సాక్షి, బళ్లారి/తుమకూరు: ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ పార్టీ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, వారి ముందు సాగిలపడుతోందని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారిలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రం గురించి ప్రస్తావించారు.
సుందరమైన రాష్ట్రంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారని అన్నారు. కాంగెస్ మాత్రం ఈ చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. కేరళలో చోటుచేసుకున్న ఉగ్ర కుట్రలను ‘ద కేరళ స్టోరీ’ చిత్రం బట్టబయలు చేస్తోందని ప్రశంసించారు. కేవలం ఒక రాష్ట్రంలో ముష్కర మూకల ఆగడాలు, మోసపూరిత విధానాలపై ఈ చిత్రం నిర్మించారని పేర్కొన్నారు. దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి ఆ పార్టీ వత్తాసు పలుకుతోందని, వారితో తెరవెనుక రాజకీయ బేరసారాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అసలు నైజం ఏమిటో కర్ణాటక ప్రజలు తెలుసుకోవాలని కోరారు.
కర్ణాటకను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలంటే ఇక్కడ శాంతి భద్రతలు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాద రహిత రాష్ట్రంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీకి కడుపు నొప్పి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం తుమకూరులో భారీ రోడ్డు షోలో పాల్గొన్నారు.
ఆ కుట్ర శబ్దాలు వినిపించవు
మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉగ్రవాదం కూడా స్వభావం మార్చుకుంటోందని, స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారం, మత ఘర్షణలకు ఉగ్రవాదంతో సంబంధం ఉంటోందని మోదీ గుర్తుచేశారు. గత కొన్నేళ్లలో కొత్తరకం ఉగ్రవాదం పుట్టుకొచ్చిందన్నారు. ఈ ఉగ్రవాదంలో సమాజాన్ని గుల్లబార్చే కుట్రల శబ్దాలు వినిపించవని చెప్పారు. నిశ్శబ్దంగానే కార్యకలాపాలు సాగిపోతుంటాయని, దీనిపై కోర్టులు కూడా ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment