చిన్నారి అపహరణ | Girl Child Kidnapped In Chittoor | Sakshi
Sakshi News home page

చిన్నారి అపహరణ

Published Mon, Sep 3 2018 9:49 AM | Last Updated on Mon, Sep 3 2018 9:49 AM

Girl Child Kidnapped In Chittoor - Sakshi

బస్టాప్‌ వద్ద సీఐ ఆదినారాయణ (ఇన్‌సెట్‌లో) చిన్నారి రుజ్వానా(పైల్‌), సీసీ ఫుటేజీలో.. చిన్నారిని తీసుకెళుతున్న మహిళ

చిత్తూరు, యాదమరి : మండల కేంద్రం యాదమరి బస్టాప్‌లో రెండున్నరేళ్ల చిన్నారి ఆదివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. ఈ వార్త తెలియగానే పోలీసులు హుటాహుటిన వచ్చి చుట్టుపక్కల పరిశీలించారు. బస్టాప్‌లోని మిఠా యి దుకాణంలోని సీసీ çఫుటేజీలను పరిశీలిస్తునారు. తండ్రిపై అనుమానంతో ఆయన్ను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని రసూల్‌నగర్‌కు చెందిన ఖాదర్‌ కుమార్తె గుల్జారీబేగంకు మూడున్నరేళ్ల కిందట తమిళనాడులోని ధర్మపురికి  చెందిన ముబారక్‌తో పెళ్లయింది. వారు ప్రస్తుతం యాదమరిలో ఉంటున్నారు. వారికి రెండున్నరేళ్ల చిన్నారి రుజ్వానా ఉంది. ఆదివారం మధ్యాహ్నం తల్లి బహిర్భూమికి వెళుతూ.. పాపను చూసుకోమని భర్తకు చెప్పింది. ఆమె తిరిగి వచ్చేసరికి పాప కనిపించలేదు. భార్యాభర్తలిద్దరూ చుట్టుపక్కల వెతికి, కన్పించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలం తమిళనాడు సరిహద్దులో ఉండడంతో పోలీసులు తమిళనాడులోని పరదరామి  పోలీసులకు, ఆంధ్రాలోని బంగారుపాళ్యం, తవణంపల్లె, చిత్తూరు, గుడిపాల పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. చుట్టుపక్కల వెతికినా కన్పించకపోవడంతో చిత్తూరు వెస్ట్‌ సీఐ ఆదినారాయణకు సమాచారమిచ్చారు. అనంతరం చిన్నారి తల్లిదండ్రులను విచారించారు. తల్లిని విచారించగా, ఆమె భర్తపైనే అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

సమస్యల కారణంగా తమిళనాడు నుంచి ఆంధ్రాకు..
తమిళనాడులోని ధర్మపురిలో నిత్యం అత్తమామలతో గొడవలుగా ఉండడంతో గుల్జారీబే గం, ఆమె భర్త ముబారక్‌ రసూల్‌నగర్‌కు వచ్చేశా రు. అక్కడా సమస్యలు రావడంతో రెండేళ్ల నుంచి యాదమరిలో బాడుగకు ఇల్లు తీసుకుని, నిత్యం సాంబ్రాణి ధూపం వేయగా వచ్చే సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. ఏడాదిగా భర్త తమిళనాడుకు వెళ్లిపోదామని భార్యతో గొడవ పడుతున్నాడు. అయితే ఆమె రానని చెబుతున్నట్లు సమాచారం.  ఈ క్రమంలో ముబారక్‌ కుమార్తె రుజ్వానాను అతని తల్లిదండ్రుల వద్దకు పంపేసినట్లు అనుమానంగా ఉందని గుల్జారీబేగం చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు.

త్వరలో పాప ఆచూకీ పట్టుకుంటాం..
భార్యాభర్తల గొడవల్లో భర్తే  చిన్నారిని తమిళనాడులోని తన తల్లిదండ్రుల వద్దకు పంపినట్లు అనుమానంగా ఉందని సీఐ ఆదినారాయణ తెలిపారు. అతన్ని విచారిస్తున్నామని, బస్టాప్‌లో మిఠాయి దుకాణంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించినపుడు చిన్నారిని తండ్రి ముందే తీసుకెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు. మరింత లోతుగా పరిశీలించి త్వరలో పాప ఆచూకీ కనుకొంటామన్నారు. ఆయన వెంట యాదమరి, తవణంపల్లె ఎస్సైలు మనోహర్, ఉమామహేశ్వరరావు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement