Beggar Free City
-
బిక్షాటన రహిత భారత్‌గా..! ఇక ఆ నగరాల్లో బిచ్చగాళ్లు ఉండరు!
నగరాల్లోనూ ట్రాఫిక్ల వద్ద బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. అందులోనూ చారిత్రక ప్రదేశాల వద్ద, ఆలయాల వద్ద మరి ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకంటే ఆయా ప్రదేశాల్లో మనుషుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బిచ్చగాళ్లకు కూడా యాచించడం ఈజీ అవుతుంది. దివ్యాంగులు, అనాథలుగా అవ్వడం, వృద్ధాప్యం తదితర కారణాలతో ఈ యాచక వృత్తిలోకి వస్తుంటారు. ఐతే దీని వెనుక పెద్ద మాఫియా కూడా ఉంది. ఇలా రోజంతా యాచించిన సొమ్మును తీసుకు రాకపోతే వాళ్లను చిత్రహింసలు పెట్టే ముఠా కూడా ఉన్నారు. వారి సమస్యలకు చెక్‌పెట్టేలా కేంద్రం ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే గాక బిచ్చగాళ్లు లేని దేశంగా మార్చనుంది. ఎలా చేస్తున్నారు? ఈ కార్యచరణ ముఖ్యోద్దేశం తదితరాల విశేషాలేంటో చూద్దామా! కేంద్రం బిచ్చగాళ్ల డేటాపై ఓ నివేదక రూపొందించింది. ముందుగా యాచకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాను సర్వే చేయించింది. ఆ తర్వాత దీనికి చెక్‌పెట్టేలా భారత్‌ను యాచక రహితంగా మార్చే ప్రణాళికతో ముందుకొచ్చింది. అందులో భాగంగా కీలక 30 నగరాలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఉత్తరాదిలో అయోధ్య నుంచి తూర్పున గువహటి.. పశ్చిమాన త్రయంబకేశ్వరం నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకూ 30 నగరాల్లో భిక్షాటన చేస్తున్నవారు ముఖ్యంగా మహిళలు, పిల్లల గురించి సర్వే చేయించి, వారందరికి పనరావసం కల్పించనున్నట్లు ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ఈ నగరాల్లోని హాట్స్పాట్లు గుర్తించి 2022 నాటికి బిచ్చగాళ్ల రహిత నగరాలుగా మార్చడమే ధ్యేయంగా కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ పెట్టుకుంది. అందుకోసం సదరు జిల్లా మున్సిపల్ అధికారులు తోడ్పాటు అందించాలని పేర్కొంది ప్రభుత్వం. అంతేగాదు వచ్చే రెండేళ్ల మరిన్ని నగరాలు ఈ జాబితాలోకి చేరే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇలా మతపరమైన , చారిత్రక లేదా పర్యాట ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో స్వయం ఉపాధి పథకం అమలు చేసి, వాటికింద వారికి జీవనోపాధి కల్పించనుంది. అంతేగాదు 'భిక్షా-వృత్తి ముక్త్ భారత్' (భిక్షాటన రహిత భారతదేశం) లక్ష్యాన్ని చేరుకునేలా పూర్తి స్థాయిలో సర్వే చేయించి ఆయా నగరాల్లోనే వారందరికీ పునరావసం కల్పించనుంది. ఈ కార్యక్రమ మార్గదర్శకాల ప్రకారం బిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి రియల్‌టైమ్ అప్డేషన్ అయ్యేలా ఫిబ్రవరి నాటికల్లా జాతీయ పోర్టల్, మొబైల్ యాప్‌ని ప్రారంభించనుంది. అలాగే సర్వే, పునరావాసం కోసం ఎంపిక చేసిన నగరాల్లో కూడా అధికారులు మొబైల్ యాప్‌లో షెల్టర్లు, నైపుణ్యాలు, విద్య, పునరావాసాలు తదితర పురోగతి నివేదికను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ బిచ్చగాళ్లకు పునరావసం కల్పించనున్న 10 మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాల్లో అయోధ్య, కాంగ్రా, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, సోమనాథ్, పావగఢ్, త్రయంబకేశ్వర్, బోధగయ, గౌహతి మధురై తదితరాలు ఉన్నాయి. అలాగే పర్యాటక ప్రదేశాలలో విజయవాడ, కెవాడియా, శ్రీ నగర్, నంసాయి, కుషినగర్, సాంచి, ఖజురహో, జైసల్మేర్, తిరువనంతపురం,పుదుచ్చేరి ఉండగా, అమృత్సర్, ఉదయ్‌పూర్, వరంగల్, కటక్, ఇండోర్, కోజికోడ్, మైసూరు, పంచకుల, సిమ్లా, తేజ్‌పూర్ వంటివి చారిత్రక నగరాల జాబితాలో ఉన్నాయి. ఈ బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించడంలో నగర పాలక సంస్థ తోపాటు సంబంధిత మతపరమైన ట్రస్ట్ లేదా పుణ్యక్షేత్రం బోర్డు కూడా పాలుపంచుకుంటుంది. ఇక ఎంపిక చేసిన ఈ 30 నగరాల్లో దాదాపు 25 సిటీలు కార్యాచరణ ప్రణాళిక అందుకోగా..కాంగ్రా, కటక్, ఉదయ్‌పూర్, కుషినగర్ వంటి నగరాల అనుమతి కోసం వేచి ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ ప్రాంతంలో భిక్షాటన చేసే వ్యక్తులు ఎవరూ లేరని, అందువల్ల వేరే నగరాన్ని పరిగణించాలని సాంచి అధికారులు కేంద్రానికి తెలియజేశారు. కోజికోడ్, విజయవాడ, మదురై, మైసూరులో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ కార్యచరణ అమలు చేస్తున్న సదరు జిల్లా మున్సిపల్ అధికారుల కోసం కేంద్ర సామాజిక సాధికారికత మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఎంపిక చేసిన నగరాల రోడ్ మ్యాప్‌లో సర్వే, సమీకరణ, రెస్క్యూ, నివాసం, విద్య ద్వారా సమగ్ర పునరావాసం, నైపుణ్యం అభివృద్ధి, ఉపాధి ద్వారా జనజీవన స్రవంతితో ఏకీకరణ చేయడం, సమగ్ర పునరావాసం తదితరాలు ఉన్నాయి. (చదవండి: ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించిన టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తున్నారో తెలుసా!) -
హైదరాబాద్‌లో నరక ‘యాచన’.. ప్లాన్ రెడీ చేసిన అధికార యంత్రాంగం
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో చిన్నారుల యాచనపై ఉక్కుపాదం మోపేందుకు అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో కూడిన సంచార వాహనాన్ని రంగంలోకి దింపనుంది. ప్రధాన కూడళ్లలో భిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించింది. త్వరలో సంచార వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏడాదికి రెండు పర్యాయాలు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం తాజాగా నిరంతర ప్రక్రియగా సంచార వాహనంతో ప్రత్యేక కార్యాచరణకు దిగుతోంది. గత కొనేళ్లుగా హైదరాబాద్‌ను ‘బెగ్గర్ ఫ్రీ’గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు మూణ్నాళ్ల ముచ్చటగా తయారయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా భాగ్యనగరాన్ని సందర్శించినప్పుడు చేపట్టిన చర్యలతో కొన్నాళ్లపాటు వీరి బెడద తగ్గినా.. మళ్లీ యాచకులకు.. ‘ఫ్రీ’ నగరంగా తయారైంది. దీంతో నగంరలోని ప్రధాన కూడళ్లలో చిన్నారులతో, పసి పిల్లలను చంకన పెట్టుకొని యాచకులు వాహనదారులను అవస్థలకు గురి చేయడం సర్వసాధారణంగా మారింది. విజృంభిస్తోన్న బెగ్గర్ మాఫియా నగరంలో బెగ్గింగ్ మాఫియా విజృంభిస్తోంది. అవసరాల్లో ఉన్నవారి, ఆపదల్లో ఉన్నవారి కుటుంబాల చిన్నారులను పట్టుకొచ్చి యాచన చేయిస్తోంది. కుటుంబాలకు కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి.. తీర్చేందుకు వారి పిల్లలతో భిక్షాటన చేయిస్తోంది. రోజూ ఇంత ‘వసూలు’ చేయాలంటూ టార్గెట్లు పెడుతూ వచ్చిన దాంట్లో ఎంతోకొంత చేతిలో పెట్టడం, టార్గెట్ మేరకు డబ్బులు తేకపోతే హింసించడం షరామామూలుగా మారింది. నరక ‘యాచన’ అభం శుభం తెలియని పసి పిల్లలను బెగ్గింగ్ మాఫియా నరక యాతనకు గురి చేస్తోంది. పసి పిల్లలు ఉంటే ఎక్కువగా భిక్షమేస్తారన్న ఉద్దేశంతో రెండేళ్లలోపు చిన్నారులను వినియోగిస్తోంది. ముఖ్యంగా నగరానికి వలస వచ్చే నిరుపేద కుటుంబాలకు వల వేసి వారి పిల్లలను భిక్షాటన కోసం వినియోగించడం నిత్యకృత్యమైంది. రోజుకు రూ.200 నుంచి రూ.300 వందలకు వరకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా యాచకులకు చిన్నారులను ఉదయం ఏడు గంటలకు అందించి సాయంత్రం తీసుకెళ్లడం చేస్తున్నట్లు సమాచారం. కొందరు పసి పాపకు ఆకలి లేకుండా నిద్రలోనే ఉండేలా రెండు, మూడు గంటలకోసారి ప్రమాదకరమైన నల్ల మందు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు వందల మందికిపైగా నగరంలో సుమారు ఐదువందలకు పైగా చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్లు తెలుస్తోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, థియేటర్లు, దేవాలయాలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరిగే ప్రాంతాల్లో చిన్నారులు అధికంగా కనిపిస్తారు. గత ఐదేళ్లలో ఆపరేషన్ ముస్కాన్,ఆపరేషన్ స్మైల్ కింద సుమారు రెండు వేలకు పైగా చిన్నారులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
బాబోయ్.. బిచ్చగాళ్లు!
విశ్వనగరం లక్ష్యంలో భాగంగా అధికారులు హైదరాబాద్‌ను ‘బెగ్గర్ ఫ్రీ’ నగరంగా మారుస్తామని సంకల్పం చెప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా భాగ్యనగరాన్ని సందర్శించినప్పుడు ఆమె ప్రయాణించే మార్గాలు, మరికొన్ని ముఖ్యకూడళ్లలో యాచకులను నిరోధించి..వారికి పునరావాసంగా చర్లపల్లి జైలుకు తరలించారు. కొన్నాళ్లపాటు నగరవాసులకు వీరి బెడద తగ్గినా..మళ్లీ ఇది యాచకులకు నిజంగా బెగ్గర్..‘ఫ్రీ’ నగరంగా మారి వారి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. మళ్లీ ప్రధాన కూడళ్లలో వారు రెచ్చి పోతున్నారు.వీరి ఆగడాలపై ‘సాక్షి’ సోమవారం జరిపిన విజిట్‌లో అనేక ఆసక్తికర అంశాలు కనిపించాయి. ప్రధా నంగా మొజంజాహీ మార్కెట్, లక్డీకాపూల్, సెక్రటేరియట్ చౌరస్తా, మెహిదీ పట్నం ప్రాంతాల్లో యాచకుల ఆగడాలు నగరవాసులను అవస్థల పాల్జేస్తున్నాయి. వాటిపై ప్రత్యేక కథనం... – సాక్షి, హైదరాబాద్ దాడులకూ వెనుకాడని ధోరణి.. నగరంలో దందా సాగిస్తున్నవారంతా దుర్భర పరిస్థితుల దృష్ట్యా యాచన చేసేవారు కారు. హరియాణా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి నగరానికి కుటుంబ సమేతంగా వచ్చి శివారుల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకొని యాచన పేరిట దందా నడిపేదే వీరిలో అధికులు. వీరిలో పురుషులు ముందుగా రద్దీ కూడళ్లను ఎంపిక చేసుకొని భిక్షాటన కోసం తమవారు ఎవరు ఎక్కడ వెళ్లాలి అనేది నిర్ధారిస్తారు. మహిళలు, మధ్య వయస్కులు కీలక రహదారుల్లో వాహనాలను అడ్డగించి తమకు లేని కృత్రిమ వైకల్యాన్ని చూపి యాచిస్తుంటారు. కొంతమంది తమ చిన్నారులకు వైట్నర్ మత్తులో పెట్టి వారిని ఎత్తుకొని దీనంగా డబ్బులు అడుగుతుంటారు. ఒక్కోసారి ఎవరైనా విసుగెత్తి ద్విచక్ర వాహన దారులు వారి చర్యలను వ్యతిరేకిస్తే..వారిని తీవ్ర స్థాయిలో దూషించడమో, పరిస్థితులను బట్టీ తిరగ బడడమో చేస్తుంటారు. తమ చేతులకు కాళ్లకు ఉత్తుత్తి కట్లు, కాలినట్లు ఆయింట్మెంట్ పూతలు వేసుకొని జుగుప్సాకరంగా వాటిని ప్రదర్శిస్తూ ఇవతల వారిపై ఒత్తిడి తెస్తుంటారు.తమ కట్లు, లేదా దెబ్బలకు రుజువుగా వైద్య చీటీలు కూడా చూపి యాచన చేస్తున్నారు. ఇలా షాపుల వద్ద, చౌరస్తాల్లో వీరి ఆగడాలు పెరుగుతున్నా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం.. వీరి కార్యకలాపాలు కూడా రోజంతా ఒకే మాదిరిగా సాగడం లేదు. వీరు వాస్తవానికి ఉదయం పూట వీధుల్లో గృహస్తుల వద్ద యాచన చేపట్టరు. అప్పుడు మనకు కనిపించేది తప్పని స్థితిలో భిక్షాటనను చేపడుతున్న వృద్ధులో, వికలాంగులో కనిపిస్తారు. ముఠా వర్గీయులంతా ఆ సమయంలో కూడళ్ల ఎంపిక ప్రణాళికలో ఉంటారు. వారి పెద్ద నిర్దేశించిన ప్రాంతాలు నిర్ణయించుకున్నాక ఉదయం 9.30 తర్వాత చేతులకు, కాళ్లకు ఇతరత్రానో మేకప్ కట్లు వేసుకొని వృత్తిలోకి దిగుతారు. ఎవరికి కేటాయించిన అడ్డాల్లో వారు యాచన ప్రారంభిస్తారు. ఇలా మధ్యాహ్నం 2గంటలకు వీరికి బ్రేక్ వుంటుంది. సాయంత్రం పూట మరో బృందం మరో తరహాలో మేకప్ వేసుకొని రంగంలోకి దిగుతుంది. ఇదీ వీరు సాగిస్తున్న నిత్య దందా. వీరికి అడ్డుకట్ట వేసే పోలీసులు, జీహెచ్ఎంసీ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఈ యాచక ముఠాల ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నారు. ‘సాక్షి’ని వెంటాడిన ‘గార్డింగ్’ ముఠా... ఈ నయా యాచకుల ఆగడాల దృశ్యాలను ‘సాక్షి’ చిత్రీకరిస్తూ.. వారి బాధ ఏమిటి, దుస్థితి ఏమిటని ఆరా తీసే ప్రయత్నం చేసినప్పుడు మహిళా యాచకులకు దూరంగా ఉంటూ ‘రక్షకుల’ పాత్ర పోషిస్తున్న వారి పురుషులు కట్టెలతో దాడికి యత్నించడం వీరి దుశ్చర్యలకు ఓ ఉదాహరణ. భిక్షాటన చేస్తున్న కుటుంబీకులను ఎవరైనా ఆగ్రహంతో నిరోధించే ప్రయత్నం చేస్తే వారు ఇలాంటి ‘గార్డింగ్’ ముఠా చేతుల్లో చావు దెబ్బలు తినాల్సిందే. రోడ్లపై ప్రయాణిస్తున్న వారు కూడా రద్దీ వేళల్లోనో, వారి పనుల ఒత్తిళ్లలోనూ వారితో లేని పోని వివాదాలు ఎందుకని చేతిలో ఉన్నది పడేసి వెళ్లి పోతుంటారు.అలా కాకుండా వారి చర్యలను ప్రశ్నిస్తే..వెంటనే ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న పురుషులు దూకుడుగా కట్టెలతో రంగంలోకి దిగుతుంటారు. భయానక వాతావరణం సృష్టించి రభస చేస్తారు. ఇక నగరానికి చుట్టూ ఉన్న ఔటర్ ప్రాంతంలో కూడా యాచకుల దందా సాగుతోంది. ఈ ముఠాలు కూడా తమ కంటూ కొన్ని అడ్డాలు పెట్టుకొని అందులోకి వేరే వారు రాకుండా ముందే రింగ్ అవుతుంటారు. దీన్ని అతిక్రమిస్తే వారిలో వారు పర స్పరం దాడు లకు పాల్పడటం రివాజుగా మారుతోంది. ఇలా ఇటీవల నాంపల్లి రైల్వే స్టేషను పరిధిలో రెండు యాచక వర్గాల మధ్య జరిగిన దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో ఎవరైనా వారిని నివారించే ప్రయత్నం చేస్తే వారంతా ఏకమై నచ్చజెప్పిన వారిపై దాడులకు దిగుతుంటారు. నిరోధం.. నిలిచి పోయింది ఎందుకు? సుమారు ఏడాది కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా నగరంలో పర్యటించినప్పుడు అధికార యంత్రాం గం ప్రతిష్టాత్మకంగా భావించి ఓ ప్రత్యేక డ్రైవ్ ద్వారా యాచకులను నిరోధించింది. వారిని పోలీసులు పట్టుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు కూడా బెగ్గింగ్ ఫ్రీ సిటీ కోసం కొన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. అయినా నగరంలో వారి సంఖ్య తగ్గలేదు. పునరావాస చర్యలు లేవు. అసలు ఎవరు బాధ్యత తీసుకోవాలి..తీసుకుంటే వారి పునరావాసం ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక నిధులు, బాధ్యతలు లేక పోవడంతో అధికార యంత్రాంగం కూడా తమకెందుకులే అనే నిర్లిప్త ధోరణిలో వ్యవహరిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని పేరుచెప్పడానికి ఇష్టపడని ఓ జీహెచ్ఎంసీ అధికారి వెల్లడించారు. తమకు ఒక దిశా నిర్దేశం, నిర్దిష్ట ప్రణాళిక లేనప్పుడు తాము మాత్రం ఏం చేస్తామని ఎదురు ప్రశ్నించారు. పోలీసులు కూడా వీరిపై చర్యలకు ఉపక్రమిస్తున్నా అది తాత్కాలికమే అవుతోంది. ఒక్కో మారు వారూ యాచకులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఉదంతాలూ ఉన్నాయి. ఈ పరిస్థితులను తక్షణం చక్కదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని నగర వాసులు కోరుతున్నారు. -
ధర్మం చెయ్యొద్దు బాబూ!
త్వరలో ‘యాచకులు లేని నగరం’ అమలుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ప్రజల్లో అవగాహనకు ముమ్మర ప్రచారం ‘గౌరవ సదన్’ల ఏర్పాటుకు సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: ‘యాచకులకు మీరు ధర్మం చేయవద్దు. వారు ఆ వృత్తిని వదిలి... సాధారణ ప్రజల్లాగా జీవించాలంటే ఇంతకంటే మరో మార్గం లేద’టూ జీహెచ్ఎంసీ ప్రచారం చేయనుంది. గ్రేటర్ నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లు.. రహదారుల పొడవునా వీరి వల్ల ప్రజలకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలూ జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కారంతో పాటు నగరంలో యాచ క వృత్తిని నిరోధించేందుకు జీహెచ్ఎం సీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ కోసం సన్నాహాలు ప్రారంభిం చింది. యా చకులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి సదుపాయాలు సమకూర్చడం.. పని చేయగలిగిన వారికి అవకాశాలు కల్పించడం... వ్యాధి పీడితులుంటే చికిత్స చేయించడం వంటి కార్యక్రమాలతో ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించాలని భావిస్తోంది. ఇన్ని చేసినా ఆ అలవాటు మానలేని వారిని ఆ ‘దారి’ నుంచి తప్పించేందుకు ఎవరూ వారికి ధర్మం చేయకుండా ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విస్తృత ప్రచారం చేపట్టనుంది. బ్యానర్లు.. హోర్డింగ్‌ల ద్వారా ‘భిక్షాటనను ప్రోత్సహించవద్దు’ అంటూ ప్రచారం చేయనుంది. ఇప్పటికే ఇలాంటి స్లోగన్లు, డిజైన్లు తయారు చేశారు. త్వరలోనే వీటితో ప్రచారం చేయనున్నారు. ఈ అంశం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏదైనా రంగంలో ప్రసిద్ధి చెందిన వారిని (లెజెండ్‌ను) ఈ కార్యక్రమానికి అంబాసిడర్(ప్రచారకర్త)గా నియమించాలని భావిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి అంబాసిడర్‌ను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా బలవంతంగా యాచన చేయిస్తున్నట్లు ప్రజల దృష్టికి వస్తే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ (నెంబరు 040- 21 11 11 11)కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రచారం చేయనున్నారు. స్థితిగతులపై సర్వే నగరంలో దాదాపు 20 వేల మంది యాచకులు ఉన్నట్టు జీహెచ్ఎంసీ సర్వేలో తేలింది. వీరిలో రాత్రి బస చేసేందుకు కనీసం నీడ కరువైన వారు దాదాపు వెయ్యి మంది ఉన్నారు. భిక్షాటన ద్వారా వారికి రోజుకు లభిస్తున్న సగటు ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ, ఎలాంటి ఆశ్రయం పొందుతున్నారు..? వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారు.. తదితర అంశాలను సేకరించారు. ఏయే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు అధిక సంఖ్యలో ఉన్నారు? వీరి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న వంద జంక్షన్ల వివరాలు సేకరించారు. యాచకులను ఏ విధంగానూ ప్రోత్సహించరాదని, పునరావాసం ద్వారా సమాజంలో వారికి గౌరవం కల్పించాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. వీరికి ఆశ్రయం కల్పించేందుకుస్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ద్వారా యాచకుల్లోని వృద్ధులు, వికలాంగులకు ఆసరా కల్పించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ తరఫున తొలిదశలో జోన్‌కు ఒకకేంద్రం చొప్పున ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించనున్నారు. వాటికి ‘గౌరవసదన్’లుగా నామకరణం చేయనున్నారు. వాటిలో ఉండే వారికి ఆహారం, దుస్తులు, సబ్బులు, తలనూనెల వంటి వాటికి కొంత నగదు ఇస్తారు. పని చేయగలిగిన శక్తి ఉన్న వారికి పనులు చూపిస్తారు.