హయత్‌నగర్: కుమార్తెకు ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రిని నమ్మించి బి ఫార్మసీ చదువుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసిన కేసు నాలుగు రోజులు గడుస్తున్నా కొలిక్కి రాలేదు. కేసును చేధించేందుకు ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలో గురువారం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిందితునికోసం గాలిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజాలు, జాతీయ రహదారి టోల్ గేట్ల వద్ద సీసీ కెమొరాల పుటేజీలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించనట్లు సమాచారం. నిందితుడి కారు పెద్దంబర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్ పైకి ఎక్కి తుక్కుగూడ వద్ద కిందకి దిగిందని అక్కడి నుంచి కర్నూలు వైపు వెళ్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిందితుడు బళ్లారిలో కార్ల దొంగతనానికి పాల్పడే వాడని, అతడిపై పలు కేసులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా నిందితుడిని విజయవాడలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు నిందితుడు ఇతడేనని ఓ ఫొటో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ఈ కేసు విషయమై వివరాలు వెల్లడించేందుకు పోలీసులు అందుబాటులోకి రాలేదు. శనివారం దీనిపై వారు స్పందించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment