న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమైనట్లు పాకిస్తాన్ హెచ్చరించింది. పుల్వామా జిల్లాలోని అవంతిపొరలో ఉగ్రవాదులు దాడికి ప్రణాళిక రచించినట్లు తమ నిఘావర్గాలు గుర్తించాయని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడి తరహాలోనే కారులో అత్యాధునిక పేలుడు పదార్థాలను(ఐఈడీ)లను పేర్చుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయబోతున్నారని పేర్కొంది. షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో)కు కొన్నిరోజుల ముందు ఈ సమాచారాన్ని భారత్, అమెరికాలతో పంచుకున్నట్లు పాక్ చెప్పింది.
ఉగ్రవాదం విషయంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన విమర్శలు, నిందలను తప్పించుకునేందుకే పాక్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ హెచ్చరికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలన్నీ హైఅలర్ట్‌గా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది జకీర్‌మూసాను భద్రతాబలగాలు కాల్చి చంపినందుకు ప్రతీకారంగానే ఈ దాడికి ఉగ్రమూకలు కుట్ర పన్నాయని వ్యాఖ్యానించారు. పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు, ఓ పోలీస్ అధికారి అమరులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment