చిన్నారి మైథిలి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి 8 ఏళ్ల చిన్నారి అదృశ్యం కాగా ఆమె కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి 6 గంటల పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను జల్లెడపట్టారు. తీరా ఆ చిన్నారి తన సహచర చిన్నారులతో ఆడుకొని అలిసిపోయి సమీపంలోని ఓ గుడిసెలో పడుకొని ఆదివారం తెల్లవారుజామున తీరిగ్గా ఇంటికి చేరుకుంది. పోలీసుల కంటిమీద ఆరు గంటల పాటు కునుకులేకుండా చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో ఓ ఖాళీప్లాట్‌లో చెన్నైకి చెందిన పార్వతి, సూదన్ దంపతులు వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. వీరికి మైథిలి 8 సంవత్సరాల కూతురు ఉంది. 15 రోజుల క్రితమే ఈ దంపతులు ఇక్కడికి పొట్టచేతబట్టుకొని వచ్చి స్థిరపడ్డారు. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వీరి కూతురు మైథిలి ఆడుకుంటూ సమీపంలోని ఓ గుడిసెలోకి వెళ్లింది. అక్కడున్న చిన్నారులతో ఆడుకొని కునుకురావడంతో బయటే ఇసుకపై పడుకుంది.
అర్ధరాత్రి దాటినా కూతురు జాడ కనిపించకపోయేసరికి అప్పటికే వెతుకుతున్న తల్లిదండ్రులు రాత్రి 12 గంటలకు చిన్నారి కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆందోళన చెందిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడ్డారు. డీఐ రమేష్‌తో పాటు ఎస్‌ఐలు సుధీర్‌రెడ్డి, శివశంకర్, యాదగిరిరావు తదితరులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి బంజారాహిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలతో పాటు రహదారుల పక్కన గాలింపు చేపట్టారు. రెండు పెట్రోకార్లు, మూడు బ్లూకోట్స్ వాహనాలు ఈ ప్రాంతాలన్నీ జల్లెడపట్టాయి. 6 గంటల పాటు గాలించినా పోలీసులకు చిన్నారి ఆచూకీ చిక్కలేదు. అక్కడే ఉన్న సీసీ ఫూటేజీలను పరిశీలించగా చిన్నారి జాడ అందులో కనిపించలేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా ఓ బాలుడు తాను ఆ చిన్నారి వెళ్తుండగా చూశానని ఫిలింనగర్‌వైపు చూపించాడు. ఆ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో కూడా పోలీసులు గాలించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం 7 గంటలకు మైథిలి ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. అప్పటికి తల్లిదండ్రులు ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తూనే ఉన్నారు. చిన్నారి వచ్చిన విషయాన్ని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీయగా రాత్రి ఆడుకుంటూ కొద్ది దూరంలో ఉన్న ఓ గుడిసె బయట పడుకున్నానని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment