సుక్మాలో ఈవీఎంలతో హెలికాప్టర్ ఎక్కుతున్న ఎన్నికల సిబ్బంది
పర్ణశాల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు పలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో బీఎస్‌ఎఫ్ ఎస్సైతోపాటు ఓ మావోయిస్టు మృతి చెందారు. కాంకేర్ జిల్లా కట్టకల్– గోమె గ్రామాల మధ్య రహదారిపై బీఎస్‌ఎఫ్ జవాన్లు తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులు అమర్చిన అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ) పేలింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీఎస్‌ఎఫ్ ఎస్సై మహేంద్ర సింగ్‌ను రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మహేంద్ర సింగ్‌ది రాజస్తాన్ రాష్ట్రమని అధికారులు చెప్పారు. ఇది గత 15 రోజుల్లో పేలిన నాలుగో ఐఈడీ కావడం గమనార్హం. బిజాపూర్ జిల్లా బద్రె సమీపంలోని అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికలు జరిగే బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో పోలీసులు, ఎన్నికల సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లు, బూబీ ట్రాప్‌లను పోలీసులు గుర్తించి, వెలికితీశారు. దంతెవాడ జిల్లా కోసల్‌నార్ గ్రామంలో డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల జాడలను గుర్తించామని ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.
నేడే మొదటి విడత పోలింగ్
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొదటి విడత పోలింగ్‌కు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు గాను 18 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.
వీళ్లు రియల్ ‘న్యూటన్’లు!
సుక్మా: పాదరక్షలు లేకుండానే నదులు దాటాలి. అరకొర భద్రతా సిబ్బంది వెంటరాగా దట్టమైన అరణ్యాల గుండా ప్రయాణించాలి. రవాణా మార్గాలు లేనిచోటికి విమానాలు, హెలికాప్టర్ల ద్వారా చేరివేత..ఇవీ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పడుతున్న పాట్లు. పోలింగ్ అధికారిగా వెళ్లిన ఓ వ్యక్తి ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వ్యంగ్యంగా చూపించిన న్యూటన్ చిత్రంలోని అనుభవాల్ని తాము నిజ జీవితంలో చూస్తున్నామని కొందరు అభిప్రాయపడగా, మరికొందరైతే తమని తాము విప్లవ యోధుడు భగత్‌సింగ్‌తో పోల్చుకుంటున్నారు. తొలి దశ ఎన్నికలు జరగనున్న బస్తర్‌ను అత్యంత సున్నిత ప్రాంతంగా ప్రకటించారు. ఇటీవల అక్కడ వరుసగా మావోయిస్టులు దాడులకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
అయినా వెరవకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. పోలింగ్ బూత్‌లకు చేరుకోవడానికి మైళ్ల దూరం నడిచినా, ప్రాణాలకు ముప్పున్నా ఎవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. కొంత భయంగా ఉందని కొందరు చెప్పినా, ఎన్నికల విధులు నిర్వర్తించడం తమకు ఇష్టమేనని తెలిపారు. సుక్మాకు చెందిన 22 ఏళ్ల పంచాయతీ ఉద్యోగి ఒకరు స్పందిస్తూ తనకు ఇది గర్వకారణమైన క్షణమని, తన గ్రామంలో హెలికాప్టర్‌లో ప్రయాణించిన తొలి వ్యక్తిని తానేనని సంతోషం వ్యక్తం చేశారు. బీజాపూర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని, భగత్‌సింగ్ తన స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment