న్యూఢిల్లీ: ఉగ్ర ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అలెర్ట్ విధించారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ విషయం గురించి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అనే తీవ్రవాద గ్రూపునకు చెందిన గురుపత్‌వంత్ సింగ్ పన్ను నవంబరు 5న తీవ్రవాద దాడికి పాల్పడే అవకాశం ఉందని బెదిరింపు కాల్స్ చేశాడు. ఎయిర్ ఇండియా విమానాలను లండన్‌కు చేరకుండా అడ్డుకుంటామని చెప్పాడు’’అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు(నవంబరు 1-4) జరిగి 36 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఈ మేరకు ఖలిస్తాన్ తీవ్రవాదులు బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. (చదవండి: ప్రేయసి సోదరుడిని హతమార్చిన యూట్యూబర్)
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటన...
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో దేశ రాజధానిలో జరిగిన అల్లర్లలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. 1984 నాటి ఈ కేసులోని నిందితుల్లో యశ్‌పాల్ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ రెండేళ్ల క్రితం ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment