High alet
-
అమెరికాలో కరోనా టెన్షన్.. అక్కడ హై అలర్ట్
కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామన్న కొన్ని దేశాల్లో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మొన్నటి వరకు చైనాలో కరోనా కొత్త వేరియంట్లు విజృంభించగా.. నార్త్ కొరియా సైతం కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టించింది. న్యూయార్క్ సిటీలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో న్యూయర్ పెద్ద నగరం కావడంతో జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ సిటీలో హై అలర్ట్ విధించింది. దీంతో, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు, హై అలర్ట్ జారీ చేయడంపై న్యూయార్క్ సిటీ హెల్త్ కమిషనర్ డాక్టర్ అశ్విన్ వాసన్ మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండాలంటే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మిత్రులు..బంధువులు, తోటి ఉద్యోగులకు వైరస్ సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో ఏడు రోజుల సగటు పాజిటివ్ రేటు 5.18 శాతానికి పెరిగినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ నుంచి అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇది కూడా చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఊహించని బిగ్ షాక్ -
ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్
ఆజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా రాజకీయం.. బెదిరింపులతో ముంబై మహానగరం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మసీద్‌లపై లౌడ్‌స్పీకర్ల నుంచి ఆజాన్ వినిపిస్తే.. ప్రతిగా హనుమాన్ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్ థాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మసీద్‌లపై లౌడ్స్పీకర్లు తొలగించాలంటూ మే 3వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించాడాయన. ఆజాన్ శబ్ధ కాలుష్యానికి కారణం అవుతుందనేది ఆయన వాదన. ఈ మేరకు ఆయన విధించిన గడువు ముగియడంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదిలా ఉండగా.. ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాచోట్ల ఆజాన్ టైంలో స్పీకర్లు స్వచ్ఛందంగా బంద్ చేశారు. మసీదు ట్రస్టీలతో సమావేశాలు నిర్వహించిన పోలీసులు.. ఉదయం ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను వాళ్లకు వివరించారు. దీంతో కళ్యాణ్ తో పాటు చాలా ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు మూగబోయాయి. ఈ క్రమంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మసీదుల దగ్గరకు వెళ్లి.. లౌడ్స్పీకర్లు బంద్ కావడం గమనించి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగంతో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారంటూ రాజ్‌థాక్రేపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందించిన పోలీసులు.. బుధవారం ఉదయం రాజ్‌థాక్రే ఇంటి వద్ద భారీగా మోహరించారు. థాక్రే వర్సెస్ థాక్రే మహారాష్ట్రలో స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. థాక్రే కుటుంబంలో రాజకీయ వైరం లౌడ్ స్పీకర్ల వ్యవహారంతో ముదురుతోంది. అధికార పార్టీ శివసేన, ఎంఎన్ఎస్ను బీజేపీ బీ టీంగా అభివర్ణిస్తోంది. హిందుత్వ ఓటు బ్యాంక్‌తో సేన ఓట్లను ఎంఎన్ఎస్ ద్వారా చీల్చే యత్నం చేస్తోందంటూ బీజేపీపై మండిపడుతోంది. చదవండి: 14 ఏళ్ల కిందటి కేసు.. రాజ్‌థాక్రేపై నాన్ బెయిలబుల్ వారెంట్ -
‘ఆ రెండు విమానాలను లండన్ వెళ్లనివ్వం’
న్యూఢిల్లీ: ఉగ్ర ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అలెర్ట్ విధించారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ విషయం గురించి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అనే తీవ్రవాద గ్రూపునకు చెందిన గురుపత్వంత్ సింగ్ పన్ను నవంబరు 5న తీవ్రవాద దాడికి పాల్పడే అవకాశం ఉందని బెదిరింపు కాల్స్ చేశాడు. ఎయిర్ ఇండియా విమానాలను లండన్‌కు చేరకుండా అడ్డుకుంటామని చెప్పాడు’’అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు(నవంబరు 1-4) జరిగి 36 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఈ మేరకు ఖలిస్తాన్ తీవ్రవాదులు బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. (చదవండి: ప్రేయసి సోదరుడిని హతమార్చిన యూట్యూబర్) 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటన... మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో దేశ రాజధానిలో జరిగిన అల్లర్లలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. 1984 నాటి ఈ కేసులోని నిందితుల్లో యశ్పాల్ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ రెండేళ్ల క్రితం ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. -
గురుగ్రామ్‌పై మిడతల దండు దాడి
గురుగ్రామ్/న్యూఢిల్లీ: దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించిన రాకాసిమిడతల గుంపులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దు దాకా చేరాయి. ఢిల్లీలోకి ఇంకా ప్రవేశించలేదని అధికారులు చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు వైపు పయనమైన మిడతల దండు శనివారం ఉదయం 11.30 గంటలకు గురుగ్రామ్‌లోకి ప్రవేశించిందని హరియాణా వ్యవసాయ శాఖలో మిడతల హెచ్చరిక విభాగం అధికారి కేఎల్ గుర్జార్ తెలిపారు. ప్రస్తుతం హరియాణాలోని పాల్వాల్ వైపు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పంటలను భోంచేసే ఈ మిడతలు ఈ ఏడాది మే నెలలో ఆఫ్రికా ఎడారుల నుంచి భారత్‌లోకి అడుగుపెట్టాయి. తొలుత రాజస్తాన్‌లో, తర్వాత పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించాయి. ఢిల్లీలో హై అలర్ట్ మిడతల దండు ఢిల్లీ సరిహద్దు దాకా రావడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో శనివారం హైఅలర్ట్ ప్రకటించింది. మిడతలు దండెత్తకుండా చెట్లపై రసాయనాలు, పురుగు మందులు చల్లాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వేప ఆకులను మండిస్తే పొగకు మిడతలు పారిపోతాయని వెల్లడించింది. -
భారత్‌లోకి ఉగ్ర మూకలు?
భుజ్(గుజరాత్)/కోయంబత్తూరు: కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆ దేశం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో గుజరాత్ తీరం కచ్ జిల్లాలోని కాండ్లా, ముంద్రా పోర్టులతోపాటు కీలక సంస్థల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోయంబత్తూర్‌లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. పాక్ కమాండోలు సముద్రం మీదుగా భారత్‌లోకి ప్రవేశించి మత విద్వేషాలు సృష్టించడంతోపాటు నీటిలో ఉండి దాడులకు తెగబడే అవకాశాలున్నాయంటూ భారత నేవీ హెచ్చరికలు పంపిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. కచ్ తీరంలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ముంద్రా పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఇది ఒకటి కాగా, ప్రభుత్వరంగ కాండ్లా నౌకాశ్రయం ద్వారా పెద్ద మొత్తంలో సరుకు రవాణా జరుగుతుంది. అరేబియా సముద్ర తీరంలోని ఈ రెండు పోర్టులు పాకిస్తాన్‌కు చేరువలో ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో జామ్‌నగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద రిలయన్స్ చమురుశుద్ధి కర్మాగారం, వడినార్ వద్ద రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ ఆయిల్ రిఫైనరీలున్నాయి. ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కచ్ జిల్లాలోని కాండ్లా పోర్టుతోపాటు కీలక సంస్థల వద్ద భద్రతను భారీగా పెంచాం’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బోర్డర్ రేంజ్) డీబీ వఘేలా తెలిపారు. పోలీసులు, మెరైన్ బలగాలు, ఇతర భద్రతా సంస్థలు ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశాయి. తీరప్రాంత భద్రతా చర్యలను పటిష్టం చేశామని, ఉగ్రవాదులు పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నయినా తిప్పికొట్టేందుకు బలగాలను అప్రమత్తం చేశామని డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ మురళీధర్ పవార్ తెలిపారు. ఐఎస్ లింకులపై ఎన్ఐఏ తనిఖీలు ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై కూపీ లాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం కోయంబత్తూరులో విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఎర్నాకులంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జారీ చేసిన వారంట్ల మేరకు నిందితుల సంబంధీకులకు చెందిన ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశాం. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, 5 సెల్ఫోన్లు, 4 సిమ్ కార్డులు, 1 మెమరీ కార్డు, 8 సీడీలు/డీవీడీలు, అభ్యంతరకర పత్రాలు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎస్ కార్యాకలాపాలకు సంబంధించిన సమాచారంపై కొందరిని ప్రశ్నించామని తెలిపింది. కాగా, గత వారం రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన లష్కర్–ఇ– తైబా ఉగ్ర సంస్థ సభ్యులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెడదారి పట్టిన యువతను సోషల్ మీడియా ద్వారా కొందరు వ్యక్తులు ఐఎస్ ఉగ్ర సంస్థలోకి ఆకర్షించి కేరళ, తమిళనాడుల్లో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ మేలో కేసులు నమోదు చేసింది. -
సైన్యం.. అప్రమత్తం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాకిస్తాన్ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని సైనికవర్గాలు తెలిపాయి. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కశ్మీర్ లోయలో పాక్ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ సమయంలోనూ పరిస్థితిని చేజారనివ్వమని ఓ సీనియర్ మిలిటరీ అధికారి తెలిపారు. 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకుడు బుర్హాన్ వానిని హతం చేసినపుడు కశ్మీర్‌లోయలో దాదాపు నాలుగు నెలలకుపైనే అస్థిరత నెలకొంది. అలాంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. వైమానిక దళం కూడా అక్కడే ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. వారిని అదుపు చేయాలి: కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భద్రతా దళాలను మరింత అప్రమత్తతో ఉంచాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సాంఘిక వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వాటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మత పరమైన సున్నిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.’ అని పేర్కొంది. -
కశ్మీర్ హై అలర్ట్!
కశ్మీరం వేడెక్కుతోంది. లోయలో భద్రతా బలగాల పెంపుపై ఊహాగానాలు కొనసాగుతుండగానే.. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తూ శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాత్రపై పాక్ ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రీకులు, ఇతర పర్యాటకులు తక్షణమే తమ పర్యటనను ముగించుకుని కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. యాత్ర మార్గంలో పాకిస్తాన్లో తయారైన మందుపాతర, అమెరికా మేడ్ స్నైపర్ రైఫిల్ లభించాయని భారత ఆర్మీ ప్రకటించింది. యాత్రపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని కచ్చితమైన నిఘా సమాచారం వచ్చినట్లు పేర్కొంది. కశ్మీర్‌కు భారీగా బలగాలను పంపిస్తున్నారన్న వార్తలు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదనీ, అంతర్గత భద్రత, సిబ్బంది మార్పిడి కోసం 10 వేల మందిని పంపేందుకు గత వారమే ఆదేశాలిచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి ప్రజల కన్నా.. భూభాగమే ముఖ్యమని తేలిందని పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. శ్రీనగర్: అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అనూహ్య ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ శుక్రవారం హెచ్చరించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. దీంతో స్థానిక కశ్మీర్ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితులు హింసాత్మకంగా మారే అవకాశం ఉందంటూ అక్కడి ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు దుకాణాల ముందు క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన నడుస్తుండటం తెలిసిందే. జూలై 1న మొదలైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 15న ముగియాల్సి ఉంది. కాగా, యాత్ర సాగే మార్గాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను సైన్యం గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుందని ఆర్మీ 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ చెప్పారు. అమర్నాథ్ యాత్ర సాగే బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో భద్రతా దళాలు సోదాలు నిర్వహించగా, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, అమెరికాలో తయారైన ఎం–24 (స్నైపర్) తుపాకి లభించాయని వెల్లడించారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశామని ఆయన తెలిపారు. యాత్రికులపై దాడి చేయాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని ధిల్లాన్ వెల్లడించారు. గత కొన్ని రోజుల్లో భద్రతా దళాలు జరిపిన సోదాల్లో, పాకిస్తాన్‌లోని ఆయుధ కర్మాగారంలో తయారైన మందుపాతర, భారీ స్థాయిలో ఇతర ఆయుధాలు దొరికాయని ధిల్లాన్ తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్తాన్, ఆ దేశ ఆర్మీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్‌తో కలిసి ధిల్లాన్ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘గత మూడు నాలుగు రోజుల నుంచి మాకు నిఘా వర్గాల ద్వారా కచ్చితమైన సమాచారం వస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ నేతృత్వం, సాయంతోనే ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని చెప్పారు. మరోవైపు అవసరమైతే కశ్మీర్ విమానాశ్రయం నుంచి అదనపు విమానాలను నడపడానికి సిద్ధంగా ఉండాలని విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. ఇక కేంద్రం సిద్ధమైంది: మెహబూబా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ ప్రభుత్వం కశ్మీర్‌పై సైనిక శక్తిని ఉపయోగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించే విషయంలో కీలక నిర్ణయం త్వరలోనే రావొచ్చన్న వార్తల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ‘ఎట్టకేలకు కేంద్రం సిద్ధమైనట్లుగా ఉంది. ప్రజల కన్నా భూభాగమే ముఖ్యమని ఇండియా నిర్ణయించుకున్నట్లుంది. మీరు (ప్రభుత్వం) దేశంలోని ముస్లిం ఆధిక్య రాష్ట్రం ప్రేమను గెలుచుకోవడంలో విఫలమయ్యారు. మతం ఆధారంగా దేశ విభజనను వ్యతిరేకించి లౌకిక రాజ్యమైన భారత్‌తో కలిసుండాలని నిర్ణయించుకున్న రాష్ట్రమిది. కానీ ఇప్పుడు ఇండియా సిద్ధమైనట్లుగా ఉంది. జమ్మూ కశ్మీర్ ప్రజలను దోపిడీ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైనట్లుగా కనిపిస్తోంది’ అని ఆరోపించారు. అలాగే మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా అంశాన్ని కదిలించవద్దని కేంద్రాన్ని కోరింది. భద్రత కోసమే బలగాలు: కేంద్రం కశ్మీర్లో అంతర్గత భద్రతా పరిస్థితుల దృష్ట్యానే పారా మిలిటరీ బలగాలను కశ్మీర్‌కు పంపుతున్నట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదని హోం శాఖ స్పష్టం చేసింది. కశ్మీర్‌కు 10 వేల సిబ్బందిని కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు తరలిస్తోందనీ, వారం క్రితమే ఇందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయని హోం శాఖ వర్గాలు చెప్పాయి. భయం రేకెత్తిస్తున్నారు: ఎన్సీ, పీడీపీ యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్ లోయలో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందనీ, ఇలాంటి పరిస్థితిని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని జమ్మూ కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) మండిపడ్డాయి. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్ చేస్తూ, ‘ఉన్నపళంగా వెళ్లిపోవాలని యాత్రికులు, పర్యాటకులకు ప్రభుత్వమే చెబితే వారిలో భయం కలగదా? వారంతా తక్షణం అన్నీ సర్దు కుని వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు విమానాశ్రయాలు, రహదారులు పూర్తిగా జనంతో కిక్కిరిసిపోతాయి’ అని అన్నారు. కశ్మీర్‌కు రాజ్యాంగం ఇస్తున్న హక్కులను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరింది. మాజీ ప్రధాని మన్మోహన్æ అధ్యక్షతన జమ్మూ కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ ఓ భేటీ నిర్వహించిన అనంతరం కేంద్రానికి ఈ విజ్ఞప్తి చేసింది. కశ్మీర్లో భయం భయం.. ఉగ్రవాదులు దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నందున అమర్నాథ్ యాత్రికులు, పర్యాటకులు వెంటనే కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు సరకులు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసి ముందస్తుగా భద్రపరచుకునేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఏటీఎంలు, పెట్రోల్ బంకుల ముందు భారీ వరుసల్లో నిలబడుతున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించే విషయమై కీలక నిర్ణయం రానుందనీ, ఆ కారణంగా గొడవలు జరిగి శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పుకార్లు వస్తున్నాయి. దీంతో సరకులను ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకునేందుకు స్థానికులు క్యూలు కట్టారు. పోలీసు సోదాల్లో దొరికిన అమెరికా తయారీ అత్యాధునిక రైఫిల్ -
కశ్మీర్లో అలజడికి ఉగ్ర కుట్ర
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమైనట్లు పాకిస్తాన్ హెచ్చరించింది. పుల్వామా జిల్లాలోని అవంతిపొరలో ఉగ్రవాదులు దాడికి ప్రణాళిక రచించినట్లు తమ నిఘావర్గాలు గుర్తించాయని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడి తరహాలోనే కారులో అత్యాధునిక పేలుడు పదార్థాలను(ఐఈడీ)లను పేర్చుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయబోతున్నారని పేర్కొంది. షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు కొన్నిరోజుల ముందు ఈ సమాచారాన్ని భారత్, అమెరికాలతో పంచుకున్నట్లు పాక్ చెప్పింది. ఉగ్రవాదం విషయంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన విమర్శలు, నిందలను తప్పించుకునేందుకే పాక్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ హెచ్చరికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలన్నీ హైఅలర్ట్‌గా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది జకీర్మూసాను భద్రతాబలగాలు కాల్చి చంపినందుకు ప్రతీకారంగానే ఈ దాడికి ఉగ్రమూకలు కుట్ర పన్నాయని వ్యాఖ్యానించారు. పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు, ఓ పోలీస్ అధికారి అమరులయ్యారు. -
సరిహద్దుల్లో టెన్షన్ !
సాక్షి, కొత్తగూడెం: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా గత 5నెలల కాలం లో మరింతగా కోలుకోలేని దెబ్బ తగిలింది. గత మార్చి 2న సరిహద్దులోని బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్ మొదలు ఇప్పటివరకు సరిహద్దు జిల్లాల్లో జరిగిన వరుస ఘటనల్లో సుమారు 70 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. వారి దాడుల్లో 30 మందికి పైగా హతమయ్యారు. ఇందులో భద్రతా సిబ్బం దితో పాటు కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇన్ఫార్మర్లు ఉన్నారు. మావోలకు, భద్రతా బలగాలకు మధ్య ఎడతెరిపి లేని పోరు నడుస్తుండడంతో ఏజెన్సీ ప్రాంతాలు తుపాకుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడు లు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తంగా మారింది. గిరిజన పల్లెల్లో ఎప్పుడేం జరుగుతుం దో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు వచ్చాయి. గత నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ వారోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మహబూబాబాద్, మహా రాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, బస్తర్, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, విశాఖపట్నం, ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్ జిల్లాల్లో 5 రాష్ట్రాల పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు సరిహద్దుల్లోని చర్ల, వెంకటాపురం మండలాల్లో శబరి ఏరియా కమిటీ పేరుతో కరపత్రాలు విడుద ల చేస్తున్నారు. తాజాగా ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా ఇర్మానార్ అడవుల్లో మావోయిస్టులకు డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డులు, ఎస్టీఎఫ్ బలగాలకు మధ్య సుమారు 20 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఉద్యమ చరిత్రలోనే భారీ నష్టం.. మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా పార్టీకి ఈ సీజన్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. మార్చి 2న బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భద్రతా బలగాలు, మావోయిస్టుల దాడులు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తమైంది. గత ఏప్రిల్ నెల చివరి వారంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఏకంగా 40 మంది మావోయిస్టులు మృతి చెందారు. తరువాత ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది, సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ నెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చర్ల ఏరియా కమాండర్ అరుణ్ మృతి చెందాడు. తడపలగుట్ట ఎన్కౌంటర్ తరువాత ఇప్పటివరకు మావోయిస్టులు ప్రతీకారంగా భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, సీఆర్పీఎఫ్ జవాన్లు సహా ఇతరులను సుమారు 30 మందిని హతమార్చారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అయితే మావోయిస్టులపై పోరును కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దండకారణ్యంలో మావోయిస్టులపై పోరాడేందుకు భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను దింపింది. బెటాలియన్లలోని జవాన్లు 90శాతం పైగా 30 ఏళ్లలోపు యువకులే. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా గత ఏప్రిల్ 14న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బీజాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో పర్యటించారు. గ్రామస్వరాజ్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. మావోయిస్టులు జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపే దండకారణ్యంలో ప్రధాని పర్యటించడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. సత్యనారాయణపురం వద్ద కల్వర్టు పేల్చివేత గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా గత మే నెల 4వ తేదీన ఏజెన్సీలో బంద్ నిర్వహించిన మావోయిస్టులు చర్ల మండలం సత్యనారాయణపురం–ఆర్ కొత్తగూడెం మధ్య కల్వర్టు పేల్చివేశారు. అక్కడికి అర కిలోమీటరు దూరం లో సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంప్ ఉండగా కల్వర్టు పేల్చి మావోలు సవాల్ విసిరారు. మే 11న చర్ల బస్టాండ్ వద్ద ప్రెషర్ బాంబు విడిచి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు బాంబును గుర్తించి చెరువులో నిర్వీర్యం చేశారు. -
దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు హై అలర్ట్
న్యూఢిల్లీ : దేశంలోని అన్ని విమానాశ్రయాలకు బాంబు దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. కారు బాంబులతో తీవ్రవాదులు విరుచుకుపడే అవకాశం ఉందంటూ దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలకు పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలపై దాడులకు పాల్పడతామని ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ ముంబయి కమిషనర్‌కు లేఖ రాసింది. భారత్ లోని ముఖ్యప్రాంతాల్లో, మెట్రో నగరాల్లో బాంబులతో విధ్వంసం సృష్టిస్తామంటూ ఆ లేఖలో పేర్కొంది. ఇండియన్ ముజాహిద్దీన్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అన్ని విమానాశ్రయల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో అనువణువూ సోదాలు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయ పరిసరాల్లో రోజుల కొద్దీ పార్క్ చేసిన వాహనాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్ట్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భద్రతా ఏర్పట్లను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ష్కరే తోయిబా కు చెందిన ఒక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అరెస్టు చేసిన ఇద్దరు యువకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. లష్కరే తోయిబాలో యువత చేరేలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని భావిస్తున్న అబ్దుల్ సుభాన్ ను అరెస్టు చేశారు. ఢిల్లీలోని సరాయి కాలేఖాన్ బస్ స్టాండ్ వద్ద వలపన్ని పట్టుకున్నారు.