వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోహిత్‌రెడ్డిపై దాడికి యత్నం
రామిరెడ్డిపల్లి సర్పంచి ఇంటికి నిప్పు
మోహిత్‌రెడ్డి వాహనం అడ్డగింత..
కారుపై పెట్రోలు పోసి నిప్పంటించిన వైనం
బండరాళ్లు, కర్రలతో మరో వాహనంపై దాడి
టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని నేతృత్వంలో విధ్వంసం
శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో
స్ట్రాంగ్ రూమ్ వద్ద పేట్రేగిన పచ్చ మూక
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ మూకల ఆగడాలు, రౌడీయిజానికి అంతేలేకుండా పోయింది. పోలింగ్ ముగిసిన అనంతరం సోమవారం రాత్రి 9.45 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు వీరి పైశాచిక విధ్వంసకాండ కొనసాగింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, స్థానిక సర్పంచి కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కుమారుడు వినీల్ ఆధ్వర్యంలో పచ్చ మంద దాడి చేసింది.
సర్పంచి ఇంటికి నిప్పు పెట్టింది. విలువైన వస్తువులు, నగదు, బంగారం, ల్యాప్‌టాప్ వంటి వస్తువులను లూటీ చేసింది. పంచాయతీలో అధిక శాతం ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా ఓటింగ్‌లో పాల్గొన్నారనే అక్కసుతోనే పచ్చ మంద ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు. దాడికి గురైన సర్పంచి చంద్రశేఖర్‌రెడ్డిని పరామర్శించేందుకు రామిరెడ్డిపల్లికి వస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని టీడీపీ శ్రేణులు, చిత్తూరు నుంచి దిగుమతి చేస్తున్న రౌడీలతో ఉన్న వినీల్ అడ్డుకున్నారు. మోహిత్‌రెడ్డిపై దాడికి ప్రయత్నించారు.
ఆయన కారును పెట్రోలు పోసి దగ్ధం చేశారు. మరో కారును రాడ్లు, కర్రలు, బండరాళ్లతో ధ్వంసం చేశారు. కారు డ్రైవర్, మాజీ సైనికుడిని కట్టేసి కొట్టారు. ఈ దాడిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నానీయే మోహిత్‌రెడ్డి అనుచరులను కొట్టారు. బాధితులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెచ్చిపోయిన పచ్చ మూకలు
తిరుపతిలో మంగళవారం ‘పచ్చ’ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ వద్ద టీడీపీ అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు పచ్చమూకలను రెచ్చగొట్టారు. దీంతో వర్సిటీ ముందు రోడ్డుపై బైఠాయించి ఈ మూకలు ఆందోళన చేశాయి. రోడ్డుపై వెళ్తున్న అమాయకులను సైతం పట్టుకుని ‘మీరు వైఎస్సార్‌సీపీ వాళ్లే కదా... ’అంటూ విచక్షణా రహితంగా కొట్టాయి.
వర్సిటీ రోడ్డు మీదుగా తుమ్మలగుంటకు వెళ్తున్న తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయతీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మొదలియార్ రమేష్, అతని అనుచరుల కారును అడ్డగించాయి. రమేష్‌తో పాటు కారులో ఉన్న అనుచరులను రోడ్డుపైకి లాగి.. పది మంది కలిసి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ, స్పృహ తప్పిపోయేంతగా కొట్టారు. అంతటితో ఆగక, విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఎస్వీయూ, మహిళా వర్శిటీ, పద్మావతి కళాశాల ఉద్యోగులపై సైతం దాడులు చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోదరుడు రఘునాధరెడ్డికి చెందిన బుల్లెట్, మరో 10 వాహనాలపై వైఎస్సార్‌సీపీ గుర్తులు ఉన్నాయని కాల్చి వేశారు. వీడియోలు తీస్తున్న మీడియాపై సైతం దాడికి పాల్పడ్డారు. ‘పులివర్తి నాని అన్న చెప్పాడు.. వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను తరిమి తరిమి కొట్టండి’ అంటూ గంజాయి మత్తులో ఉన్న పచ్చమూక రెచ్చిపోయింది. ఈ గూండాల విధ్వంసంతో వర్సిటీ పరిసరాలు హాహాకారాలు.. రక్తపు గాయాలు.. ఎగిసిపడే మంటలతో యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. చివరకు పోలీస్ బలగాలు భారీగా తరలివచ్చి లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి0ది.
Comments
Please login to add a commentAdd a comment