బిక్షాటన రహిత భారత్‌గా..! ఇక ఆ నగరాల్లో బిచ్చగాళ్లు ఉండరు! | Centre Shortlists 30 Key Cities To Make Them Free Of Beggars | Sakshi
Sakshi News home page

బిక్షాటన రహిత భారత్‌గా..! ఇక ఆ నగరాల్లో బిచ్చగాళ్లు ఉండరు!

Published Mon, Jan 29 2024 3:37 PM | Last Updated on Mon, Jan 29 2024 3:53 PM

Centre Shortlists 30 Key Cities To Make Them Free Of Beggars - Sakshi

నగరాల్లోనూ ట్రాఫిక్‌ల వద్ద బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. అందులోనూ చారిత్రక ప్రదేశాల వద్ద, ఆలయాల వద్ద మరి ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకంటే ఆయా ప్రదేశాల్లో మనుషుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బిచ్చగాళ్లకు కూడా యాచించడం ఈజీ అవుతుంది. దివ్యాంగులు, అనాథలుగా అవ్వడం, వృద్ధాప్యం తదితర కారణాలతో ఈ యాచక వృత్తిలోకి వస్తుంటారు. ఐతే దీని వెనుక పెద్ద మాఫియా కూడా ఉంది. ఇలా రోజంతా యాచించిన సొమ్మును తీసుకు రాకపోతే వాళ్లను చిత్రహింసలు పెట్టే ముఠా కూడా ఉన్నారు. వారి సమస్యలకు చెక్‌పెట్టేలా కేంద్రం ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే గాక బిచ్చగాళ్లు లేని దేశంగా మార్చనుంది. ఎలా చేస్తున్నారు? ఈ కార్యచరణ ముఖ్యోద్దేశం తదితరాల విశేషాలేంటో చూద్దామా!

కేంద్రం బిచ్చగాళ్ల డేటాపై ఓ నివేదక రూపొందించింది. ముందుగా యాచకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాను సర్వే చేయించింది. ఆ తర్వాత దీనికి చెక్‌పె‍ట్టేలా భారత్‌ను యాచక రహితంగా మార్చే ప్రణాళికతో ముందుకొచ్చింది. అందులో భాగంగా కీలక 30 నగరాలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఉత్తరాదిలో అయోధ్య నుంచి తూర్పున గువహటి.. పశ్చిమాన త్రయంబకేశ్వరం నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకూ 30 నగరాల్లో భిక్షాటన చేస్తున్నవారు ముఖ్యంగా మహిళలు, పిల్లల గురించి సర్వే చేయించి, వారందరికి పనరావసం కల్పించనున్నట్లు ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ఈ నగరాల్లోని హాట్‌స్పాట్‌లు గుర్తించి 2022 నాటికి బిచ్చగాళ్ల రహిత నగరాలుగా మార్చడమే ధ్యేయంగా కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ పెట్టుకుంది. అందుకోసం సదరు జిల్లా మున్సిపల్‌ అధికారులు తోడ్పాటు అందించాలని పేర్కొంది ప్రభుత్వం. అంతేగాదు వచ్చే రెండేళ్ల మరిన్ని నగరాలు ఈ జాబితాలోకి చేరే అవకాశం కూడా ఉందని తెలిపింది. 

ఇలా మతపరమైన , చారిత్రక లేదా పర్యాట ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో స్వయం ఉపాధి పథకం అమలు చేసి, వాటికింద వారికి జీవనోపాధి కల్పించనుంది. అంతేగాదు 'భిక్షా-వృత్తి ముక్త్ భారత్' (భిక్షాటన రహిత భారతదేశం) లక్ష్యాన్ని చేరుకునేలా పూర్తి స్థాయిలో సర్వే చేయించి ఆయా నగరాల్లోనే వారందరికీ పునరావసం కల్పించనుంది. ఈ కార్యక్రమ మార్గదర్శకాల ప్రకారం బిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి రియల్‌టైమ్‌ అప్‌డేషన్‌ అయ్యేలా ఫిబ్రవరి నాటికల్లా జాతీయ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ని ప్రారంభించనుంది.  అలాగే సర్వే, పునరావాసం కోసం ఎంపిక చేసిన నగరాల్లో కూడా అధికారులు మొబైల్‌ యాప్‌లో షెల్టర్లు, నైపుణ్యాలు, విద్య, పునరావాసాలు  తదితర పురోగతి నివేదికను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ బిచ్చగాళ్లకు పునరావసం కల్పించనున్న  10 మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాల్లో అయోధ్య, కాంగ్రా, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, సోమనాథ్, పావగఢ్, త్రయంబకేశ్వర్, బోధగయ, గౌహతి మధురై తదితరాలు ఉన్నాయి. అలాగే పర్యాటక ప్రదేశాలలో విజయవాడ, కెవాడియా, శ్రీ నగర్, నంసాయి, కుషినగర్, సాంచి, ఖజురహో, జైసల్మేర్, తిరువనంతపురం,పుదుచ్చేరి ఉండగా, అమృత్‌సర్, ఉదయ్‌పూర్, వరంగల్, కటక్, ఇండోర్, కోజికోడ్, మైసూరు, పంచకుల, సిమ్లా, తేజ్‌పూర్ వంటివి చారిత్రక నగరాల జాబితాలో ఉన్నాయి. ఈ బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించడంలో నగర పాలక సంస్థ తోపాటు సంబంధిత మతపరమైన ట్రస్ట్ లేదా పుణ్యక్షేత్రం బోర్డు కూడా పాలుపంచుకుంటుంది. 

ఇక ఎంపిక చేసిన ఈ 30 నగరాల్లో దాదాపు 25 సిటీలు కార్యాచరణ ప్రణాళిక అందుకోగా..కాంగ్రా, కటక్‌, ఉదయ్‌పూర్‌, కుషినగర్‌ వంటి నగరాల అనుమతి కోసం వేచి ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ ప్రాంతంలో భిక్షాటన చేసే వ్యక్తులు ఎవరూ లేరని, అందువల్ల వేరే నగరాన్ని పరిగణించాలని సాంచి అధికారులు కేంద్రానికి తెలియజేశారు. కోజికోడ్, విజయవాడ, మదురై, మైసూరులో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ కార్యచరణ అమలు చేస్తున్న సదరు జిల్లా మున్సిపల్‌ అధికారుల కోసం కేంద్ర సామాజిక సాధికారికత మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఎంపిక చేసిన నగరాల రోడ్‌ మ్యాప్‌లో సర్వే, సమీకరణ, రెస్క్యూ, నివాసం, విద్య ద్వారా సమగ్ర పునరావాసం, నైపుణ్యం అభివృద్ధి, ఉపాధి ద్వారా జనజీవన స్రవంతితో ఏకీకరణ చేయడం, సమగ్ర పునరావాసం తదితరాలు ఉన్నాయి. 

(చదవండి: ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించిన టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తున్నారో తెలుసా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement