మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం
కాంగ్రెస్ పాలనలో పేదలకు ఏనాడూ మేలు జరగలేదు
బడుగు బలహీన వర్గాలు పైకి ఎదిగితే ఆ పార్టీ సహించలేదు
పేదలను ఎప్పటికీ పేదరికంలో ఉంచాలన్నదే కాంగ్రెస్ ఎజెండా
ముంబై: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. గరీబీ హఠావో అంటూ నినాదం ఇచ్చిన ఆ పార్టీ పేదరికాన్ని నిర్మూలించకుండా పేదలను విచ్చలవిడిగా లూటీ చేసిందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు జీవితంలో పైకి ఎదగకుండా కుట్రలు చేయడమే కాంగ్రెస్ విధానమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు ఏనాడూ మేలు జరగలేదన్నారు. ఏదైనా మంచి జరిగితే ప్రజలు సంతోషిస్తారు గానీ కాంగ్రెస్ మాత్రం కళ్లలో నిప్పులు పోసుకుంటుందని విమర్శించారు. ఇతరులకు లబ్ధి చేకూరడం ఆ పార్టీకి ఇష్టం ఉండదన్నారు.
గురువారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయిందన్నారు. ఆ పార్టీ ముమ్మాటికీ పేదల వ్యతిరేకి అని ఆరోపించారు. పేదలను ఎప్పటికీ పేదరికంలోనే ఉంచాలన్న ఎజెండాతో పని చేస్తోందన్నారు. అధికారంలోకి రానివ్వకుండా కాంగ్రెస్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత పేద ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో ఒక తరం తర్వాత మరో తరం నాయకులు పేదరిక నిర్మూలన గురించి నినాదాలు ఇవ్వడం తప్ప ఆ దిశగా వారు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. వారి బోగసు నినాదాలను ఎవరూ నమ్మొద్దని కోరారు. ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే...
స్వరాజ్.. సురాజ్
‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ఎంతోమంది ప్రజలు కూడు, గూడు, గుడ్డ కోసం పోరాటం సాగించారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడ్డారు. గత పదేళ్లలో ఈ పరిస్థితిలో తొలిసారిగా మార్పు వచ్చింది. మా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.
ఛత్రపతి శివాజీ జన్మించిన మహారాష్ట్ర గడ్డ అంటే నాకెంతో అభిమానం. 2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నా పేరు ఖరారైన తర్వాత రాయ్‌గఢ్ కోటను సందర్శించా. దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఛత్రపతి శివాజీ ఆశీస్సులు స్వీకరించా. స్వరాజ్(స్వపరిపాలన) అనే ప్రతిజ్ఞను శివాజీ మనకు అందించారు. స్వరాజ్‌తోపాటు సురాజ్(సుపరిపాలన) అనే తీర్మానాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్లాలి.
రిజర్వేషన్ల వ్యతిరేకి కాంగ్రెస్
ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుతంత్రాలు సాగిస్తున్నాయి. ఆర్టికల్ 370 కోసం జమ్మూకశీ్మర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. జమ్మూకశీ్మర్ మన దేశంలో అంతర్భాగం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే అక్కడ అమలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వకూడదు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనం కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.
అవి దేశ ప్రయోజనాలకు, మెరిట్‌కు వ్యతిరేకమని చెబుతోంది. ఎన్ని దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ మనస్తత్వం మారడం లేదు. అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ యువరాజు బహిరంగంగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చిన్నచిన్న కులాల పేరిట ముక్కలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. ఒక బీసీ నాయకుడు గత పదేళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతుండడాన్ని ఆ పార్టీ సహించలేకపోతోంది’’. అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్రపతి శంభాజీ అభిమానులకు, ఔరంగజేబ్ ఆరాధకులకు మధ్య పోరాటం జరుగుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment