కవ్వింపులు.. ఆపై గొడవలు | YSRCP TDP mutual attacks | Sakshi
Sakshi News home page

కవ్వింపులు.. ఆపై గొడవలు

Published Sun, Jun 9 2024 4:56 AM | Last Updated on Sun, Jun 9 2024 7:50 AM

YSRCP TDP mutual attacks

టీడీపీ నేత బాణసంచా కాల్పులతో ఎగిసిపడిన నిప్పురవ్వలు 

ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న వైఎస్సార్‌సీపీ నేతలు.. 

ఇరు వర్గాల మధ్య వాగ్వాదం.. పరస్పరం దాడులు 

గొడవతో సంబంధమే లేని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డిపై అక్రమంగా కేసు నమోదు

పెళ్లకూరు (తిరుపతి జిల్లా): పెళ్లకూరు మండలం చిల్లకూరులో టీడీపీ కార్యకర్త దుందుడుకు చర్యలతో గొడవ చోటుచేసుకుంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడులతో సంబంధం లేని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. వివాదాస్పద ఈ గ్రామంలో కొద్ది రోజులుగా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేత దువ్వూరు విజయసేనారెడ్డి టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో గురువారం రాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చాడు. 

గడ్డివాములు, చిన్న పిల్లలపై నిప్పు రవ్వలు పడ్డాయి. దీంతో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మురళి, మరి కొందరు విజయసేనారెడ్డితో మాట్లాడేందుకు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల వారు దాడులకు పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వేర్వేరు వాహనాల్లో చికిత్స నిమిత్తం ఒక వర్గాన్ని శ్రీకాళహస్తికి, మరో వర్గాన్ని నాయుడుపేట ఆసుపత్రులకు తరలించారు. 

అదే సమయంలో సత్యనారాయణరెడ్డిపై కక్ష సాధించడం కోసం దాడుల్లో గాయపడిన రాకే‹Ùరెడ్డికి మద్దతుగా నాయుడుపేటకు చెందిన కొందరు టీడీపీ యువత పెళ్లకూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సత్యనారాయణరెడ్డి తమపై దాడి చేయించాడంటూ రాకే‹Ùరెడ్డి, విజయసేనారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డితో పాటు ఆయన వర్గానికి చెందిన పిల్లిమిట్ట మురళి, వంశీకృష్ణ, ఆళ్ల చంద్రబాబు, సుజిత్, మణి, నాగార్జున్, చెంచయ్య, పుట్టయ్యలతో పాటు రాకే‹Ùరెడ్డి, విజయసేనారెడ్డిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

సత్యనారాయణరెడ్డిని కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో సంబంధంలేని సత్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. నాయుడుపేట రూరల్‌ సీఐ జగన్‌మోహన్‌రావు అత్యుత్సాహం వల్లే సత్యనారాయణరెడ్డిని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అడిషనల్‌ ఎస్పీ జక్కా కులశేఖర్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కేసు వివరాలను పరిశీలించారు. సత్యనారాయణరెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేసి సూళ్లూరుపేట కోర్టులో హాజరు పరిచారు. ఎన్నికల సమయంలో డబుల్‌ గేమ్‌ అడుతున్న సీఐని బదిలీ చేయాలని అప్పట్లో ఎమ్మెల్యే సంజీవయ్యకు సూచించడాన్ని మనసులో పెట్టుకొని అన్యాయంగా తనను కేసులో ఇరికించినట్లు సత్యనారాయణ రెడ్డి తెలిపారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement