ఔగడొగు: ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో రక్తమోడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఓ పట్టణంపై దాడి చేసి 35 మందిని చంపేశారు. ప్రతిగా సైన్యం జరిపిన దాడుల్లో 80 మంది ఉగ్రమూకలు హతమయ్యారు. సౌమ్ ప్రావిన్స్‌లోని అర్బిండాలో మంగళవారం ఉదయం బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు పట్టణంలోని సైనిక క్యాంపుతోపాటు పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 35 మంది పౌరులు చనిపోగా 20 మంది సైనికులు, ఆరుగురు పౌరులు గాయపడ్డారు. మృతుల్లో 31 మంది మహిళలేనని ప్రభుత్వం తెలిపింది.
వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, వైమానిక దళం సాయంతో ఉగ్రవాదులపై భారీ ఎత్తున విరుచుకుపడింది. తమ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఉగ్రదాడికి తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోనప్పటికీ ఈ ప్రాంతంలో తరచూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న అల్ ఖాయిదా, ఐఎస్‌లే కారణమని భావిస్తున్నారు. బుర్కినాఫాసోతో మాలి, నైగర్ సరిహద్దులకు సమీపంలో గడిచిన ఐదేళ్లలో ఉగ్ర దాడుల్లో 700 మంది చనిపోయారు. 5.60 లక్షల మంది ప్రజలు భయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. దీంతో ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు 4, 500 ఫ్రెంచి, 13 వేల ఐక్యరాజ్యసమితి బలగాలు పనిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment