చెప్పుకోదగ్గ హింసాత్మక ఘటనలు లేకుండా కనీసం రెండేళ్లనుంచి ప్రశాంతంగా కనబడుతున్న ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం నక్సలైట్లు ఐఈడీ పేల్చి మినీ బస్సులో వెళ్తున్న పదిమంది జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్‌జీ) పోలీసులనూ, ఒక డ్రైవర్‌నూ హతమార్చిన ఉదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పల్నార్–అరణ్‌పూర్ మధ్యలో ఇటీవలే నిర్మించిన రహ దారిపై ఈ ఐఈడీని అమర్చారనీ, అది కూడా రెండు మూడురోజుల క్రితమేననీ వస్తున్న కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
ఆదివాసీల హక్కుల కోసం తుపాకులు పట్టామని చెబుతున్న మావోయిస్టుల్లోగానీ, వారిని ఎదుర్కొంటున్న భద్రతా బలగాల తీరులోగానీ ఏ మార్పూ రాలేదని తాజా ఘటన చెబుతోంది. ఒకప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభావవంతంగా ఉన్న వామపక్ష తీవ్ర వాదం చాన్నాళ్లుగా తగ్గుముఖం పట్టింది. 2000కు ముందు పది రాష్ట్రాల్లోని 200 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తే ఆ సంఖ్య 2021 నాటికి 41కి పడిపోయిందంటున్నారు.
ఇప్పుడది 25 జిల్లాలకు మాత్రమే పరిమితమైందనీ, గత ఎనిమిదేళ్లలో నక్సల్ సంబంధిత హింసాత్మక ఘటనలు 55 శాతం తగ్గాయనీ, మరణాలు కూడా 63 శాతం తగ్గాయనీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నాలుగు నెలల క్రితం విడుదల చేసిన నివేదిక తెలిపింది. హింసను కట్టడి చేయ టానికి అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న పర్యవ సానంగా మావోయిస్టుల లొంగుబాట్లు కూడా అధికంగానే ఉన్నాయని ఆ నివేదిక వివరించింది.
అయితే ఇలాంటి విజయాలే పోలీసు బలగాల్లో ఒక రకమైన నిర్లక్ష్యానికి దారితీశాయా అన్నది ఆలోచించుకోవాలి. తాజా ఉదంతాన్నే తీసుకుంటే అరణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావో యిస్టుల కదలికలున్నాయని అందిన సమాచారంతో డీఆర్‌జీ పోలీసులు అక్కడికి వెళ్లారు. వెళ్లేముందూ, తిరిగొచ్చేటప్పుడూ ఒకే మార్గాన్ని ఉపయోగించకూడదన్న నిబంధన ఉంది. ఒకవేళ తప్పని సరైతే రెండుసార్లూ బలగాల కన్నా ముందు ఒక ప్రత్యేక టీం వెళ్లి ఆ దారిలో మందుపాతరలు, ఇతరత్రా బాంబులు లేవని నిర్ధారించాలి.
పైగా ఈమధ్యకాలంలో మావోయిస్టుల వైపునుంచి ఐఈడీల వినియోగం బాగా ఎక్కువైందని తెలుస్తూనే ఉంది. గత నాలుగు నెలల్లో ఐఈడీలు గుర్తించి వెలికితీసిన ఉదంతాలు 34 వరకూ ఉన్నాయని వార్తలు వెలువడ్డాయి. గతంలో భారీయెత్తున ఆది వాసీలను సమీకరించి పోలీసు బలగాలపై విరుచుకుపడిన మావోయిస్టులు ఇటీవల తక్కువమందితో బృందాలను ఏర్పాటుచేసి దాడులకు దిగుతున్నారని ఒక మీడియా కథనం తెలిపింది. పైగా లోగడ కేవలం అయిదారు కేజీల ఐఈడీని పేలుళ్లకు వినియోగిస్తే ఇప్పుడది 30, 40 కేజీలవరకూ ఉంటోంది.
అందువల్ల ప్రాణనష్టం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించి అయినా అరణ్‌పూర్ వెళ్లిన డీఆర్‌జీ పోలీసులు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. ఒకప్పుడు లొంగిపోయిన ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రైవేటు దళాలను ఏర్పాటుచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని రద్దుచేయక తప్పలేదు. ఆ తర్వాతే ఛత్తీస్‌గఢ్ పోలీసు విభాగంలో డీఆర్‌జీ పేరుతో ప్రత్యేక దళం ఏర్పాటయింది.
ఇందులో కూడా అత్యధికులు లొంగిపోయిన మావోయిస్టులు. వారంతా ఆదివాసీలు. కనుక మావోయిస్టులకు వారిపై గురి ఉంటుంది. అటువంటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఘటన జరిగిన ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టులు బలంగా ఉండేవారనీ, ఇప్పుడు వారి ప్రభావం పూర్తిగా పోయిందనీ మీడియా కథనాలు చెబుతున్నాయి. డీఆర్‌జీ పోలీసుల్లో నిర్లక్ష్యానికి అది కూడా కారణమైవుండొచ్చు.
ఒకప్పుడు మధ్య, తూర్పు భారత ప్రాంతాల్లో ఎంతో బలంగా ఉన్న తాము ఎందువల్ల బలహీ నపడవలసి వచ్చిందన్న ఆత్మవిమర్శ మావోయిస్టుల్లో కొరవడిందని తాజా ఉదంతం చెబుతోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడటం వల్ల ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తాయే తప్ప దానివల్ల కలిగే మార్పేమీ ఉండదని పదే పదే రుజువవుతోంది. మావోయిస్టులు ఏదో ఒక చర్యకు పాల్పడగానే సమీప ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలపై పోలీసులు విరుచుకుపడటం, అమాయ కులు సైతం బాధితులుగా మారడం చాన్నాళ్లుగా కనబడుతూనే ఉంది.
అరెస్టులు, కేసులు, ఏళ్ల తరబడి జైళ్లపాలు కావటం పర్యవసానంగా ఆదివాసీ కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. పోషించేవారు లేక ఎన్నో కుటుంబాలు చెప్పనలవికాని ఇబ్బందులు పడుతున్నాయి. గతంతో పోలిస్తే మావోయిస్టుల ప్రభావంలో ఉన్న ప్రాంతాలు తగ్గిపోవడానికి ఇదొక ప్రధాన కారణం. కనీసం ఈ పరిణామమైనా తమ హింసాత్మక చర్యల్లోని నిరర్థకతపై పునరాలోచన కలిగిస్తే బాగుండేది. కానీ ఆ మాదిరి మార్పు రాలేదని ఈ ఉదంతం నిరూపించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభి ప్రాయాలను ప్రకటించటానికీ, ప్రభుత్వ విధానాల్లో లోపాలున్నాయనుకున్నప్పుడు వాటికి వ్యతి రేకంగా ప్రజానీకాన్ని కూడగట్టడానికీ ఎప్పుడూ అవకాశాలుంటాయి.
అలాంటి ఉద్యమాలను ప్రభుత్వాలు అణచివేయటానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటన కూడా అదే స్థాయిలో వస్తున్నది. సాగు చట్టాలపై ఏడాదిపైగా సాగిన రైతు ఉద్యమాన్ని నయానా భయానా నియంత్రించాలనుకున్న కేంద్రం చివరకు వారి డిమాండ్లకు తలొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకోకతప్పలేదు. వీటన్నిటినీ మావోయిస్టులు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించే ప్రయత్నం చేయాలి. తమ హింసాత్మక చర్యలవల్ల సాధించేదేమీ లేకపోగా ఆదివాసులే కష్టనష్టాలు అనుభవించాల్సి వస్తున్నదని గుర్తించాలి.
నెత్తురు చిందిన బస్తర్
Published Sat, Apr 29 2023 2:46 AM | Last Updated on Sat, Apr 29 2023 2:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment