IED blasts
-
బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై దాడి
న్యూఢిల్లీ/బలూర్ఘాట్(పశ్చిమబెంగాల్): 2022 పేలుడు ఘటనలో ఇద్దరు కీలక కుట్రధారులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు జరిపిన దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు ఢిల్లీలో మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ‘బెంగాల్‌లోని భూపతినగర్ 2022 డిసెంబర్లో చోటుచేసుకున్న పేలుడు కేసులో కీలక పురోగతి సాధించాం. ముగ్గురి మృతికి కారణమైన అప్పటి ఘటనకు కీలక కుట్రదారులైన బలాయి చరణ మైతీ, మనోబ్రత జనాల కోసం తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో సోదాలు జరిపాం. స్థానికుల తీవ్ర ప్రతిఘటన నడుమ వారిద్దరినీ అరెస్ట్ చేశాం. స్థానికుల దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏకి చెందిన ఒక వాహనం ధ్వంసమైంది. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’అని ఆయన వివరించారు. మైతీ, జనా అనే వారు స్థానికంగా భయోత్పాతం సృష్టించేందుకు నాటుబాంబులు తయారు చేసి, పేల్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర పోలీసులు అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, పేలుడు పదార్థాల చట్టాన్ని అందులో చేర్చలేదు. దీనిపై దాఖలైన రిట్ పిటిషన్ మేరకు కలకత్తా హైకోర్టు కేసును ఎన్ఐఏకి అప్పగించింది. సీరియస్‌గానే తీసుకుంటాం: గవర్నర్ ఎన్ఐఏ అధికారులపై దాడి అత్యంత తీవ్రమైన అంశమని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. దీనిని అంతే తీవ్రంగా ఎదుర్కొంటామన్నారు. ‘దర్యాప్తు విభాగాల అధికారులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు ఎవరికీ మంచిది కాదు. ఇటువంటి గూండాయిజాన్ని అనుమతించబోం. కఠినంగా వ్యవహరిస్తాం’అని మీడియాతో అన్నారు. మరోదారి లేకే గ్రామస్తుల దాడి: సీఎం మమతా బెనర్జీ భూపతిపూర్‌లో ఎన్ఐఐ అధికారులపై స్థానికుల దాడిని సీఎం మమత సమర్థించారు. శనివారం వేకువజామున ఒక్కసారిగా ఇళ్లలోకి దూరి దాడి చేయడంతోనే స్థానిక మహిళలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడికి దిగారని ఆమె అన్నారు. 2022నాటి ఘటనను ఆమె బాణసంచా పేలుడుగా అభివర్ణించారు. -
నెత్తురు చిందిన బస్తర్
చెప్పుకోదగ్గ హింసాత్మక ఘటనలు లేకుండా కనీసం రెండేళ్లనుంచి ప్రశాంతంగా కనబడుతున్న ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం నక్సలైట్లు ఐఈడీ పేల్చి మినీ బస్సులో వెళ్తున్న పదిమంది జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పోలీసులనూ, ఒక డ్రైవర్‌నూ హతమార్చిన ఉదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పల్నార్–అరణ్పూర్ మధ్యలో ఇటీవలే నిర్మించిన రహ దారిపై ఈ ఐఈడీని అమర్చారనీ, అది కూడా రెండు మూడురోజుల క్రితమేననీ వస్తున్న కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం తుపాకులు పట్టామని చెబుతున్న మావోయిస్టుల్లోగానీ, వారిని ఎదుర్కొంటున్న భద్రతా బలగాల తీరులోగానీ ఏ మార్పూ రాలేదని తాజా ఘటన చెబుతోంది. ఒకప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభావవంతంగా ఉన్న వామపక్ష తీవ్ర వాదం చాన్నాళ్లుగా తగ్గుముఖం పట్టింది. 2000కు ముందు పది రాష్ట్రాల్లోని 200 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తే ఆ సంఖ్య 2021 నాటికి 41కి పడిపోయిందంటున్నారు. ఇప్పుడది 25 జిల్లాలకు మాత్రమే పరిమితమైందనీ, గత ఎనిమిదేళ్లలో నక్సల్ సంబంధిత హింసాత్మక ఘటనలు 55 శాతం తగ్గాయనీ, మరణాలు కూడా 63 శాతం తగ్గాయనీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నాలుగు నెలల క్రితం విడుదల చేసిన నివేదిక తెలిపింది. హింసను కట్టడి చేయ టానికి అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న పర్యవ సానంగా మావోయిస్టుల లొంగుబాట్లు కూడా అధికంగానే ఉన్నాయని ఆ నివేదిక వివరించింది. అయితే ఇలాంటి విజయాలే పోలీసు బలగాల్లో ఒక రకమైన నిర్లక్ష్యానికి దారితీశాయా అన్నది ఆలోచించుకోవాలి. తాజా ఉదంతాన్నే తీసుకుంటే అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావో యిస్టుల కదలికలున్నాయని అందిన సమాచారంతో డీఆర్జీ పోలీసులు అక్కడికి వెళ్లారు. వెళ్లేముందూ, తిరిగొచ్చేటప్పుడూ ఒకే మార్గాన్ని ఉపయోగించకూడదన్న నిబంధన ఉంది. ఒకవేళ తప్పని సరైతే రెండుసార్లూ బలగాల కన్నా ముందు ఒక ప్రత్యేక టీం వెళ్లి ఆ దారిలో మందుపాతరలు, ఇతరత్రా బాంబులు లేవని నిర్ధారించాలి. పైగా ఈమధ్యకాలంలో మావోయిస్టుల వైపునుంచి ఐఈడీల వినియోగం బాగా ఎక్కువైందని తెలుస్తూనే ఉంది. గత నాలుగు నెలల్లో ఐఈడీలు గుర్తించి వెలికితీసిన ఉదంతాలు 34 వరకూ ఉన్నాయని వార్తలు వెలువడ్డాయి. గతంలో భారీయెత్తున ఆది వాసీలను సమీకరించి పోలీసు బలగాలపై విరుచుకుపడిన మావోయిస్టులు ఇటీవల తక్కువమందితో బృందాలను ఏర్పాటుచేసి దాడులకు దిగుతున్నారని ఒక మీడియా కథనం తెలిపింది. పైగా లోగడ కేవలం అయిదారు కేజీల ఐఈడీని పేలుళ్లకు వినియోగిస్తే ఇప్పుడది 30, 40 కేజీలవరకూ ఉంటోంది. అందువల్ల ప్రాణనష్టం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించి అయినా అరణ్పూర్ వెళ్లిన డీఆర్జీ పోలీసులు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. ఒకప్పుడు లొంగిపోయిన ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రైవేటు దళాలను ఏర్పాటుచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని రద్దుచేయక తప్పలేదు. ఆ తర్వాతే ఛత్తీస్‌గఢ్ పోలీసు విభాగంలో డీఆర్జీ పేరుతో ప్రత్యేక దళం ఏర్పాటయింది. ఇందులో కూడా అత్యధికులు లొంగిపోయిన మావోయిస్టులు. వారంతా ఆదివాసీలు. కనుక మావోయిస్టులకు వారిపై గురి ఉంటుంది. అటువంటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఘటన జరిగిన ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టులు బలంగా ఉండేవారనీ, ఇప్పుడు వారి ప్రభావం పూర్తిగా పోయిందనీ మీడియా కథనాలు చెబుతున్నాయి. డీఆర్జీ పోలీసుల్లో నిర్లక్ష్యానికి అది కూడా కారణమైవుండొచ్చు. ఒకప్పుడు మధ్య, తూర్పు భారత ప్రాంతాల్లో ఎంతో బలంగా ఉన్న తాము ఎందువల్ల బలహీ నపడవలసి వచ్చిందన్న ఆత్మవిమర్శ మావోయిస్టుల్లో కొరవడిందని తాజా ఉదంతం చెబుతోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడటం వల్ల ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తాయే తప్ప దానివల్ల కలిగే మార్పేమీ ఉండదని పదే పదే రుజువవుతోంది. మావోయిస్టులు ఏదో ఒక చర్యకు పాల్పడగానే సమీప ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలపై పోలీసులు విరుచుకుపడటం, అమాయ కులు సైతం బాధితులుగా మారడం చాన్నాళ్లుగా కనబడుతూనే ఉంది. అరెస్టులు, కేసులు, ఏళ్ల తరబడి జైళ్లపాలు కావటం పర్యవసానంగా ఆదివాసీ కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. పోషించేవారు లేక ఎన్నో కుటుంబాలు చెప్పనలవికాని ఇబ్బందులు పడుతున్నాయి. గతంతో పోలిస్తే మావోయిస్టుల ప్రభావంలో ఉన్న ప్రాంతాలు తగ్గిపోవడానికి ఇదొక ప్రధాన కారణం. కనీసం ఈ పరిణామమైనా తమ హింసాత్మక చర్యల్లోని నిరర్థకతపై పునరాలోచన కలిగిస్తే బాగుండేది. కానీ ఆ మాదిరి మార్పు రాలేదని ఈ ఉదంతం నిరూపించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభి ప్రాయాలను ప్రకటించటానికీ, ప్రభుత్వ విధానాల్లో లోపాలున్నాయనుకున్నప్పుడు వాటికి వ్యతి రేకంగా ప్రజానీకాన్ని కూడగట్టడానికీ ఎప్పుడూ అవకాశాలుంటాయి. అలాంటి ఉద్యమాలను ప్రభుత్వాలు అణచివేయటానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటన కూడా అదే స్థాయిలో వస్తున్నది. సాగు చట్టాలపై ఏడాదిపైగా సాగిన రైతు ఉద్యమాన్ని నయానా భయానా నియంత్రించాలనుకున్న కేంద్రం చివరకు వారి డిమాండ్లకు తలొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకోకతప్పలేదు. వీటన్నిటినీ మావోయిస్టులు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించే ప్రయత్నం చేయాలి. తమ హింసాత్మక చర్యలవల్ల సాధించేదేమీ లేకపోగా ఆదివాసులే కష్టనష్టాలు అనుభవించాల్సి వస్తున్నదని గుర్తించాలి. -
సైన్యం.. అప్రమత్తం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాకిస్తాన్ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని సైనికవర్గాలు తెలిపాయి. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కశ్మీర్ లోయలో పాక్ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ సమయంలోనూ పరిస్థితిని చేజారనివ్వమని ఓ సీనియర్ మిలిటరీ అధికారి తెలిపారు. 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకుడు బుర్హాన్ వానిని హతం చేసినపుడు కశ్మీర్‌లోయలో దాదాపు నాలుగు నెలలకుపైనే అస్థిరత నెలకొంది. అలాంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. వైమానిక దళం కూడా అక్కడే ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. వారిని అదుపు చేయాలి: కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భద్రతా దళాలను మరింత అప్రమత్తతో ఉంచాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సాంఘిక వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వాటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మత పరమైన సున్నిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.’ అని పేర్కొంది. -
కశ్మీర్లో అలజడికి ఉగ్ర కుట్ర
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమైనట్లు పాకిస్తాన్ హెచ్చరించింది. పుల్వామా జిల్లాలోని అవంతిపొరలో ఉగ్రవాదులు దాడికి ప్రణాళిక రచించినట్లు తమ నిఘావర్గాలు గుర్తించాయని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడి తరహాలోనే కారులో అత్యాధునిక పేలుడు పదార్థాలను(ఐఈడీ)లను పేర్చుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయబోతున్నారని పేర్కొంది. షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు కొన్నిరోజుల ముందు ఈ సమాచారాన్ని భారత్, అమెరికాలతో పంచుకున్నట్లు పాక్ చెప్పింది. ఉగ్రవాదం విషయంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన విమర్శలు, నిందలను తప్పించుకునేందుకే పాక్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ హెచ్చరికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలన్నీ హైఅలర్ట్‌గా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది జకీర్మూసాను భద్రతాబలగాలు కాల్చి చంపినందుకు ప్రతీకారంగానే ఈ దాడికి ఉగ్రమూకలు కుట్ర పన్నాయని వ్యాఖ్యానించారు. పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు, ఓ పోలీస్ అధికారి అమరులయ్యారు. -
జార్ఖండ్‌లో మావోయిస్టుల మెరుపు దాడి
-
గడ్చిరొలి: భద్రతబలగాలు లక్ష్యంగా బాంబు పేలుడు
-
విషాదం..కూతురుని చూడకుండానే..
జైపూర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. వీరిలో ఓ జవాను తన రెండు నెలల కూతురిని పుట్టినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. రాజస్తాన్‌లోని జైపూర్ సమీపంలోని అమర్‌సర్‌లోని గోవింద్‌పురా గ్రామానికి చెందిన రోహితేష్ లంబా(27) సీఆర్పీఎఫ్ జవాన్‌గా సేవలందిస్తున్నారు. రోహితేష్ లంబా 25 ఏళ్లకే సీఆర్పీఎఫ్లో ఉద్యోగం రాగా, మరుసటి సంవత్సరం వివాహం చేసుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్లో రోహితేష్ లంబా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఉద్యోగరీత్యా చిన్నారిని చూడడానికి వీలు దొరక్కపోవడంతో కన్నకూతరును చూడలేకపోయారు. బిడ్డను చూసేందుకు సెలవుపెట్టి గోవింద్‌పురాకు త్వరలోనే వెళ్లాలనుకున్నారు. కన్న కూతరును చూడడానికి వస్తాడనుకున్న భర్త ఉగ్రవాదుల దాడిలో మరణించాడన్న వార్తను భార్య వినాల్సి వచ్చింది. రోహితేష్ లంబా వీరమరణంతో గోవింద్‌పురాలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. -
ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు జరిగింది చాలని, వెంటనే వేర్పాటు వాదులు, పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై తీవ్రంగా కలత చెందిన గంభీర్.. ఆవేశంగా ఇక మాటల్లేవని, యుద్ధమే ఈ సమస్యకు పరిష్కారమని ట్విటర్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. (చదవండి: ఉగ్ర మారణహోమం) అయితే ఈ దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. భూగోళంపై ఉగ్రవాదానికి చోటు లేదని, ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఈ దాడిని ఖండిస్తూ అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సురేశ్ రైనాలు ఈ దాడిని ఖండిస్తూ ట్విటర్ వైదికగా వీర జవాన్లకు నివాళులర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.(చదవండి: వైరల్ వీడియో : ‘అక్కడ శవాలు పడున్నాయి’) భారత క్రికెటర్ల ట్వీట్స్.. ఇక జరిగింది చాలు. వెంటనే వేర్పాటువాదులు, పాకిస్తాన్‌తో మాట్లాడనివ్వండి. కానీ ఈ సంభాషణ అనేది గదుల్లో కాకుండా.. యుద్ధ మైదానంలో ఉండాలి. - గౌతం గంభీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం, వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇదో విచారకరమైన వార్త. ఈ దాడిలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. - వీవీఎస్ లక్ష్మణ్ ఈ ఉగ్రదాడి వార్త తీవ్రంగా కలచి వేసింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాను. ఈ దాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - శిఖర్ ధావన్ జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం.. అనేక మంది జవాన్లు ప్రాణాలుకోల్పోవడం వినడానికి చాలా బాధగా ఉంది. ఈ దాడిచేసిన పిరికి పందలకు త్వరలోనే గుణపాఠం కలగాలని ప్రార్థిస్తున్నాను. - మహ్మద్ కైఫ్ ఉగ్రదాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు నా ఆలోచన, ప్రార్థన అంతా వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాల గురించే. -సురేశ్ రైనా సీఆర్పీఎఫ్ జవాన్లపై పిరికిపందలు జరిపిన దాడిలో మన వీర జవాన్లు వీరమరణం పొందడం బాధను కలిగిస్తోంది. ఈ బాధను వర్ణించడానికి పదాలు రావడం లేదు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలి. - వీరేంద్ర సెహ్వాగ్ -
సీఆర్పీఎఫ్ రాకపై సమాచారం లీక్
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు వెళ్లడంపై సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండొచ్చని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జవాన్లలో చాలామంది సెలవులు ముగించుకుని విధుల్లో చేరేందుకు వస్తున్నవారేనని వెల్లడించారు. శ్రీనగర్‌కు వెళ్లే సమయంలో సీఆర్పీఎఫ్ బలగాలు ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్వోపీ)ను పాటించాయో? లేదో? విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో భద్రతాబలగాల కదలికలు జరిగినప్పుడు ఆ విషయం చాలామందికి తెలుస్తుందని పేర్కొన్నారు. వాళ్లలో కొందరు ఉగ్రవాదులకు బలగాల రాకపై సమాచారం అందించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ రహదారిపై గత రెండ్రోజులుగా రాకపోకలు లేకపోవడంతో కాన్వాయ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు బయలుదేరారనీ, దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. -
ఉగ్ర మారణహోమం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను శ్రీనగర్‌లోని 92 బేస్ బదామీగఢ్ ఆర్మీ కంటోన్మెంట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లలో చాలామంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. విధుల్లో మళ్లీ చేరేందుకు వెళుతుండగా.. మళ్లీ విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. వీరి వాహనాలు సూర్యాస్తమయంలోగా 266 కిలోమీటర్ల దూరంలోని శ్రీనగర్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై భద్రతాబలగాల వాహనాలు ఒకదానివెంట మరొకటి వెళుతున్నాయి. రెప్పపాటులో ఉగ్రవాది కారుతో బస్సును ఢీకొట్టాడు. భద్రతాబలగాలు తేరుకునేలోపే తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలానికి ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్ఎస్జీకి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని సాక్ష్యాలు, పేలుడు అవశేషాలను సేకరించారు. ఉగ్రదాడి జరగడంతో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిహార్ పర్యటను రద్దుచేసుకుని వెనుదిరగగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబా భూటాన్ పర్యటన నుంచి అర్ధంతరంగా తిరుగుప్రయాణమయ్యారు. 2016, సెప్టెంబర్ 18న కశ్మీర్లో ఉడీ ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడి తర్వాత భద్రతాబలగాలు భారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఉడీ ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు మూసేయడంతో భారీ కాన్వాయ్ ప్రమాద విషయమై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆర్.ఆర్. భట్నాగర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వాతావరణం బాగోలేకపోవడంతో గత రెండ్రోజులగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ఉగ్రవాదుల ఆత్మాహుతిదాడికి గురైన బస్సులో 39 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వీరంతా సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందినవారని పేర్కొన్నారు. దాడి సందర్భంగా జవాన్ల వాహనాలపై కాల్పులు జరిగాయన్నారు. సాధారణంగా సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో వెయ్యి మంది జవాన్లు మాత్రమే ఉంటారనీ, కానీ గత రెండ్రోజులుగా రహదారి మూతపడటంతో ఒకేసారి భారీ సంఖ్యలో 2,547 మంది జవాన్లు శ్రీనగర్‌కు బయలుదేరారని తెలిపారు. ఈ ఘటనపైకశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఉగ్రదాడి తీవ్రత దృష్ట్యా కశ్మీర్ పోలీసులతోపాటు ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు ఈ విచారణలో పాలుపంచుకుంటారని భట్నాగర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో శాంతిభద్రతలను సమీక్షించేందుకు శుక్రవారం కేంద్ర భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఖండించిన అంతర్జాతీయ సమాజం పుల్వామాలో భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి, అమెరికా, రష్యాతోపాటు, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, చెక్ రిపబ్లిక్, పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఖండించాయి. పుల్వామా దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి కారకులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలతోపాటు భారత ప్రభుత్వం, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్యాగాలు వృథా కావు జమ్మూకశ్మీర్‌లో జవాన్లపై జరిగిన దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. మన భద్రతా బలగాల త్యాగాలు వృథా కావని ఆయన అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ దాడిలో వీరమరణం పొందినవారి కుటుంబాలకు జాతి మొత్తం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన అనంతర పరిస్థితిపై హోం మంత్రి రాజ్‌నాథ్‌తోపాటు అధికారులతో చర్చించానన్నారు. ‘పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి అత్యంత హేయం. పిరికిపందలు పాల్పడిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. సాహసవంతులైన మన భద్రతా బలగాలు చేసిన త్యాగాలు వృథా కావు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉగ్రదాడి తరువాత మంటల్లో చిక్కుకున్న ఆర్మీ వాహనాలు. సైనికుడి మృతదేహాన్ని తరలిస్తున్న తోటి సైనికులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది ఎవరేమన్నారంటే.. ప్రతీకారం తీర్చుకుంటాం పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని హోం మంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. హింసాత్మక చర్యల ద్వారా శాంతికి భగ్నం కలిగించాలనుకునే శక్తుల ఆటలను కట్టించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి జైషే మొహమ్మద్ సంస్థే కారణం. ఇందుకు తగినవిధంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నా. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క జవానుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు. - హోం మంత్రి రాజ్‌నాథ్ ‘కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉగ్ర మూకలపై జరిగే పోరాటంలో జాతి మొత్తం ఐక్యంగా నిలబడుతుంది. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. దుష్ట, ఉగ్ర మూకలపై జరిగే పోరులో జాతి మొత్తం ఒక్కటిగా నిలబడుతుంది. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘బలగాలపై ఉగ్రదాడిపై తీవ్ర వేదనకు గురయ్యా. పిరికిపందల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అమర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజీ ధోరణి అవలంభిస్తోంది. – రాహుల్ గాంధీ ‘కశ్మీర్లో భారత్ బలగాలపై జరిగిన దాడిని అమెరికా దౌత్య కార్యాలయం ఖండిస్తోంది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్ చేసే పోరాటానికి అమెరికా వెన్నంటి ఉంటుంది’ –అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్ ‘అవంతిపొరాలో 30 మంది జవాన్లు అమరులయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ తీవ్రమైన ఉగ్రవాద చర్యను ఖండించడానికి ఏ పదాలూ సరిపోవు. ఈ మూర్ఖత్వపు చర్యలు ఆగిపోయేలోపు ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి?’ –జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ‘కశ్మీర్లో బలగాలపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. ఇది యావత్ దేశానికే విషాద దుర్ఘటన. జవాన్ల కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం చర్యలు తీసుకోవాలి ‘పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాల వేదన తీరనిది. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. వీరుల కుటుంబాలకు కాంగ్రెస్‌తోపాటు దేశం యావత్తూ అండగా నిలుస్తుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి’ అని ట్విట్టర్లో ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గురువారం లక్నోలో తన మొట్ట మొదటి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆమె అమర జవాన్ల మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. - ప్రియాంకా గాంధీ -
జమ్ము కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రదాడి
-
ఎన్నికల వేళ ఛత్తీస్‌లో హింస
పర్ణశాల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు పలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో బీఎస్ఎఫ్ ఎస్సైతోపాటు ఓ మావోయిస్టు మృతి చెందారు. కాంకేర్ జిల్లా కట్టకల్– గోమె గ్రామాల మధ్య రహదారిపై బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులు అమర్చిన అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ) పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీఎస్ఎఫ్ ఎస్సై మహేంద్ర సింగ్‌ను రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మహేంద్ర సింగ్‌ది రాజస్తాన్ రాష్ట్రమని అధికారులు చెప్పారు. ఇది గత 15 రోజుల్లో పేలిన నాలుగో ఐఈడీ కావడం గమనార్హం. బిజాపూర్ జిల్లా బద్రె సమీపంలోని అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికలు జరిగే బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో పోలీసులు, ఎన్నికల సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లు, బూబీ ట్రాప్లను పోలీసులు గుర్తించి, వెలికితీశారు. దంతెవాడ జిల్లా కోసల్‌నార్ గ్రామంలో డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల జాడలను గుర్తించామని ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. నేడే మొదటి విడత పోలింగ్ ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొదటి విడత పోలింగ్‌కు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు గాను 18 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. వీళ్లు రియల్ ‘న్యూటన్’లు! సుక్మా: పాదరక్షలు లేకుండానే నదులు దాటాలి. అరకొర భద్రతా సిబ్బంది వెంటరాగా దట్టమైన అరణ్యాల గుండా ప్రయాణించాలి. రవాణా మార్గాలు లేనిచోటికి విమానాలు, హెలికాప్టర్ల ద్వారా చేరివేత..ఇవీ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పడుతున్న పాట్లు. పోలింగ్ అధికారిగా వెళ్లిన ఓ వ్యక్తి ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వ్యంగ్యంగా చూపించిన న్యూటన్ చిత్రంలోని అనుభవాల్ని తాము నిజ జీవితంలో చూస్తున్నామని కొందరు అభిప్రాయపడగా, మరికొందరైతే తమని తాము విప్లవ యోధుడు భగత్‌సింగ్‌తో పోల్చుకుంటున్నారు. తొలి దశ ఎన్నికలు జరగనున్న బస్తర్‌ను అత్యంత సున్నిత ప్రాంతంగా ప్రకటించారు. ఇటీవల అక్కడ వరుసగా మావోయిస్టులు దాడులకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అయినా వెరవకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. పోలింగ్ బూత్‌లకు చేరుకోవడానికి మైళ్ల దూరం నడిచినా, ప్రాణాలకు ముప్పున్నా ఎవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. కొంత భయంగా ఉందని కొందరు చెప్పినా, ఎన్నికల విధులు నిర్వర్తించడం తమకు ఇష్టమేనని తెలిపారు. సుక్మాకు చెందిన 22 ఏళ్ల పంచాయతీ ఉద్యోగి ఒకరు స్పందిస్తూ తనకు ఇది గర్వకారణమైన క్షణమని, తన గ్రామంలో హెలికాప్టర్లో ప్రయాణించిన తొలి వ్యక్తిని తానేనని సంతోషం వ్యక్తం చేశారు. బీజాపూర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని, భగత్‌సింగ్ తన స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. -
చత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌కు ముందు మావోయిస్టుల విధ్వంసం
రాయపూర్ : చత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్‌కు ముందు ఆదివారం కంకేర్ జిల్లాలో జరిగిన మావోయిస్ట్‌ల దాడిలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. కట్టకల్, గోమ్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో నక్సల్స్ బీఎస్ఎఫ్ బృందంపై ఐఈడీని పేల్చి విధ్వంసం సృష్టించారని కంకేర్ ఎస్పీ కేఎల్ ధ్రువ్ పేర్కొన్నారు. నక్సల్ దాడిలో గాయపడిన ఎస్ఐ మహేంద్రసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం ఆరు ఐఈడీలు అమర్చిన మావోలు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి పేల్చినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన ఎన్కౌంటర్లో శనివారం ఓ మావోయిస్టు మరణించగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఇటీవల మావోయిస్టులు జరిపిన దాడిలో ఇద్దరు భద్రతా దళ సిబ్బందితో పాటు దూరదర్శన్ కెమెరామెన్ మరణించిన సంగతి తెలిసిందే. గత 15 రోజుల్లో మావోయిస్టులు చత్తీస్‌గఢ్‌లో చేపట్టిన ఐఈడీ పేలుడు ఇది నాలుగవది కావడం గమనార్హం.90 మంది సభ్యులు కలిగిన చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 12న, 20న రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. -
వరుస బాంబు పేలుళ్లు: పోలీస్ మృతి
పెషావర్ : పాకిస్థాన్‌లోని పెషావర్‌లో బుధవారం రెండు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఓ పోలీస్ దుర్మరణం పాలైయ్యాడు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని మాత్ర ప్రాంతంలో రహదారిపై వెళ్తున్న పోలీస్ వాహనమే లక్ష్యంగా బాంబు పేలుడు సంభవించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా ఘటన స్థలికి చేరుకున్నారు. ఆ క్రమంలో మరో బాంబు పేలుడు సంభవించింది. దీంతో స్థానికంగా ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఈ పేలుళ్లలో పోలీసులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని లేడి రీడింగ్ ఆసుపత్రికి తరలించారు.నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు బాధ్యులం తామేనంటూ ఏ సంస్థ ప్రకటించ లేదు.