girl child missing
-
రైలులో ప్రయాణిస్తున్న బాలిక అదృశ్యం
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): రైలులో ప్రయాణిస్తున్న బాలిక అదృశ్యమైనట్లు విశాఖపట్నం గవర్నమెంట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, లోచర్ల గ్రామ నివాసి చింతా మురళి కుమార్తె చింతా సాయి(16) నూజివీడు ఐఐఐటీలో ప్రథమ సంవత్సరం చదువుతుంది. మంగళవారం కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదని(పచ్చకామెర్లని) వెంటనే వచ్చి తీసుకెళ్లాలని సమాచారం అందించారు. దీంతో పాపను తీసుకొచ్చేందుకు మురళి నూజివీడు వెళ్లి మంగళవారం మధ్యాహ్నం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో కుమార్తెతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. రైలు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విశాఖ చేరుకుంది. ఆ సమయంలో సాయి టాయ్‌లెట్‌కు వెళ్లింది. కాసేపటికి రైలు బయల్దేరింది. అయినప్పటికీ పాప ఎంతకీ రాకపోవడంతో విజయనగరంలో దిగి, మళ్లీ వెనక్కు వచ్చిన మురళి విశాఖ రైల్వేస్టేషన్లో గల జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐ ఆదేశాలతో ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక కిడ్నాప్.. పట్టించిన రూ. 5 భోజనం
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ‘బెగ్గింగ్ మాఫియా’ కోసం చిన్నారిని కిడ్నాప్ చేశాడో ప్రబుద్ధుడు. సికింద్రాబాద్ స్టేషన్లో చిన్నారిని అపహరించి బండిమెట్ వరకు తీసుకెళ్లాడు. నిద్రలేచిన ఆ చిన్నారి ఏడుస్తుండటంతో వదిలేసి పారిపోయాడు. దీనిపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ రాధాకిషన్‌రావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా, గుండ్యాలకు చెందిన రాజు చిన్నతనంనుంచే దురవాట్లకు బానిసయ్యాడు. 2000లో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన అతను కొన్నేళ్ల పాటు బెంగళూరు, చెన్నై, విజయవాడ ప్రాంతాల్లో వంటపని చేశాడు. తిరుమలలోనూ కొన్నాళ్లు పని చేశాడు. అయితే అక్కడ అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని బైండోవర్ చేసి విడిచిపెట్టారు. దీంతో అక్కడ ఉండలేక జూలైలో మళ్లీ స్వస్థలానికి వెళ్లిన రాజు అక్కడ నెల రోజుల పాటు ఉన్నాడు. సెప్టెంబర్‌లో హైదరాబాద్ చేరుకుని కూలీ పని చేస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లపై తలదాచుకునేవాడు. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లాకు చెందిన దండు సురేష్ ఆదివారం తన ఇద్దరు పిల్లలతో కలిసి సరాయ్‌గూడెం నుంచి నగరానికి వచ్చాడు. ఆ రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నెం.10పై పడుకున్నాడు. అదే ప్రాంతంలో ఉన్న రాజు దీన్ని గమనించాడు. తిరుపతిలో చిన్నారులతో భిక్షాటన చేయిస్తే డబ్బు బాగా వస్తుందని భావించిన అతను సురేష్ కుమార్తె స్వర్ణలతను (2.5) కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. సురేష్, అతడి కుమారుడు, స్వర్ణలత నిద్రలో ఉండగా చిన్నారిని భుజాలపై ఎత్తుకుని స్టేషన్ ఆవరణ దాటేశాడు. బండిమెట్ ప్రాంతానికి చేరుకునేసరికి నిద్రలేచిన స్వర్ణలత ఏడవటంతో చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. అర్ధరాత్రి నిద్రలేచిన సురేష్ తన కుమార్తె కనిపించకపోవడంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలో బండిమెట్ వద్ద ఏడుస్తున్న చిన్నారిని గుర్తించిన స్థానికులు మార్కెట్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్ళి బాలికను అక్కున చేర్చుకున్నారు. రైల్వేస్టేషన్ నుంచి కిడ్నాప్ అయినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను తండ్రికి అప్పగించారు. రైల్వే పోలీసుస్టేషన్లో నమోదైన కేసును ఛేదించేందుకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఆధారంగా జర్కిన్ వేసుకున్న ఓ వ్యక్తి చిన్నారిని తీసుకుని ఐదో నంబర్ గేట్ నుంచి బయటికి వెళ్లినట్లు గుర్తించారు. పట్టించిన రూ. 5 భోజనం రైల్వేస్టేషన్‌లోని మరికొన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన నేపథ్యంలోనే అతను గత కొన్ని రోజులుగా అక్కడే నిద్రిస్తున్నట్లు, కొందరు కూలీలతో కలిసి తిరుగుతున్నట్లు తేలింది. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు కొందరు కూలీలను ఆరా తీశారు. వారెవరూ అతడిని రాజును గుర్తించకపోయినా... వరంగల్ నుంచి అప్పుడప్పుడు నగరానికి వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లోనే నిద్రించే ఓ వ్యక్తి అతడిని గుర్తించాడు. స్టేషన్లో ఉంటున్న మరో యువకుడితో కలిసి ఉండగా తాను చూసినట్లు తెలిపాడు. ఆ యువకుడిని గుర్తించిన అధికారులు రాజు ఫొటో చూపించి అతడి వివరాలు ఆరా తీశారు. తనను రెండు మూడుసార్లు కలిశాడని, స్టేషన్ సమీపంలోని రూ.5 భోజన కేంద్రం వద్దే మధ్యాహ్నం భోజనం చేస్తుంటాడని చెప్పాడు. దీంతో టాస్క్‌ఫోర్స్ టీమ్ రెండు రోజుల పాటు అక్కడ నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం భోజనం చేసేందుకు వచ్చిన రాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరం అంగీకరించడంతో తదుపరి చర్యల నిమిత్తం సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారు. -
హమ్మయ్య.. చిన్నారి ఇంటికి చేరుకుంది
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి 8 ఏళ్ల చిన్నారి అదృశ్యం కాగా ఆమె కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి 6 గంటల పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను జల్లెడపట్టారు. తీరా ఆ చిన్నారి తన సహచర చిన్నారులతో ఆడుకొని అలిసిపోయి సమీపంలోని ఓ గుడిసెలో పడుకొని ఆదివారం తెల్లవారుజామున తీరిగ్గా ఇంటికి చేరుకుంది. పోలీసుల కంటిమీద ఆరు గంటల పాటు కునుకులేకుండా చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో ఓ ఖాళీప్లాట్లో చెన్నైకి చెందిన పార్వతి, సూదన్ దంపతులు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. వీరికి మైథిలి 8 సంవత్సరాల కూతురు ఉంది. 15 రోజుల క్రితమే ఈ దంపతులు ఇక్కడికి పొట్టచేతబట్టుకొని వచ్చి స్థిరపడ్డారు. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వీరి కూతురు మైథిలి ఆడుకుంటూ సమీపంలోని ఓ గుడిసెలోకి వెళ్లింది. అక్కడున్న చిన్నారులతో ఆడుకొని కునుకురావడంతో బయటే ఇసుకపై పడుకుంది. అర్ధరాత్రి దాటినా కూతురు జాడ కనిపించకపోయేసరికి అప్పటికే వెతుకుతున్న తల్లిదండ్రులు రాత్రి 12 గంటలకు చిన్నారి కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆందోళన చెందిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడ్డారు. డీఐ రమేష్‌తో పాటు ఎస్ఐలు సుధీర్‌రెడ్డి, శివశంకర్, యాదగిరిరావు తదితరులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి బంజారాహిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలతో పాటు రహదారుల పక్కన గాలింపు చేపట్టారు. రెండు పెట్రోకార్లు, మూడు బ్లూకోట్స్ వాహనాలు ఈ ప్రాంతాలన్నీ జల్లెడపట్టాయి. 6 గంటల పాటు గాలించినా పోలీసులకు చిన్నారి ఆచూకీ చిక్కలేదు. అక్కడే ఉన్న సీసీ ఫూటేజీలను పరిశీలించగా చిన్నారి జాడ అందులో కనిపించలేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా ఓ బాలుడు తాను ఆ చిన్నారి వెళ్తుండగా చూశానని ఫిలింనగర్వైపు చూపించాడు. ఆ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో కూడా పోలీసులు గాలించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం 7 గంటలకు మైథిలి ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. అప్పటికి తల్లిదండ్రులు ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తూనే ఉన్నారు. చిన్నారి వచ్చిన విషయాన్ని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీయగా రాత్రి ఆడుకుంటూ కొద్ది దూరంలో ఉన్న ఓ గుడిసె బయట పడుకున్నానని చెప్పింది. -
చిన్నారి అపహరణ
చిత్తూరు, యాదమరి : మండల కేంద్రం యాదమరి బస్టాప్‌లో రెండున్నరేళ్ల చిన్నారి ఆదివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. ఈ వార్త తెలియగానే పోలీసులు హుటాహుటిన వచ్చి చుట్టుపక్కల పరిశీలించారు. బస్టాప్‌లోని మిఠా యి దుకాణంలోని సీసీ çఫుటేజీలను పరిశీలిస్తునారు. తండ్రిపై అనుమానంతో ఆయన్ను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని రసూల్‌నగర్‌కు చెందిన ఖాదర్ కుమార్తె గుల్జారీబేగంకు మూడున్నరేళ్ల కిందట తమిళనాడులోని ధర్మపురికి చెందిన ముబారక్‌తో పెళ్లయింది. వారు ప్రస్తుతం యాదమరిలో ఉంటున్నారు. వారికి రెండున్నరేళ్ల చిన్నారి రుజ్వానా ఉంది. ఆదివారం మధ్యాహ్నం తల్లి బహిర్భూమికి వెళుతూ.. పాపను చూసుకోమని భర్తకు చెప్పింది. ఆమె తిరిగి వచ్చేసరికి పాప కనిపించలేదు. భార్యాభర్తలిద్దరూ చుట్టుపక్కల వెతికి, కన్పించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలం తమిళనాడు సరిహద్దులో ఉండడంతో పోలీసులు తమిళనాడులోని పరదరామి పోలీసులకు, ఆంధ్రాలోని బంగారుపాళ్యం, తవణంపల్లె, చిత్తూరు, గుడిపాల పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. చుట్టుపక్కల వెతికినా కన్పించకపోవడంతో చిత్తూరు వెస్ట్ సీఐ ఆదినారాయణకు సమాచారమిచ్చారు. అనంతరం చిన్నారి తల్లిదండ్రులను విచారించారు. తల్లిని విచారించగా, ఆమె భర్తపైనే అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సమస్యల కారణంగా తమిళనాడు నుంచి ఆంధ్రాకు.. తమిళనాడులోని ధర్మపురిలో నిత్యం అత్తమామలతో గొడవలుగా ఉండడంతో గుల్జారీబే గం, ఆమె భర్త ముబారక్ రసూల్‌నగర్‌కు వచ్చేశా రు. అక్కడా సమస్యలు రావడంతో రెండేళ్ల నుంచి యాదమరిలో బాడుగకు ఇల్లు తీసుకుని, నిత్యం సాంబ్రాణి ధూపం వేయగా వచ్చే సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. ఏడాదిగా భర్త తమిళనాడుకు వెళ్లిపోదామని భార్యతో గొడవ పడుతున్నాడు. అయితే ఆమె రానని చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముబారక్ కుమార్తె రుజ్వానాను అతని తల్లిదండ్రుల వద్దకు పంపేసినట్లు అనుమానంగా ఉందని గుల్జారీబేగం చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. త్వరలో పాప ఆచూకీ పట్టుకుంటాం.. భార్యాభర్తల గొడవల్లో భర్తే చిన్నారిని తమిళనాడులోని తన తల్లిదండ్రుల వద్దకు పంపినట్లు అనుమానంగా ఉందని సీఐ ఆదినారాయణ తెలిపారు. అతన్ని విచారిస్తున్నామని, బస్టాప్‌లో మిఠాయి దుకాణంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించినపుడు చిన్నారిని తండ్రి ముందే తీసుకెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు. మరింత లోతుగా పరిశీలించి త్వరలో పాప ఆచూకీ కనుకొంటామన్నారు. ఆయన వెంట యాదమరి, తవణంపల్లె ఎస్సైలు మనోహర్, ఉమామహేశ్వరరావు ఉన్నారు. -
నిద్రిస్తున్న చిన్నారి అర్ధరాత్రి అదృశ్యం
నకరికల్లు (గుంటూరు): మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల వయసున్న పాప ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో అదృశ్యం అయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జూపల్లి మరియమ్మకు మేల్కువ రాగా, చూసేసరికి కుమార్తె ప్రసన్నకుమారి కన్పించలేదు. దీంతో రాంబాబు, మరియమ్మ దంపతులు సోమవారం ఉదయం చుట్టుపక్కల, తెలిసిన వారు, బంధువుల దగ్గర విచారించారు. ఫలితం లేకపోవడంతో ఎవరో ఎత్తుకుపోయి ఉంటారని భావించి సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.