ఇన్నాళ్లూ భయపడిందే జరిగింది. ఉగ్రవాదుల చేతుల్లోకి డ్రోన్లు వెళితే ఎంత ముప్పు ఉంటుందో మనకి తెలిసివచ్చింది. నక్కజిత్తుల పాకిస్తాన్ ఇన్నాళ్లూ ఆయుధాల సరఫరాకి వాడిన డ్రోన్లను ఇప్పుడు ఏకంగా దాడులకే వినియోగించింది. ఇలాంటి కిల్లర్ డ్రోన్లతో మనకి ముప్పు ఎంత? వీటిని ఎదుర్కొనే యాంటీ డ్రోన్ టెక్నాలజీ సత్తా మనకి ఎంత? కీలకమైన రక్షణరంగ పరిశోధన సంస్థలు, సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడిచేస్తే ఏంటి పరిస్థితి?
అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ), వీటినే సింపుల్‌గా డ్రోన్లు అని పిలుస్తారు. ప్రకృతి వి పత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలకి, మా రుమూల ప్రాంతాల్లో మందుల పంపిణీకి, విందు వినోదాల సమయాల్లో వీడియోలు తీయడానికి, ఉ పయోగపడే ఈ డ్రోన్ టెక్నాలజీని పాకిస్తాన్ తన ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తోంది. ప్రపంచ దేశాల్లో అమెరికా, యూకే, ఇజ్రాయెల్ తర్వాత మిలటరీ డ్రోన్లను పాకిస్తానే ఎక్కువగా వినియోగిస్తోంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాతే
జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019, ఆగస్టు 5 చేసిన తర్వాత పాకిస్తాన్ భారత్‌ని ముప్పులోకి నెట్టేలా డ్రోన్ల వినియోగాన్ని అధికం చేసింది. అదే సంవత్సరం జమ్మూ కశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో పాక్‌కు చెందిన డ్రోన్ల కదలికలు కనిపించాయి. సరిహద్లుల్లో నిఘా, యథేచ్ఛగా ఆయుధాలు మందుగుండు సామాగ్రి పంపిణీకి పాకిస్తాన్ డ్రోన్లను వినియోగిస్తోంది. డ్రోన్ల సహాయంతో ఆయుధాలను సరిహద్దులు దాటించి భారత భూభాగంలోని ఉగ్రవాదుల సమీపంలో జారవిడుస్తోంది.
2019లో ఆగస్టు 13న అమృత్‌సర్ సమీపంలోని మెహవా గ్రామం దగ్గర పాక్ డ్రోన్ కుప్పకూలిపోవడాన్ని భద్రతా అధికారులు గుర్తించారు. పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్లు ఎన్నోసార్లు వచ్చి ఆయుధాలు, మం దుగుండు సామగ్రిని సరఫరా చేశాయని పాక్‌కు చెందిన ఉగ్రవాదుల్ని విచారిస్తున్నప్పుడు తేలింది. 2020 జూన్‌లో జమ్మూలోని హీరానగర్‌లో పాక్ నిఘా డ్రోన్‌ని జవాన్లు కూల్చేశారు. 2020 సెప్టెంబర్‌లో అక్నూర్ సెక్టార్‌లో డ్రోన్ల ద్వారా పాక్ ఆయుధాలను జారవిడిచినట్టు తెలిసింది.
డ్రోన్ దాడుల్ని ఎదుర్కోవడం ఎలా?
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల డ్రోన్ దాడులతో యాంటీ డ్రోన్ టెక్నాలజీపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ టెక్నాలజీలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. మన గగనతలంలోకి ప్రవేశించే డ్రోన్లు రాడార్లకి అందడం లేదు. రాడార్లతో గుర్తించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. థర్మల్ కెమెరాల సాయంతో గుర్తిస్తున్నా ప్రమాదం ముంచుకొచ్చేవరకు తెలియడం లేదు. డ్రోన్లను ఎదుర్కోవడానికి సాఫ్ట్‌కిల్, హార్డ్ కిల్ అనే రెండు రకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్ కిల్ టెక్నాలజీతో డ్రోన్లు మన గగనతలంలో ప్రవేశించకుండానే అడ్డుకొని వాటి వ్యవస్థని ఫ్రీజ్ చేయవచ్చును. ఇక హార్డ్‌కిల్ టెక్నాలజీతో డ్రోన్లను కూల్చేయవచ్చు.
గత రెండేళ్లుగా సాఫ్ట్ కిల్ టెక్నాలజీని వాడాలని భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతూ వస్తోంది. ఇప్పుడు హార్డ్‌కిల్ వ్యవస్థపై కేంద్రం దృష్టి సారించింది. మన దేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) సొంతంగా తయారు చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థని గత ఏడాది స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద వినియోగించారు. అయితే ఈ వ్యవస్థ కేవలం 2 నుంచి 3 కి.మీ. పరిధిలోకి వచ్చాకే డ్రోన్లను గుర్తించగలదు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్‌కి చెందిన స్మార్ట్ షూట్ సంస్థతో యాంటీ డ్రోన్ వ్యవస్థ కొనుగోలుపై కేంద్రం చర్చలు జరుపుతోంది. ఇప్పటికైనా కేంద్రం డ్రోన్లు కొనుగోలుపై కాకుండా, యాంటీ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 21 వేలకి పైగా మిలటరీ డ్రోన్లు ఉన్నట్టుగా అమెరికాకి చెందిన బార్డ్ కాలేజీ సెంటర్ ఫర్ స్టడీ ఆన్ డ్రోన్స్ అంచనా
► పదేళ్ల క్రితం 60 దేశాల్లో మిలటరీ డ్రోన్లు ఉంటే ఇప్పుడు ఈ దేశాల సంఖ్య 95కి పెరిగింది
► కదన రంగంలో వినియోగించే డ్రోన్లు ప్రస్తుతం 171 రకాలు ఉన్నాయి
► అమెరికా ఇజ్రాయెల్, యూకే, రష్యా, టర్కీ వంటి దేశాల తర్వాత పాకిస్తానే అత్యధికంగా మిలటరీ డ్రోన్లను వినియోగిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను పాక్ వాడుతోంది.
► ఇతర దేశాలకు డ్రోన్లను ఇజ్రాయెల్ అధికంగా ఎగుమతి చేస్తోంది. బ్రిటన్ నుంచి భారత్ వరకు గత ఎనిమిదేళ్లలో 460 కోట్ల డాలర్ల విలువైన డ్రోన్లను ఆ దేశం ఎగుమతి చేసింది.
► మొట్టమొదటిసారిగా 1982లో సిరియా వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ డ్రోన్లతో దాడి చేసింది.
► ఇటీవల కాలంలో సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై యెమన్‌కి చెందిన హౌతి ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు జరిపితే, ఇరాన్‌పై అమెరికా డ్రోన్లతోనే దాడులు సాగించింది.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment