‘మహా’దారిలో జార్ఖండ్‌ ? కాంగ్రెస్‌ భయానికి కారణాలివీ... | Jharkhand go the Maharashtra way | Sakshi
Sakshi News home page

Political Strategy: ‘మహా’దారిలో జార్ఖండ్‌ ? కాంగ్రెస్‌ భయానికి కారణాలివీ...

Published Thu, Aug 4 2022 4:35 AM | Last Updated on Thu, Aug 4 2022 12:08 PM

Jharkhand go the Maharashtra way - Sakshi

జార్ఖండ్‌ మరో మహారాష్ట్ర కానుందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తుంది. మహారాష్ట్రలో 40 మంది పై చిలుకు ఎమ్మెల్యేలతో ముంబై నుంచి బిచాణా ఎత్తేసి వేరుకుంపటి పెట్టుకున్న శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండేతో బీజేపీ రసవత్తర రాజకీయ నాటకం ఆడించింది. షిండే సీఎం పీఠమెక్కి, అప్పటిదాకా అధికారాన్ని పంచుకున్న ఉద్ధవ్‌ ఠాక్రేకు చెందిన శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ కూటమి ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఆ నాటకానికి తెరపడింది.

కనీసం ఎంపీలనన్నా కాపాడుకుందామనుకున్న ఉద్ధవ్‌కు ఆ ముచ్చట కూడా తీరేట్టు లేదు. శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడం ఉద్ధవ్‌కు కోలుకోలేని దెబ్బే. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. బీజేపీ ఇప్పుడు జార్ఖండ్‌ను కూడా తమ సంకీర్ణం నుంచి లాక్కునే ప్రయత్నంలో ఉందని ఆ పార్టీ అనుమానిస్తోంది.

అసలేం జరిగింది!
► జార్ఖండ్‌లో జేఎంఎంతో కాంగ్రెస్‌ అధికారాన్ని పంచుకుంటోంది. ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గత ఆదివారం భారీ నగదుతో పశ్చిమబెంగాల్‌లో అరెస్టయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ వారిని పార్టీనుంచి సస్పెండ్‌ చేయాల్సి వచ్చింది. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమేనని కాంగ్రెస్‌ అనుమానిస్తోంది.
► జేఎంఎంతో అవినాభావ సంబంధాలున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న బెంగాల్‌లో ఈ అరెస్టులు జరగడం గమనార్హం.
► ‘మహారాష్ట్ర కథ ముగిసింది. ఇక మిగిలింది జార్ఖండ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్‌లే’నని బెంగాల్‌ బీజేపీ నేత సువేందు అధికారి ఇటీవల వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌ ఆందోళనలను మరింత పెంచుతోంది.


కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై కన్నేయడం బీజేపీకి ఇదేమీ కొత్త కాదని కాంగ్రెస్‌ దుయ్యబడుతోంది. చరిత్రే ఇందుకు సాక్ష్యమంటోంది. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి అందరినీ దారికి తెచ్చుకోవడం బీజేపీకి అలవాటైన విద్యేనన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. జార్ఖండ్‌ పరిణామాలే ఇందుకు తాజాఉదాహరణ అంటోంది కాంగ్రెస్‌. బీజేపీ మాత్రం వీటిని కట్టుకథలుగా కొట్టిపారేస్తోంది. జార్ఖండ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని, ఎమ్మెల్యేల అరెస్టు దీన్ని నిరూపిస్తోందని చెబుతోంది. కాంగ్రెస్‌–బీజేపీ పరస్పర నిందారోపణలకు తోడు సంకీర్ణ భాగస్వామి జేఎంఎంతో సంబంధాలు బెడిసికొడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీస్తోంది.

జేఎంఎం– కాంగ్రెస్‌ విభేదాలు
► జూన్‌లో రాజ్యసభ ఎన్నికలప్పుడు సంకీర్ణ ధర్మాన్ని అనుసరించి ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపాలన్న సోనియాగాంధీ విజ్ఞప్తిని సీఎం సోరెన్‌ పెడచెవిన పెట్టారు. సొంత అభ్యర్థిని బరిలోకి          దించడంతో సోనియా కంగుతిన్నారు.
► రాష్ట్రపతి ఎన్నిక వేళ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీతో పాటు ఇతర విపక్షాల నేతలు ఆయన వెంట నడిచారు. కానీ జేఎంఎం నేత సోరెన్‌ మాత్రం ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారు. తద్వారా కాంగ్రెస్‌కు దూరం జరుగుతున్న సంకేతాలిచ్చారు.


ఓటింగ్‌లోనూ అదే జరిగింది...
 కాంగ్రెస్‌ మద్దతిచ్చిన సిన్హాకు కాకుండా అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు సోరెన్‌ జై కొట్టారు. జార్ఖండ్‌లో గణనీయంగా ఉన్న గిరిజనులను సంతృప్తి పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లోనూ ఏడెనిమిది మంది ముర్ముకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డట్టు తేలింది. ఆదివారం అరెస్టైన ముగ్గురు కూడా వారిలో ఉన్నట్టు వినికిడి. ఈ విభేదాలన్నీ ఒక ఎత్తయితే యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ వేసిన రోజే హేమంత్‌ సోరెన్‌ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ఢిల్లీలో కలుసుకోవడం చర్చనీయంగా మారింది. తనపై ఉన్న కేసుల నుంచి బయట పడేందుకే హోం మంత్రితో ఆయన బేరాలాడుతున్నారనే మాటా వినిపించింది. సంకీర్ణం నుంచి కాంగ్రెస్‌ను తప్పించి బీజేపీతో జతకట్టాలంటూ సోరెన్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఆయన లొంగిపోయినా ఆశ్చర్యం లేదు. జరగబోయేది అదేననేది విశ్లేషకుల అంచనా.
 
సోరెన్‌పై కేసులివీ..
► జార్ఖండ్‌ శాసనసభకు ఎన్నికైన సమయంలో సోరెన్‌ లాభదాయక పదవిలో కొనసాగుతున్నారనేది తొలి ఆరోపణ. ఇది ఎన్నికల సంఘం విచారణలో ఉంది.
► 2021లో గనుల మంత్రిగా ఉండగా ఓ గనుల లీజును తనకు తానే కేటాయించుకున్నారనేది మరో ఆరోపణ.
► షెల్‌ కంపెనీలతో సోరెన్‌కు సంబంధముందని కోర్టులో ఓ పిల్‌ పెండింగులో ఉంది.
► మైనింగ్‌ కేసులో జూలై 19న సోరెన్‌ సన్నిహితుడైన పంకజ్‌ మిశ్రాను ఈడీ అరెస్టు చేయడం కూడా ఆయన్ను చిక్కుల్లో పడేసింది.
► మైనింగ్‌కు సంబంధించినవే మరికొన్ని కేసులు కూడా సోరెన్‌పై పెండింగ్‌లో ఉన్నాయి.


ఈ తలనొప్పుల నుంచి తప్పించుకోవడానికి సోరెన్‌ బీజేపీ వైపు చూస్తున్నారనేది విశ్లేషకుల అంచనా. అదే జరిగితే జార్ఖండ్‌ మరో మహారాష్ట్ర కావడానికి        ఎంతో సమయం పట్టదు!

ఎస్‌.రాజమహేంద్రారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement