హైదరాబాద్: సాధారణంగా చేయి చాచడానికే చాలా అవమానకరంగా భావిస్తూ ఉంటాం అలాంటిది భిక్షాటనను ప్రొఫెషన్ గా ఎంచుకుని అందులో కోటానుకోట్లు ఆర్జిస్తున్నాడు ముంబైకి చెందిన బిచ్చగాడు భరత్ జైన్. ఎటువంటి టాక్స్ మినహాయింపు లేకుండా నెలకు సుమారు రూ.7 కోట్లు సంపాదించే ప్రొఫెషనల్ బిచ్చగాడైన భరత్ జైన్ ఇటీవల రూ.22 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేశాడు. దీంతో అనుమానమొచ్చిన ఐటీ శాఖ ఆయన ఇంటిపై సోదాలు జరపగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ కథనాన్ని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ తన ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
హైదరాబాద్ నగరంలో ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చూసినా కాళ్ళు చేతులూ చక్కగా ఉన్నవారు కూడా భిక్షాటన చేస్తూ కనిపిస్తుంటారు. వీరంతా బయట రాష్ట్రాలకు చెందినవారని అందరికీ తెలిసిందే. వీరి వెనుక ఏదైనా బెగ్గింగ్ మాఫియా ఉండి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమీషనర్ సీవీ ఆనంద్ గతంలో సంచలనం సృష్టించిన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు భరత్ జైన్ కథనాన్ని గుర్తుచేశారు.
భరత్ జైన్ భిక్షాటనను వృత్తిగా చేసుకుని దేశవ్యాప్తంగా మాఫియాను మించిన ముష్టియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కేవలం భిక్షాటనతోనే 8 విల్లాలు, 18 అత్యాధునిక అపార్ట్మెంట్లు, ఒక విలాసవంతమైన హోటల్, నలుగురు భార్యలతో కలిసి ఆయన నివాసముండటానికి లంకంత బంగ్లాలు రెండు సంపాదించాడు.
ఇంతకాలం ఈ దందా గుట్టుగా సాగింది. కానీ ఇటీవల ముంబై విలాసవంతమైన ప్రాంతంలో రూ.22 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేయడంతో ఐటీ శాఖ దృష్టి భరత్ పైన పడింది. ఇక అక్కడి నుండి తీగ లాగితే డొంకంతా కదిలింది. భరత్ జైన్ కేవలం మన దేశంలోనే కాదు ఇండోనేషియా, మలేషియాల్లో కూడా తన ముష్టి సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
భరత్ జైన్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ వృత్తిలోకి వచ్చినవాడు కాదు. ఐఐఎం కోల్కతాలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన భరత్ అక్కడ ర్యాంక్ హోల్డర్ కూడా. ప్రస్తుతానికైతే ఆతడు స్థాపించిన ఈ ముష్టి సామ్రాజ్యంలో దేశవ్యాప్తంగా 18,000 మంది బిచ్చగాళ్ళు పనిచేస్తున్నారు. భరత్ వద్ద పనిచేసే బిచ్చగాళ్లకు ఒక్కొక్కరికి ధారావిలో ఉండటానికి ఇల్లు మూడు పూటలు భోజన సదుపాయాలు కూడా ఉంటాయట. ఆయన సంస్థలో పనిచేసే బిచ్చగాళ్ళ ఆర్జనలో 20% భరత్ జైన్ ఖాతాలోకి వెళుతుందట.
ఇది కూడా చదవండి: బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్
Comments
Please login to add a commentAdd a comment