధం లేదు. ‘ఈ చిన్నారి మీ పాపేనా? ఏం పేరు? ఎందుకు పడుకుంది’ అని సాక్షి ఆమెను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. చివరికి చిన్నారి తమ పాప కాదని, ఉదయం 7 గంటలకు బెగ్గర్ లీడర్ పాపను తెచ్చిస్తాడని, సాయంత్రం మళ్లీ తీసుకెళ్తాడని చెప్పింది. పాపకు ఆకలి లేకుండా నిద్రమత్తులోనే ఉండేందుకు చిన్న డ్రాప్స్ బాటిల్ ఇస్తారని తెలిపింది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బెగ్గింగ్ మాఫియా విజృంభిస్తోంది. అవసరాల్లో ఉన్నవారిని, ఆపదల్లో ఉన్నవారిని పట్టుకొచ్చి యాచక ‘కూలీ’లుగా మార్చుతోంది. కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి.. తీర్చేందుకు భిక్షాటన చేయిస్తోంది. రోజూ ఇంత ‘వసూలు’ చేయాలంటూ టార్గెట్లు పెడుతూ వచ్చిన దాంట్లో ఎంతోకొంత చేతిలో పెడుతోంది. టార్గెట్ మేరకు డబ్బులు తేకపోతే హింసిస్తోంది. హైదరా బాద్ లో సుమారు 14 వేల మంది యాచకులున్నారని.. అందులో 90 శాతం ఇలాంటి నకిలీ బెగ్గర్లేనని ‘ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఫర్ బెగ్గర్‌ఫ్రీ సొసైటీ’సర్వే లో వెల్లడైంది. ఏ దిక్కూ లేకనో, కుటుంబాన్ని పోషించుకునేందుకో అడుక్కునేవారు నాలుగైదు వందల మందే ఉంటారని గుర్తించింది. ఇక యాచకులుగా ‘పని’చేస్తున్నవారిని బెగ్గింగ్ మాఫియా అసాంఘిక కార్యకలాపాలకూ వినియోగిస్తోందని... ‘సుపారీ’ దాడుల దగ్గరి నుంచి గంజాయి, డ్రగ్స్ విక్రయించడం దాకా చాలా పనులకు వినియోగిస్తోందని తేలింది. 14 వేల మందికిపైనే.. హైదరాబాద్‌లోని కూడళ్లు, పార్కులు, థియేటర్లు, దుకాణాల సముదాయాలు ఇలా ఎక్కడ చూసినా యాచకులు కనిపిస్తుంటారు. ఇలాంటివారి సంఖ్య 14 వేలకుపైనే. కానీ ఇందులో నిజమైన యాచకులు నాలుగైదు వందల మంది మాత్రమే. మిగతా వారంతా బెగ్గింగ్ మాఫియాలో ‘రోజు కూలీలు’. బెగ్గింగ్ ముఠాను నిర్వహించేవారి దగ్గర వీరంతా ‘పని’చేస్తారు. వారికి అప్పగించిన ప్రాంతాన్ని బట్టి రోజూ రూ. 400 నుంచి రూ.600 వరకు ‘వసూలు’చేస్తారు. ముఠా లీడర్లు ఆ సొమ్మును తీసుకుని.. రోజూ రూ.100 నుంచి రూ.200 వరకు యాచకులకు ఇస్తారు. ఈ ‘వసూళ్ల’టార్గెట్లు, ‘కూలీ’మొత్తం కూడా ఒక్కో కూడలికి, పార్కులు, బస్టాండ్లను బట్టి మారుతుంది. మొత్తంగా బెగ్గింగ్ మాఫియాకు హైదరాబాద్‌వ్యాప్తంగా ఏటా రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు ‘చిల్లర’ సమకూరుతోందని స్వచ్ఛంద సంస్థల ఫెడరేషన్ సర్వే లో వెల్లడైంది. సుమారు 10 వేల మంది యాచకులు రోజూ రూ.400 చొప్పున వసూలుచేసి ఇస్తున్నారని.. అంటే రోజూ రూ.40 లక్షలకుపైగా మాఫియాకు ఆదాయం వస్తోందని తమ అధ్యయనంలో గుర్తించింది. వీరిది అవసరం.. వారిది వ్యాపారం ఈ ఫెడరేషన్‌కు చెందిన 300 మంది ప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకేసారి విస్తృతంగా సర్వే నిర్వహించారు. అసలు యాచకులు ఎంతమంది, వారిలో ఎన్ని రకాల వారున్నారు, ఎందుకు భిక్షాటన చేస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు, ఏ మేరకు దందా సాగుతోందన్న అంశాలను పరిశీలించారు. మూడు రకాల యాచకులు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. ఏ దిక్కూ లేనివారు.. మానసిక స్థితి సరిగా లేకపోవడం, ఆరోగ్యం దెబ్బతిని ఏ పనీ చేయలేకపోవడం వంటి దుస్థితిలో ఉన్నవారు మొదటి రకం యాచకులు. తమ వారెవరూ లేకపోవడం లేదా కుటుంబాలు ఉన్నా వీరిని పట్టించుకోకపోవడంతో భిక్షమెత్తుతున్నారు. ఇలాంటి వారిని శిబిరానికి తరలించి సహాయం చేయాల్సి ఉంటుందని స్వచ్ఛంద సంస్థల ఫెడరేషన్ గుర్తించింది. అవసరానికి యాచించేవారు కుటుంబంలో వివాదాలు, వ్యవసాయం, వ్యాపారంలో తీవ్ర నష్టాల పాలై గతిలేని స్థితిలో భిక్షాటన చేస్తున్నవారు రెండో రకం. వీరికి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. తిరిగి సాధారణ జీవితం గడపగలరని ఫెడరేషన్ తేల్చింది. భిక్షాటనే వ్యాపారంగా.. కుటుంబం, ఆస్తులు అన్నీ ఉన్నా.. భిక్షాటననే వ్యాపారంగా మలుచుకునేవారు మూడోరకం. వీరు కష్టపడకుండా డబ్బు సంపాదించేందుకు బెగ్గింగ్ మాఫియాగా అవతరించారు. ముఠాలు ఏర్పాటు చేసి భిక్షాటన చేయించడం, ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారం చేయడంతో పాటు గంజాయి/డ్రగ్స్ విక్రయించడం, ఫైనాన్స్ సంస్థలకు సెటిల్మెంట్లు చేసిపెట్టడం వంటివీ వీరు చేస్తున్నట్లు గుర్తించారు. పసిపిల్లలకు ‘నరక’యాచన! అన్నెం పున్నెం ఎరుగని పసి పిల్లలను బెగ్గింగ్ మాఫియా నరక యాతనకు గురి చేస్తోంది. చిన్న పిల్లలు ఉంటే ఎక్కువగా భిక్షమేస్తారన్న ఉద్దేశంతో రెండేళ్లలోపు చిన్నారులను దీనికి వినియోగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌కు వలస వచ్చే నిరుపేద కుటుంబాలకు వల వేసి వారి పిల్లలను భిక్షాటన కోసం వినియోగించుకుంటున్నారు. రోజుకు రూ.100 నుంచి రూ.150 చొప్పున ఇస్తున్నారు. ఇలా రెండు మూడు వందల మంది చిన్నారులను తీసుకువచ్చి.. మహిళా యాచకులకు అప్పగించి, భిక్షాటన చేయిస్తున్నారు. ♦ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, థియేటర్లు, దేవాలయాలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరిగే ప్రాంతాలకు ఈ మహిళా యాచకులను పంపుతున్నారు. ♦ పిల్లలు ఏడవకుండా, ఏడెనిమిది గంటల పాటు నిద్రలోనే ఉండేలా వారికి నల్లమందు చుక్కలు వేస్తున్నారు. మహిళా యాచకులు ఆ పిల్లలను చూపుతూ అడుగుతుండడంతో.. చాలా మంది డబ్బులు వేస్తుంటారు. ♦ కొందరు బెగ్గింగ్ లీడర్లు చిన్నారులు నిద్రలోనే ఉండేలా రెండు, మూడు గంటలకోసారి ప్రమాదకరమైన డ్రగ్స్ వేస్తున్నట్టు స్వచ్ఛంద సంస్థలు గుర్తించాయి. ఆ డ్రగ్స్ వల్ల చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల అస్తవ్యస్తమవుతుందని నిర్ధారించాయి. ముఖ్యంగా ఆడపిల్లలు పది పన్నెండేళ్లలోపే రజస్వల కావడం, శారీరకంగా ఇబ్బందులు వంటివి తలెత్తుతాయని గుర్తించారు. అప్పులిచ్చి.. భిక్షాటన చేయించి.. బెగ్గింగ్ మాఫియా లీడర్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు కొంత సొమ్మును అప్పుగా ఇస్తున్నారు. ఆ అప్పు తీర్చేందుకు ‘యాచక కూలీ’లుగా పెట్టుకుంటున్నారు. తర్వాత అప్పు తీర్చాలని ఒత్తిడి చేస్తూ ఆ కుటుంబాల్లోని మహిళలను, ఆడపిల్లలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లుగా జీహెచ్ఎంసీకి ఇచ్చిన సర్వేనివేదికలో స్వచ్ఛంద సంస్థల ఫెడరేషన్ పేర్కొంది. ♦ హైదరాబాద్‌లో భిక్షాటన చేస్తున్న సుమారు 14 వేల మందిలో కేవలం నాలుగైదు వందల మంది మాత్రమే మొదటి, రెండో రకం యాచకులు కాగా.. మిగతా వారంతా నకిలీ యాచకులేనని గుర్తించారు. ♦ బెగ్గింగ్ మాఫియా లీడర్లు, ఫైనాన్షియర్ల వేధింపులు, ఒత్తిళ్లతో చాలా మంది యాచకులుగా మారుతున్నారని తేల్చారు. ‘భిక్షం’ కోసం దుకాణాలతో ఒప్పందాలు! సికింద్రాబాద్ జనరల్ బజార్లో జరిగిన వ్యవహారం.. బెగ్గింగ్ మాఫియా విశ్వరూపానికి ఓ మచ్చుతునక. కొద్దినెలల కింద ఇక్కడ యాచకులంతా కలసి దుకాణాల వద్ద చేరి యాచిస్తూ, ఇవ్వకపోతే గొడవపడుతూ హంగామా సృష్టించారు. దీంతో బెగ్గింగ్ మాఫియాకు, దుకాణాల యజమానులకు ‘ఒప్పందం’కుదిరింది. సోమవారం కొన్ని దుకాణాలు, మంగళవారం కొన్ని దుకాణాలు.. ఒక్కో దుకాణం వారు ఒక్కో రోజు భిక్షం ‘వేసేలా’ఒప్పందాలు చేసుకున్నారు. ఆ రోజు రూ.5 నుంచి రూ.10 వరకు భిక్షంగా ఇవ్వాల్సిందే! బెగ్గింగ్ మాఫియా టర్నోవర్ భారీగా పెరగడానికి ఇలాంటి ఒప్పందాలూ కారణమే. ఇంట్లోకి వెళ్లాలంటే.. అడుక్కోవాల్సిందే..! గురువారం ఉదయం 8 గంటలు.. హైదరాబాద్ శివారులోని సుచిత్ర చౌరస్తాలో ఓ 55 ఏళ్ల వ్యక్తి భిక్షాటన చేస్తున్నాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆయన దగ్గరికి వెళ్లి.. తమ ఆశ్రమానికి తీసుకెళ్తాం రమ్మని అడిగారు. కానీ రానని, రావడం తనకిష్టం లేదని వాదించాడు. ఎందుకు రావని సంస్థ ప్రతినిధులు పదే పదే అడగడంతో.. తన బాధను వెల్లగక్కాడు. తాను ఒకప్పుడు హెచ్ఎంటీ సంస్థలో పనిచేసేవాడినని, సొంత ఇల్లు, కొడుకు, కోడలు అంతా ఉన్నారని చెప్పాడు. తాను డబ్బులు తీసుకెళితేగానీ వారు ఇంట్లోకి రానివ్వరని, తిండి పెట్టరని ఆవేదన వ్యక్తం చేశాడు. రోజూ యాచిస్తే నాలుగైదు వందల వరకు వస్తాయని.. ఆ సొమ్మంతా బెగ్గర్స్ లీడర్ తీసుకుని తనకు రూ.100 ఇస్తాడని.. ఈ సొమ్ము తీసుకెళ్లి ఇంట్లో ఇస్తానని చెప్పాడు. మేమే బాధ్యత తీసుకుంటాం హైదరాబాద్‌లో నిజమైన యాచకులు 400 మంది వరకు మాత్రమే ఉంటారు. ఉపాధి చూపిస్తే కొంతమంది సెటిలవుతారు. మిగతా వారిని మా స్వచ్ఛంద సంస్థలో పెట్టి బాగుచేస్తాం. 60 వారాల పాటు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులతో కలసి బెగ్గింగ్ నిర్మూలనకు పనిచేశాం. కానీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఫలితం రాలేదు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేకంగా బెగ్గర్ రిహాబిలిటేషన్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలి. జీహెచ్ఎంసీ, పోలీసు, జైలు అధికారులు, మీడియా, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి నకిలీ యాచకులను ఏరివేయవచ్చు. ప్రస్తుతం నకిలీ బెగ్గర్లు డ్రగ్స్, గంజాయి వంటివి విక్రయించే స్థాయికి వెళ్లారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే.. సహకరించడానికి 100కుపైగా ఎన్జీవోలు సిద్ధంగా ఉన్నాయి.. - ఫెడరేషన్ ఆఫ్ బెగ్గర్‌ఫ్రీ సొసైటీ ప్రతినిధి శంకర్‌నారాయణ్ అప్పుల వసూళ్లు.. సెటిల్మెంట్ దందాలు.. గతేడాది హైదరాబాద్‌లోని బండ్లగూడ ప్రాంతంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు చితకబాదారు. కాలు, చెయ్యి విరిచి వెళ్లిపోయారు. విచారణలో ఆ పనికి పాల్పడింది బెగ్గింగ్ మాఫియా అని తేలింది. అప్పు తీసుకుని ఎగ్గొట్టినందుకు ఓ ఫైనాన్షియర్ ఇలా యాచకులతో కొట్టించినట్లుగా గుర్తించారు. ♦ ఇక రాజేంద్రనగర్‌లో ఏడాది కింద ఓ అపార్ట్మెంట్ ఖాళీ చేసే విషయంలో యజమానికి, అద్దెకున్నవారికి వివాదం తలెత్తింది. దాంతో యజమాని యాచకులకు రూ.వెయ్యి రూపాయలు ఇచ్చి.. అద్దెకుండేవారిపై దాడి చేయించాడు. ♦ ఇలా బెగ్గింగ్ మాఫియా లీడర్లు డబ్బు తీసుకుని తమ వద్ద ఉన్న యాచకులతో ఇలా దందాలు చేస్తున్నట్లుగా స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖల పరిశీలనలో వెల్లడైంది. ఫైనాన్షియర్లు, చిట్టీల నిర్వాహకులైతే బెగ్గింగ్ మాఫియాను సెటిల్మెంట్ల కోసం, దాడుల కోసం వాడుకుంటున్నట్టు తేలింది. ♦ ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యాచిస్తున్న వారిని ఇలాంటి పనులకు వినియోగించుకుంటున్నట్లు గుర్తించారు. (నకిలీ భిక్షగాళ్ల గురించి అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసులు ) -
బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు..
హైదరాబాద్ : నగరంలో భారీగా విస్తరించిన బెగ్గింగ్ మాఫియా గుట్టును పోలీసులు రట్టుచేశారు. నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేసిన మాఫియాపై చైల్డ్ రైట్ కమిషన్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు బుధవారం ఉదయం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో మాఫియా ఆధీనంలో పెద్ద సంఖ్యలో వృద్ధులు, మైనర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నగరంలో పలు ప్రధాన కూడళ్లలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాఫియా టీమ్ వీరిచే బెగ్గింగ్ చేయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ బిక్షాటన ద్వారా ప్రతి రోజు వచ్చిన డబ్బులో కొంత మొత్తం వీరికి ఇస్తూ.. మిగతా సొమ్మును మాఫియా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.