బాలిక కిడ్నాప్‌.. పట్టించిన రూ. 5 భోజనం | Girl Child Kidnapped Secunderabad Railway Station | Sakshi
Sakshi News home page

‘బెగ్గింగ్‌ మాఫియా’ కోసం బాలిక కిడ్నాప్‌.!

Published Sat, Oct 19 2019 8:11 AM | Last Updated on Sat, Oct 19 2019 8:11 AM

Girl Child Kidnapped Secunderabad Railway Station - Sakshi

నిందితుడు రాజు

సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ‘బెగ్గింగ్‌ మాఫియా’ కోసం చిన్నారిని కిడ్నాప్‌ చేశాడో ప్రబుద్ధుడు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో చిన్నారిని అపహరించి బండిమెట్‌ వరకు తీసుకెళ్లాడు. నిద్రలేచిన ఆ చిన్నారి ఏడుస్తుండటంతో వదిలేసి పారిపోయాడు. దీనిపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ  రాధాకిషన్‌రావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా,  గుండ్యాలకు చెందిన రాజు చిన్నతనంనుంచే దురవాట్లకు బానిసయ్యాడు. 2000లో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన అతను కొన్నేళ్ల పాటు బెంగళూరు, చెన్నై, విజయవాడ ప్రాంతాల్లో వంటపని చేశాడు. తిరుమలలోనూ కొన్నాళ్లు పని చేశాడు. అయితే అక్కడ అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని బైండోవర్‌ చేసి విడిచిపెట్టారు. దీంతో అక్కడ ఉండలేక జూలైలో మళ్లీ స్వస్థలానికి వెళ్లిన రాజు అక్కడ నెల రోజుల పాటు ఉన్నాడు. సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ చేరుకుని కూలీ పని చేస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లపై తలదాచుకునేవాడు.

ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లాకు చెందిన దండు సురేష్‌ ఆదివారం తన ఇద్దరు పిల్లలతో కలిసి సరాయ్‌గూడెం నుంచి నగరానికి వచ్చాడు. ఆ రాత్రి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ నెం.10పై పడుకున్నాడు. అదే ప్రాంతంలో ఉన్న రాజు దీన్ని గమనించాడు. తిరుపతిలో చిన్నారులతో భిక్షాటన చేయిస్తే డబ్బు బాగా వస్తుందని భావించిన అతను సురేష్‌ కుమార్తె స్వర్ణలతను (2.5) కిడ్నాప్‌ చేయాలని పథకం వేశాడు. సురేష్, అతడి కుమారుడు, స్వర్ణలత నిద్రలో ఉండగా చిన్నారిని భుజాలపై ఎత్తుకుని స్టేషన్‌ ఆవరణ దాటేశాడు. బండిమెట్‌ ప్రాంతానికి చేరుకునేసరికి నిద్రలేచిన స్వర్ణలత ఏడవటంతో చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. అర్ధరాత్రి నిద్రలేచిన సురేష్‌ తన కుమార్తె కనిపించకపోవడంతో సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలో బండిమెట్‌ వద్ద ఏడుస్తున్న చిన్నారిని గుర్తించిన స్థానికులు మార్కెట్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్ళి బాలికను అక్కున చేర్చుకున్నారు. రైల్వేస్టేషన్‌ నుంచి కిడ్నాప్‌ అయినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను తండ్రికి అప్పగించారు. రైల్వే పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును ఛేదించేందుకు నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఆధారంగా జర్కిన్‌ వేసుకున్న ఓ వ్యక్తి చిన్నారిని తీసుకుని ఐదో నంబర్‌ గేట్‌ నుంచి బయటికి వెళ్లినట్లు గుర్తించారు.  

పట్టించిన రూ. 5 భోజనం
రైల్వేస్టేషన్‌లోని మరికొన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన నేపథ్యంలోనే అతను గత కొన్ని రోజులుగా అక్కడే నిద్రిస్తున్నట్లు, కొందరు కూలీలతో కలిసి తిరుగుతున్నట్లు తేలింది. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన  పోలీసులు కొందరు కూలీలను ఆరా తీశారు. వారెవరూ అతడిని రాజును గుర్తించకపోయినా... వరంగల్‌ నుంచి అప్పుడప్పుడు నగరానికి వచ్చి సికింద్రాబాద్‌ స్టేషన్‌లోనే నిద్రించే ఓ వ్యక్తి అతడిని గుర్తించాడు. స్టేషన్‌లో ఉంటున్న మరో యువకుడితో కలిసి ఉండగా తాను చూసినట్లు తెలిపాడు. ఆ యువకుడిని గుర్తించిన అధికారులు రాజు ఫొటో చూపించి అతడి వివరాలు ఆరా తీశారు. తనను రెండు మూడుసార్లు కలిశాడని, స్టేషన్‌ సమీపంలోని రూ.5 భోజన కేంద్రం వద్దే మధ్యాహ్నం భోజనం చేస్తుంటాడని చెప్పాడు. దీంతో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ రెండు రోజుల పాటు అక్కడ నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం భోజనం చేసేందుకు వచ్చిన రాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరం అంగీకరించడంతో తదుపరి చర్యల నిమిత్తం సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement